Tuesday, January 31, 2023
More
  Homelatestఆదివాసుల‌కు ఉన్న‌త ప‌ద‌వులు.. అలంకార‌ప్రాయ‌మేనా?

  ఆదివాసుల‌కు ఉన్న‌త ప‌ద‌వులు.. అలంకార‌ప్రాయ‌మేనా?

  • గిరిజ‌న పాఠ‌శాల‌ల స‌మ‌స్య‌లు ఎన్న‌డు తీరేను?

  విధాత‌: దేశ ప్ర‌థ‌మ పౌరురాలు ఆదివాసీ మ‌హిళ‌. రాష్ట్ర ముఖ్య‌మంత్రి గిరిజ‌నుడు. ఆప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గిరిజ‌న నేత గిరిజ‌న వ్య‌వ‌హారాలను చూసే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆదివాసుల స‌మ‌స్య‌లు ఏవైనా ప‌రిష్కారానికి నోచుకుంటాయ‌ని అంద‌రూ భావిస్తారు. కానీ అది వాస్త‌వ విరుద్ధం. అదివాసీ తెగ నుంచి అత్యున్న‌త ప‌ద‌విని చేప‌ట్టినా.. త‌మ జాతికి చేస్తున్నదేమీ ఉండ‌టం లేదు!

  జార్ఖండ్‌లోని ఖూంటి జిల్లా ఉలిహాతూ గ్రామం ఆదివాసీ హీరో బీర్సాముండా పుట్టిన ఊరు. ఈ గ్రామం కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖామంత్రి అర్జున్‌ముండా నియోజ‌క వ‌ర్గంలోనే ఉన్న‌ది. ఉలిహాతూ గ్రామంలో బిర్సా రెసిడెన్షియ‌ల్ స్కూల్ ఉన్న‌ది. సుమారు రెండు వంద‌ల మంది విద్యార్థుల‌న్న పాఠ‌శాల‌లో ముగ్గురు రెగ్యుల‌ర్ ఉపాధ్యాయులుంటే, 13 మంది తాత్కాలిక ఉపాధ్యాయులుగా ప‌ని చేస్తున్నారు. విద్యార్థులకు మ‌రుగు దొడ్లు లేవు. మ‌ల మూత్ర విస‌ర్జ‌న కోసం వారు స‌మీప అడవిలోకే పోవాలి. తాగునీటి క‌ట‌క‌ట అంతా ఇంతా కాదు. ఎవ‌రి నీళ్లు వారే తెచ్చుకొని తాగాలి. విద్యార్థుల‌కు కూర్చోవ‌టానికి బేంచీలు కాదు, క‌నీసం చాప‌లు కూడా లేవు.

  బిర్సాముండా ఆదివాసుల హీరో. గిరిజ‌నుల‌ హ‌క్కులు, స్వ‌యం ప్ర‌తిప‌త్తికోసం పోరాటం చేసిన యోధుడా య‌న‌. ఉలిహాతూ గ్రామం జార్ఖండ్ రాష్ట్ర రాజ‌ధాని రాంచికి 64 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్న‌ది. ఈ మ‌ధ్య‌నే ఈ పాఠ‌శాల‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా సంద‌ర్శించారు. అయినా ఆ గిరిజ‌న పాఠ‌శాల‌లో క‌నీస వ‌స‌తులు లేక పోవ‌టం గ‌మ‌నార్హం.

  గుల్మాజిల్లా నేత‌ర్‌హాట్ అట‌వీ ప్రాంతంలోని జోభేపాట్ గ్రామంలో ఓ గ‌వ‌ర్న‌మెంట్ షెడ్యూల్ ట్రైబ‌ల్ హై స్కూల్ ఉన్న‌ది. ఈ పాఠ‌శాల‌లో 248మంది విద్యార్థులున్నారు. 1955లో ప్రారంభ‌మైన ఈ పాఠ‌శాల‌లో కూడా విద్యార్థుల‌కు క‌నీస వ‌స‌తులు లేవు. వారంతా వాట‌ర్ క్యాన్లు ప‌ట్టుకొని రోజుకు రెండు సార్లు అడివికి పోయి మంచినీరు తెచ్చుకొంటారు.

  రాంచికి 122 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గ్రామ ప‌రిస‌రాల్లో బాక్సైట్ త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయి. ఈ త‌వ్వ‌కాల‌తో ఆ ప్రాంతంలోని భూ గ‌ర్భ జ‌లాలు ఇంకిపోయాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు తాగునీటి స‌మ‌స్య చాలా తీవ్రం అయ్యింది. ఆదివాసుల స‌మ‌స్య‌లు ఎప్పుడు ప‌రిష్కార‌మ‌వుతాయి? ఎవ‌రు ప‌ట్టించుకోవాలి? అత్యున్న‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో ఆదివాసీ మ‌హిళ ఉన్న‌ప్పుడు కూడా తాగునీరును అందించలేక పోతే ఎలా? ఆదివాసుల గోడు అర‌ణ్య‌రోద‌నేనా? ఉన్న‌త ప‌ద‌వులు అలంకార‌ప్రాయ‌మేనా?

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular