- నిగ్గుదేల్చిన హిండెన్ బర్గ్ నివేదిక
- ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టీకరణ
విధాత: గౌతం అదానీ… నిన్న మొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచాడు. తాజా గణాంకాల ప్రకారం… ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లోనే మూడో వాడిగా కొనసాగుతున్నాడు. దేశంలో అత్యంత ధనవంతుడిగా, ప్రధాని మోదీకి అత్యంత దగ్గరివాడుగా ప్రభుత్వంపై, పాలనావిధానాలపై ప్రభావ శీలిగా అదానీకి పేరున్నది.
గుజరాత్‌లోని ఓ మధ్యతరగతి బట్టల వ్యాపారస్తుడి కుటుంబం నుంచి ఎదిగివచ్చిన అదానీ గుజరాత్ లో నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే వేల కోట్లకు పడగెత్తాడు. దేశ ప్రధానిగా మోదీ అధికారం చేపట్టగానే అదానీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. అదానీ లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
ఈ నేపథ్యంలోంచే.. అదానీ అనేక కంపెనీలను స్థాపించాడు. పోర్టులు, విద్యుత్ ఉత్పత్తి, ఎయిర్ పోర్టులు, మైనింగ్, నూనెలు, సిమెంట్, మీడియా ఇలా… అనేక రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించా డు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి లిస్టెడ్ కంపెనీలుగా ఉన్నవే.. ఏడు కంపెనీలున్నాయి. ఈ ఐదేండ్ల కాలంలోనే అదానీ కంపెనీల విలువ 1500 శాతం పెరిగిపోయింది. 11 లక్షల కోట్ల సంపదతో అతి తక్కువ కాలంలో ప్రపంచ కుబేరుల్లో ఒకనిగా ఎదిగాడు. 127 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంపద కలవాడుగా బెర్నార్డ్ అర్నాల్ట్, ఎలాన్ మస్క్ తదుపరి స్థానాల్లో నిలిచాడు.
దేశంలో శతాబ్దాలుగా వ్యాపారాలు కలిగి ఉన్న సంప్రదాయ వాణిజ్య కుటుంబాలకన్నా అదానీ రెండు దశాబ్దాల్లోనే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. టాటా, బిర్లా లాంటి వారిని వెనుకకు నెట్టి దేశంలోనే నంబర్ వన్ కుబేరుడిగా అవతరించాడు. ఈ నేపథ్యంలోంచే… రాజకీయ పక్షాలు మోదీతో సాన్నిహిత్యంపై ఆరోపణలు చేశాయి, చేస్తున్నాయి. దానికి.. ఆయన, ’ఔను… నాకు అన్ని రాజకీయ పక్షాలతో మంచి సంబంధాలున్నాయి‘ అని చెప్పుకోవటం గమనార్హం.
అదానీ గ్రూప్ కంపెనీల డైరెక్టర్లు చూడటానికి 22 మంది ఉన్నా అందులో ఎనిమిది మంది ఆయన కుటుంబ సభ్యులే. ఒక రకంగా అదానీ గ్రూప్ కంపెనీలదంతా ఓ కుటుంబ వ్యవహారంగా.. సెబీ నిబంధనలన్నీ ఉల్లంఘించిన దాఖలాలున్నాయనే విమర్శలు ఉన్నాయి. అనేక దేశాల్లో గుల్ల (షెల్) కంపెనీలు, డొల్ల కంపెనీలు తెరిచి వాటి ద్వారా దేశంలోని కంపెనీలకు పెట్టుబడులు వస్తున్నట్లు మదుపరులను నమ్మించి షేర్ల ధరలు పెంచి సొమ్ము చేసుకొన్నాడనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. ఆ క్రమంలోంచే విదేశాల నుంచి 220 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయనీ, వాటితో గ్రీన్ ఎనర్జీ సంస్థలు విస్తరించాయని అదానీ చెప్పుకొచ్చాడు.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే… గౌతం అదానీ తమ కంపెనీల షేర్ల ధరలను అక్రమంగా ఎక్కువగా చూపి అందరీనీ మోసం చేశాడనీ, చిన్న మదుపరులనుంచి అక్రమంగా డబ్బు మూటగట్టు కొన్నాడనీ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ సంపద అంతా అక్రమమేనని తేల్చి చెప్పింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా అదానీ గ్రూపునకు చెందిన పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. హిండెన్ బర్గ్ రిపోర్టు వెలుగుచూసిన రెండు రోజుల్లోనే అదానీ కంపెనీలు 4 లక్షల కోట్ల రూపాయలదాకా నష్టపోయాయి.
గౌతం అదానీ హిండెన్ బర్గ్ రిపోర్టును తీవ్రంగా ఖండించాడు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, మోసాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చాడు. తమ కంపెనీలపై నిరాధార ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్ బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు పెడుతానని హెచ్చరించాడు.
అదానీ బెదిరింపులకు హిండెన్ బర్గ్ కూడా దీటుగానే జవాబిచ్చింది. తమ రిపోర్టులో చెప్పిన ప్రతి అక్షరానికీ తాము కట్టుబడి ఉన్నామనీ, వాటికి అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపింది. 720 ఆధారాలతో… 106 పేజీల రిపోర్టులో తాము చెప్పినవన్నీ అక్షరసత్యాలని ప్రకటించింది. అదానీ గ్రూప్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు దేశాల్లో తాము క్షేత్రస్థాయి పరిశీలనతో, 45 నిర్ధారణలతో తమ రిపోర్టు రూపొందించామని తెలిపింది.
అదానీ గ్రూప్ కంపెనీలకు 23. 34 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ తమ మూల విలువకు ఏమాత్రం ప్రమాదం కాదని, అవన్నీ తమ అదుపులోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ… నిజానికి ఈ అప్పులన్నీ ఆయా కంపెనీల షేర్ల ధరలు ఎక్కువగా చూపి.. వాటిని ధరావతుగా పెట్టి చేసినవని చెబుతున్నారు. ఇప్పుడు హిండెన్ బర్గ్ రిపోర్టుతో ఈ కంపెనీల షేర్ ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో… నష్టపోయేది అప్పులు ఇచ్చిన బ్యాంకులు, షేర్లు కొన్న చిన్న మదుపరి దారులేనన్నది గమనించాలి.
ఈ మధ్యనే ప్రముఖ హిందీ టీవీ షో పీపుల్స్ కోర్టులో పాల్గొన్న సందర్భంగా… తాను సహజంగా సిగ్గరినని, పబ్లిక్‌లో పేరుకోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని అదానీ చెప్పుకొన్నాడు. ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలు తనపై చేస్తున్న ఆరోపణలతో అందరికీ తెలిసిపోయి, సెలబ్రిటీ అయిపోయానని సెలవిచ్చాడు.