ఉన్నమాట: ముస్లిం రజాకార్లు చేసిన గాయాలు మానక ముందే, ఘోరాలు, మారణకాండ, అకృత్యాలు మరవకముందే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇంకా సజీవంగా ఉన్నప్పుడే హిందూ రజాకార్లు తెలంగాణ పోరాటాలను, త్యాగాలను చెరిపి వేయడానికి కుట్ర చేస్తున్నారు. అసమానమైన తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, చరిత్రపై హిందూ మతోన్మాదులు రాక్షసబల్లుల వలె దాడి ప్రారంభించారు. రజాకార్లు గ్రామాలపై పడి మగవాల్లను చంపి, స్త్రీలను పిల్లల ముందే మానభంగం చేసి రాక్షసానందం పొందినప్పుడు జమీందార్ల, దేశ్ ముఖ్‌ల ఘడీలలో విందులు […]

ఉన్నమాట: ముస్లిం రజాకార్లు చేసిన గాయాలు మానక ముందే, ఘోరాలు, మారణకాండ, అకృత్యాలు మరవకముందే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇంకా సజీవంగా ఉన్నప్పుడే హిందూ రజాకార్లు తెలంగాణ పోరాటాలను, త్యాగాలను చెరిపి వేయడానికి కుట్ర చేస్తున్నారు. అసమానమైన తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, చరిత్రపై హిందూ మతోన్మాదులు రాక్షసబల్లుల వలె దాడి ప్రారంభించారు.

రజాకార్లు గ్రామాలపై పడి మగవాల్లను చంపి, స్త్రీలను పిల్లల ముందే మానభంగం చేసి రాక్షసానందం పొందినప్పుడు జమీందార్ల, దేశ్ ముఖ్‌ల ఘడీలలో విందులు చేసిన హిందూ మహాసభ, ఆర్య సమాజ్ సంఘాల కార్యకర్తలు ముస్లిం రజాకార్ల దుశ్చర్యలను గుర్తు చేయడానికి ఇప్పుడు తెలంగాణకు అనేక రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు.

నిజాం కాలంలో ఆర్య సమాజ్ హిందూ మహాసభ సంస్థలు దేశ ముఖ్‌లు జమీందార్లు సాగించే దోపిడీని సపోర్ట్ చేస్తూ, నిజాం సర్కార్ కూలి పోవాలని అభిలషించే వాళ్లు. నిజాంకు వ్యతిరేకంగా బహిరంగంగా ఎలాంటి చర్యలు తీసుకునే వారు కాదు. అదే సమయంలో హిందూ పెత్తందారుల చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రచారం చేసే వారు.

ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే హిందూ మహాసభ, ఆర్య సమాజం నాయకత్వం చేతి వృత్తుల వారు వ్యవసాయ ఆధార వృత్తుల వారు అనుభవిస్తున్న దోపిడీని పరిగణలోకి తీసుకునేవి కావు. స్థూలంగా 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అధికారం కోల్పోవాలి కానీ నిజాంకు సంపూర్ణ సహకారం ఇస్తూ గ్రామాలలో అధికారం చెలాయిస్తున్న హిందూ పెత్తందార్లు, దేశముఖ్‌లు మాత్రం అధికారంలో కొనసాగాలి.

వీరి దినసరి కార్యక్రమం తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి వీధుల్లో భజనలు చేసి భోజన సమయానికి దేశముఖ్‌ల ఇండ్లలో చేరి వారిని కీర్తిస్తు బోంచేయడమే. వీరి ప్రధాన కర్తవ్యం కుల వ్యవస్థ ఆధారంగా ఏర్పడిన జమిందారి విధానాన్ని సమర్దించాలి.. దోపిడికి గురవుతున్న అట్టడుగు వర్గాల బాదలను పట్టించుకోవద్దు. మను స్మృతి సిద్ధాంతాన్ని సంపూర్ణంగా అమలు పరిచారు. గ్రామాల్లో జరుగుతున్న అత్యాచారాలు దోపిడీలు వీరి భజనలలో, సమావేశాలలో వినిపించేవి కావు.

నిజాం అధికారానికి మూల స్తంభాలైన పెత్తందార్లు బలహీన పడకుండా నిజాంను కూల్చడం సాధ్యం కాదు అని కమ్యునిస్టుల అభిప్రాయంగా ఉండేది. అందుకే చాలా మంది హిందూ సంస్థలను వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆరుట్ల లక్ష్మీ నరసింహ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం లాంటి చాల మంది అగ్ర నాయకులు ఈ సంస్థల నుంచి కమ్యూనిస్టు పార్టీలో చేరిన వారే.

ఈ సంస్థలు సూచించిన విప్లవాత్మక మార్పులు ఏమిటంటే హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదు. వీరు ముస్లిం మత వ్యతిరేక విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు కానీ ముస్లిం రాజుకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాత్మకమైన చర్య తీసుకోలేదు. రజాకార్లు గ్రామాలపై దాడులు చేశారు. స్త్రీలను మానభంగం చేశారు. అనేకమందిని చంపారు.

అయితే ఏ ఒక్క దాడిని ఈ సంఘపరివార్ ఎదిరించ లేదు, ప్రతిఘటించ లేదు సరి కదా రజాకార్లు దేశ్ము ఖ్‌ల గడీల ముందు బయట బిర్యానీలు తింటుంటే, హిందు మహసభ కార్యకర్తలు దేశముఖ్‌ల క్షేమం కొరకు గడీలలో పూజలు చేసేవారు. రజాకార్ల, సంఘ్ పరివార్ కార్యకర్తల ఉమ్మడి ప్రధాన కర్తవ్యం దేశముఖ్ ల క్షేమం. రజాకార్లు జెర్రీపోతుల గూడెం గ్రామం పైబడి ఒకే రోజు 3సార్లు ఆ గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ను మానభంగం చేశారు. అందుకు ప్రతీకారంగా కమ్యూనిస్టు గెరిల్లా దళాలు రజాకార్లపై దాడి చేశాయి.

1946 జూలై 4న జరిగిన దొడ్డి కొమరయ్య వీర మరణం తెలంగాణ విముక్తి ఉద్యమాన్ని తెలంగాణ మొత్తం విస్తరింప చేసింది. ప్రజలు గుత్పల సంఘం పెట్టి నిజాం ప్రభుత్వ ఏజెంట్లను గ్రామాల నుంచి తరిమేస్తుం టే సంగ్ పరివార్ కార్యకర్తలు ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా హిందూ మతం పేరు మీద నిజాం ప్రభుత్వం ఏజెంట్లకు సహాయం చేసేవారు.

విసునూరు దేశముఖ్ చాకలి ఐలమ్మపై దాడి చేసినప్పుడు కమ్యూనిస్టులే అండగా నిలబడి ఆమె పంటను రక్షించారు. నిజాం వ్యతిరేక, రజాకార్ల వ్యతిరేక పోరాటాలలో దాదాపు నాలుగు వేల మంది అసువులు భాసారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ వారు. కానీ ఒక్క హిందూ మహాసభ కార్యకర్త కూడ రజాకార్ల దాడులలో చనిపోలేదు.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జాతీయ జెండాను ఎగర వేయకుండా నిజాం ప్రభుత్వం, రజాకార్లు అనేక హింసాత్మక చర్యలు చేపట్టారు. అప్పుడు హిందూ మహాసభ కూడ జాతీయ జెండాను గుర్తించ నిరాకరించింది. పోలీస్ యాక్షన్ జరిగి, నిజాం ప్రభుత్వాన్ని తొలగించే వరకు హిందూ రజాకార్లు, ముస్లిం రజాకార్లు, నిజాం ప్రభుత్వం జాతీయ జెండా తెలంగాణలో ఎగురవేయ వేయకుండా చర్యలు తీసుకున్నాయి.

హిందూ మహాసభ చరిత్ర అంతా బ్రిటిష్ వారికి ఊడిగం చేయడమే కదా. స్వాతంత్రోద్యమంలో వారికి ఎలాంటి పాత్ర లేనందున కాంగ్రెస్ పార్టీ నుంచి సర్దార్ పటేల్‌ను అరువు తెచ్చుకున్నారు. సర్దార్ పటేల్ తెలంగాణను భారతదేశంలో కలిపిన మహోన్నత నాయకుడు అని బీజేపీ నాయకులు కీర్తిస్తున్నారు. సర్దార్ పటేల్ అత్యంత ప్రతిభావంతుడు అయితే భారత మిలిటరీ చేతిలో పరాజయం పొందిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌ను, యుద్ధ నేరాలకు గాను మిలిటరీ ట్రిబ్యునల్‌లో నేరస్తునిగా విచారించకుండా, పూర్వ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాజ్ ప్రముఖ్ అంటె గవర్నర్‌గా నియమించాడు?.

భారత దేశంలోని మిగతా రాజ్యాలన్నీ స్వచ్ఛందంగా విలీనం చేయడం వలన వారికి తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం సమంజసం. ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 50 వేల మంది వరకు చనిపోయారు, అలాంటి నాజీ వారసుడికి సంవత్సరానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడం, ప్రజల పన్నుల ద్వారా కొనుక్కున్న బంగారం, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు అన్ని నిజాం సొంత ఆస్తులని స్వతహాగా సర్దార్ పటేల్ అగ్రిమెంట్ చేశాడు.

రజాకార్లతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు చేయించిన నిజాంకు, సర్దార్ పటేల్ కల్పించిన సౌకర్యాలు ప్రజల మనోభావాలను దెబ్బ తీశాయి. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి చివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాంకు జవాబుదారిగా ఉండాల్సిన దుస్థితిని పటేల్ కల్పించాడు.

సర్దార్ పటేల్ నిజాంకు కల్పించిన పరిహారాన్ని రద్దు చేస్తూ ప్రధాని ఇందిరాగాంధీ 1970లో భారత రాజ్యాంగానికి 24వ సవరణ ప్రవేశపెడితే, జన సంఘ్ నాయకుడు అటల్ బిహారీ వాజపేయ్ ఆ సవరణ వ్యతిరేకిస్తూ ఓటు చేశాడు. హిందూ మహాసభకు నిజాంకు ఉన్న అనుబంధం చాలా ప్రాచీనమైనది.

1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేశారు. అప్పుడే జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, సవార్కర్ నాయకత్వంలోని హిందూ మహాసభ కలిసి మంత్రి వర్గాలను వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేశాయి. ముస్లిం లీగ్‌కు చెందిన సింధు రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం హిదాయతుల్లా నాయకత్వంలో సింద్ అసెంబ్లీ దేశంలో మొట్ట మొదటి సారిగా పాకిస్థాన్ ఏర్పడాలని 1943లో అని తీర్మానించింది.

పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత కూడ సింధూ రాష్ట్ర మంత్రివర్గంలో హిందూ మహాసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు, రావు సాహెబ్ గోకుల్ దాస్ మేవాల్ దాస్, డాక్టర్ హేమాన్ దాస్ వాద్వాన్, లోలుమాల్ మోత్వాని మరియు అదే సమయంలో బెంగాల్ ముస్లిం లీగ్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పదవులకు రాజీనామా చేయకుండా కొనసాగారు. ఎవరు మనస్ఫూర్తిగా పాకిస్తాన్ ఏర్పాటును ప్రోత్సహించింది? వీరి భావ సారూప్యతకు ప్రధాన తార్కాణం భారత జాతీయ జెండాను వ్యతిరేకించడమే.

తెలంగాణ ప్రజల అభీష్టానానికి వ్యతిరేకంగా నిజాం ప్రధాన వ్యవస్థ అయినా దేశ్ ముఖ్‌లను, జాగీర్ దార్లను బలపరిచిన హిందూ మహాసభ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పని చేసింది. అదే తరహాలో ఇప్పుడు బీజేపీ పని చేస్తోంది. తల్లిని చంపి బిడ్డను ప్రసవింప చేశారని తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నాడు.

ప్రధాని మోదీ మొదటి చర్య అప్పుడే పుట్టిన శిశువు లాంటి తెలంగాణలోని ఏడు మండలాలను, ఒక పవర్ ప్లాంట్ ను వేరు చేయడం నుండి ఇప్పటివరకు తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క సంవత్సరం వరకు అధికారులను కేటాయించకుండా పాలనను అడ్డుకున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయకుండా ఉండినట్లైతే తెలంగాణ అభివృద్ధి ఇంకా ఎక్కువగా జరిగి ఉండేది.

మోడీ దళారి దళాలు తెలంగాణపై విరుచుకు పడి సంపదను దోచుకుందామని ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి తెలంగాణపై దాడి చేస్తున్నది. హైదరాబాద్ సంపద గత ఎనిమిది సంవత్సరాలుగా ఊహించనంతగా పెరిగింది. నిజాం వారసత్వం నుంచి వచ్చిన ప్రభుత్వ భూములు, కేంద్ర సంస్థల భూములు, సికింద్రాబాద్‌లో ఉన్న డిఫెన్స్ భూములు లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తాయి.

అలాగే ప్రకృతి ఇచ్చిన సింగరేణి బొగ్గు గని అదాని వ్యాపారానికి అడ్డంకిగా తయారైంది. సింగరేణి బొగ్గు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే బొగ్గును నిలువరించింది. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ చేసి, చౌక ధరకు తీసుకొని దేశ ఎలక్ట్రిసిటీ రంగంపై గుత్తాధిపత్యం కొరకు అదాని ప్రయత్నిస్తున్నాడు. అసలు ప్రశ్న ఏంటంటే అదాని ఎవరికి బినామి? అదానికి తలనొప్పి వస్తె కేంద్ర ప్రభుత్వం ఎందుకు జండూ బామ్ రాసుకుంటున్నది.

కొత్త అవతారం..

ముస్లిం రజాకార్ల అమానుష చర్యలను నిలువరించడానికి ప్రయత్నించని వారు ఇప్పుడు కొత్త అవతారంతో వస్తున్నారు. తెలంగాణలో రజాకార్ల వ్యతిరేక పోరాటంలో ఏ లాంటి పాత్ర పోషించన వారు ఉద్యమ నాయకుల్లాగా చిత్రీకరించుకుంటున్నారు. రజాకార్ల దాడులను హిందూ ముస్లిం తగాదాలుగా తెలంగాణ ఎప్పుడూ పరిగణించలేదు. ఎందుకంటే ముస్లిములు కూడా రజాకార్ల వ్యతిరేక పోరాటంలో హిందువులతో కలిసి వచ్చారు. తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన గుజరాతీ, సర్దార్ పటేల్‌ను విమోచన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. మత విద్వేష సినిమాలు తీసి, ప్రజలను రెచ్చగొట్టి గుజరాతి వ్యాపార వర్గాల దోపిడీకి దారులు తెరవడానికి బీజేపీ తెలంగాణలో అధికారం పొందాలని చూస్తున్నది.

విద్వేషాన్ని వాణిజ్యీకరణ చేసి రిపబ్లిక్ టీవీ లాభాలు పొందుతున్నది. టాలెంట్,మ్యాటర్‌ లేకున్నా విద్వేషాన్ని కథా వస్తువుగా చేసి లాభాలు గడించవచ్చని కాశ్మీర్ ఫైల్స్ సినిమా నిరూపించింది. HBO ఛానల్‌లో ప్రసారమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరియల్‌ను నేర్పుగా కాపీ కొట్టి బాహుబలి సినిమా తీసి విజయం సాధించిన విజయేంద్రప్రసాద్, రాజమౌళి కలిసి బీజేపీ పర్యవేక్షణలో రజాకార్ ఫైల్స్ అనే సినిమా తీయాలని చూస్తున్నారు.

గడ్డం పెంచుకొని, విశ్వ గురువుగా భావించుకుంటున్న విజయేంద్రప్రసాద్, స్థాయిని మించి మొడీ మెప్పు కొరకు గాంధీ నెహ్రూలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్యన వారు తీసిన RRR మూవీ నిర్మాతలను నిరుత్సాహ పరిచింది. ఎలాంటి ఆర్బాటం లేకుండా వచ్చిన KGF 2 మూవీ RRRను మించి విజయవంత మైంది. కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే తెలంగాణలో మత విద్వేషాలను రగిలించడానికి రజాకార్ల దాడులను ఆధారంగా సినిమా తీస్తారా? కమ్యూనిస్టులు, ప్రగతిశీల ముస్లింలు చేసిన త్యాగాలను విస్మరించి కేవలం కల్పిత పాత్రలతో హిందూ తీవ్రవాదులను హీరోలుగా చిత్రీకరిస్తారా గమనించాల్సిన అవసరం ఉన్నది.

గుజరాత్‌లో 2002లో జరిగిన మత దాడులలో బిల్కిస్ భానొ అనే 21 సంవత్సరాల ముస్లిం యువతిని మానభంగం చేసి, ఆమె మూడు సంవత్సరాల కూతురును, ఏడుగురు కుటుంబ సభ్యులను చంపి జైలుకు వెళ్లిన హిందూ రజాకార్లు చేసిన పనే ముస్లిం రజాకార్లు తెలంగాణలో చేశారు. రెండు చర్యలు జాతి సిగ్గు పడాల్సిన హేయమైనవి. మతం పేరు పైన ఈ చర్యలను సమర్థించడం కూడా దుర్మార్గం.

గుజరాత్ జైలు నుంచి విడుదల అయిన రేపిస్టులు హంతకులు హిందూ రజాకార్ల చేతుల మీదుగా పొందుతున్న సత్కారాల గురించి, గుజరాత్ సమాజంలో పెరిగిన మత విద్వేష స్థాయి కూడా దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. గుజరాత్ అనుభవాన్ని పరిశీలించుకుంటే తెలంగాణ కూడా హిందూ తీవ్రవాదం రాష్ట్రంగా తయారవుతుంది. మహాత్మా గాంధీని చంపిన వారే అయోధ్యలోని రామ జన్మభూమి మందిరం ప్రధాన పూజారి అయిన బాబా లాల్ దాస్‌ను చంపారు. పూజారిని చంపి రామ మందిరం పేరు పైన ఓట్లు, నోట్లు అడుగుతున్నారు.

మొడీ పాలనలో విద్వేషం, వాణిజ్యం, అధికారం, రాజకీయం, అవినీతి పరస్పర ఆధారిత అంశాలుగా అవతరించాయి. ఈ విష వలయం నుంచి బయట పడడం సులభమైన విషయం కాదు. ఈ విష వలయం తీవ్ర రూపం దాలిస్తే దేశంలో, శ్రీలంకలో లాగా, అంతర్యుద్ధం రావడం మాత్రం వాస్తవం. తెలంగాణ ఆస్తులపై, ప్రభుత్వం కంపెనీలపై కన్నెసిన గుజరాతీ దళారుల చర్యలను సమర్థించేందుకు, అమలు పర్చెందుకు మత ఘర్శణలకు సాంస్కృతిక పునాది వేయడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేస్తున్నది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుంది.

- మాధవరం నాగేందర్‌

(‘ఉన్నమాట’ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వేదిక. రచయిత అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.
ఇవి విధాత అభిప్రాయాలు కానవసరం లేదు.)

Updated On 17 Sep 2022 4:23 AM GMT
subbareddy

subbareddy

Next Story