విధాత: ఓ భర్త బరితెగించాడు. తన మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఎందుకంటే.. తిరిగి తన వద్దకు రావడం లేదనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో చోటు చేసుకుంది.
సూరత్ పట్టణానికి చెందిన శంకర్ కాంబ్లే అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం కలగడంతో.. ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం తన భార్యకు కాంబ్లే విడాకులు ఇచ్చాడు. కానీ తిరిగి రావాలని ఆమెను ప్రాధేయపడ్డాడు. ఆమె ఒప్పుకోలేదు.
దీంతో కోపం తెచ్చుకున్న భర్త.. ఆమెను హింసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సూరత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న హెచ్ఐవీ వార్డుకు వెళ్లి.. రక్త పరీక్షల నిమిత్తం నమూనాలను తీసుకోవాలని ఓ రోగిని ఒప్పించాడు. అనంతరం హెచ్ఐవీ పాజిటివ్ రోగి నుంచి రక్త నమూనాలను సేకరించాడు.
ఇక ప్లాన్ ప్రకారం.. మాజీ భార్యను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా సిరంజి ద్వారా హెచ్ఐవీ పాజిటివ్ రోగి రక్తాన్ని ఎక్కించాడు. క్షణాల్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. స్థాానికులు గమనించి ఆస్పత్రిలో ఆమె చేర్చగా.. అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంకర్ కాంబ్లేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.