విధాత: ఒకనాడు మన దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలలో కన్నడ చిత్రాలంటే చాలా చిన్నచూపు ఉండేది. సౌత్ ఇండియన్ చిత్రాలపై చిన్నచూపు ఉన్నప్పటికీ తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలకు ఏదో కాస్త గుర్తింపు మాత్రం ఉందనే చెప్పాలి. కోలీవుడ్‌లో టాలెంటెడ్ చిత్రాలు వస్తాయని…. మాలీవుడ్‌లో అతి సహజమైన సున్నిత భావోద్వేగాలతో కూడిన నేచురాల్టీ ఉన్న చిత్రాలు వస్తాయని ఒక మంచి పేరు ఉండేది.
తెలుగులో మన స్టార్స్‌ని చూసి తెలుగు చిత్రాలపై కూడా అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. బాలకృష్ణ, నాగార్జున.. వంటి వారు ఉన్నారని కాస్త గౌరవం ఇచ్చేవారు. ఇంకా బాలీవుడ్ సంగతి విషయానికి వస్తే అసలు ఇండియన్ సినిమా అంటే మేమే అనే రేంజ్లో వారి ప్రవర్తన ఉండేది. కానీ కన్నడ చిత్రాలంటే కన్నడిగులకే కాదు సాటి దక్షిణాది చిత్ర పరిశ్రమల వారికి కూడా చాలా చిన్న చూపుగా ఉండేది.
దానికి తగ్గట్టుగా కన్నడ చిత్రాలు కూడా నాసిరకంగా రూపొందేవి. చాలా తక్కువ బడ్జెట్లో వాళ్లు సినిమాలు తీసేవారు. కన్నడ సినిమా మార్కెట్ పరిధి చాలా తక్కువ. కాబట్టి వారు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి జంకే వారు. ఏదో పెద్ద పెద్ద స్టార్స్‌తో అయితే మీడియం బడ్జెట్ పెట్టేవారు.. గానీ మామూలు చిత్రాలకు మాత్రం చాలా లో బడ్జెట్‌ను కేటాయించేవారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పెద్ద చిత్రాలు పెట్టిన బడ్జెట్ తెలుగులో మీడియం హీరోలకు కూడా సరిపోదు. ఇక కన్నడ నాట కన్నడ చిత్రాల కంటే తెలుగు, తమిళ చిత్రాలదే హవా. అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల వైపే చూసేవారు.
దాంతో ఒకేసారి తెలుగు, తమిళ చిత్రాలతో పాటు కన్నడ చిత్రాలు విడుదలైతే కన్నడ చిత్రాలకు థియేటర్లు కూడా దొరికేవి కావు. కర్ణాటకలోని థియేటర్లన్నీ తెలుగు, తమిళ సినిమాలతో నిండిపోయేవి. దాంతో కన్నడిగులకు కోపం వచ్చి డబ్బింగ్ చిత్రాలను ఆపివేయాలని, రీమేక్ చిత్రాలు తీయకూడదని ఇలా పలు ఉద్యమాలు చేశారు.
తెలుగులో ఫేడ్ అవుట్ అయినా దర్శకులు, ఏమాత్రం సత్తా లేని డైరెక్టర్లు, ప్లాపులలో ఉండి మరల లైమ్‌లైట్‌లోకి రావాలనుకునే వారు కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ విరివిగా అవకాశాలు సంపాదించుకునే వారు. అక్కడ హిట్ కొట్టి మరలా తెలుగుకు తిరిగి వచ్చేవారు.
అక్కడ ఏకంగా మన సాయికుమార్ని స్టార్ హీరోగా పిలిచేవారు. అదే సాయికుమార్ మనకు ఓ సాధారణ నటుడు మాత్రమే. ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఓ సినీ ప్రముఖుడు ఒకసారి వ్యాఖ్యానిస్తూ కన్నడ చిత్రాల కంటే భోజపురి చిత్రాలు నయం అని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అవి కన్నడ నాట పెద్ద దుమారాన్ని రేపాయి.
అలాంటి చిన్న చూపు ఉన్న కన్నడ పరిశ్రమ గత ఏడాది 2022లో తమ సత్తా ఏమిటో దక్షిణాదికే కాదు ప్రపంచానికి కూడా చాటి చెప్పింది. ఈ ఘనత హోంబలే ప్రొడక్షన్స్‌కు దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. హోంబలే ఫిలిం సంస్థ ముఖ్యులు విజయ్ తిరగందూర్, సాలువే గౌడ.
ఈ సంస్థ మొదటిసారిగా 2014లో మన తెలుగులో ఫేమస్ అయిన జయంతి సి పరాన్జీ దర్శకత్వంలో నిన్నిందరి అనే చిత్రాన్ని తీసి తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 2017లో మాస్టర్ పీస్ అనే చిత్రం, 2017 లో రాజా కుమారా అనే చిత్రాలు తీసింది. కానీ 2018లో వీరు తీసిన కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించింది.
దేశ విదేశాలలో ప్రభంజనం సృష్టించింది. దీనికి దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఒక్కసారిగా దేశ విదేశీ సినీ ప్రేక్షకుల చూపు కన్నడపై పడింది. అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు కన్నడ చిత్రమైన కెజిఎఫ్ చాప్టర్1 విజయాన్ని చూసి నోరెళ్ల పెట్టారు.
ఆ తర్వాత వీరు 2021లో యువరత్న అనే సినిమాని తీశారు. ఇక 2022 ఏడాది కన్నడ పరిశ్రమకు హోంబలే ప్రొడక్షన్స్‌కు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ సీక్వెల్‌గా తీసిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం మొదటి చాప్టర్ కంటే రెండుమూడింతలు ఎక్కువ క్రేజ్ ఇమేజ్‌ని సాధించింది. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అదే సమయంలో రిషబ్ శెట్టి తానే హీరోగా దర్శకునిగా కాంతార చిత్రం తీశాడు. దీనిని నిర్మించింది కూడా హోంబలే ఫిలింసే. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లను వసూలు చేయడం అంటే చిన్న మాట కాదు. ప్రస్తుతం వీరు ప్రశాంత నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం తీస్తున్నారు.
దీనిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే వీరు మలయాళంలోకి కూడా అడుగుపెట్టనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ‘టైసన్’ అనే సినిమా తీయడానికి పూనుకున్నారు.
ఆ తర్వాత భగీర, రిచర్డ్ ఆంటోనీ అనే రెండు చిత్రాలు కన్నడలో రూపొందునున్నాయి. భగీర చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తుండగా రిచర్డ్ ఆంటోనిని రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే మలయాళంలో ధూమం అనే సినిమాని పవన్ కుమార్ అనే దర్శకునితో చేస్తున్నారు.
కాగా రాబోయే ఐదేళ్లలో సినిమాల కోసం ఈ సంస్థ ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరంగదూర్ ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడుతూ హోంబలే ఫిలింస్ తరఫున అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
మాపై మీరు చూపిస్తున్న ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు. గత ఏడాది మాకు నిజంగా చాలా గొప్పది. మా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమతోనే అది సాధ్యమైంది. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఒక సగటు మనిషికి ఏ సమయంలోనైనా ఉపశమనం, సంతోషం కలిగించేది సినిమా అనే ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇది జీవితంలో నేడు కీలక పాత్రను పోషిస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, మన గుర్తింపు ప్రపంచానికి చాటడానికి ఇది మంచి వేదిక.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న యువశక్తి ఎక్కడా లేదు. అద్భుతమైన కంటెంట్ కలిగిన సినిమాలు అందించడానికి నిరంతరం కృషి చేస్తాం. ఈ నూతన ఏడాది సందర్భంగా మీకు మేము హామీ ఇస్తున్నాం. ఈ ఉత్సాహంతోనే రాబోయే ఐదేళ్లలో కేవలం సినిమాల కోసం 3,000 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నాం అని తెలియజేశారు. దీన్నిబట్టి రాబోయే ఐదేళ్లలో హోంబలే ఫిలిం సంస్థ మరెన్ని సంచలనాలకు వేదిక అవుతుందో వేచి చూడాలి.
On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! – @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP
— Hombale Films (@hombalefilms) January 2, 2023