అమిత్‌షా ప‌ర్య‌ట‌న పై బీజేపీ ఆస‌క్తి ఉమ్మ‌డి మెద‌క్ పై అమిత్‌షా న‌జ‌ర్‌… గెలుపు గుర్రాల పై నిఘా గ్రామీణ స్థాయిలో పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యం నాయ‌కుల ప‌నితీరుపై అమిత్‌షా ఆరా అమిత్‌షా మెప్పు పొందేందుకు నేత‌ల పాట్లు Home Minister Amit Shah to Sangareddy on 12th..! విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మార్చి 11రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ రోజు హైదరాబాద్‌లో కోర్ […]

  • అమిత్‌షా ప‌ర్య‌ట‌న పై బీజేపీ ఆస‌క్తి
  • ఉమ్మ‌డి మెద‌క్ పై అమిత్‌షా న‌జ‌ర్‌…
  • గెలుపు గుర్రాల పై నిఘా
  • గ్రామీణ స్థాయిలో పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యం
  • నాయ‌కుల ప‌నితీరుపై అమిత్‌షా ఆరా
  • అమిత్‌షా మెప్పు పొందేందుకు నేత‌ల పాట్లు

Home Minister Amit Shah to Sangareddy on 12th..!

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మార్చి 11రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ రోజు హైదరాబాద్‌లో కోర్ కమిటీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 12న హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని నేరుగా సంగారెడ్డికి రానున్న‌ట్లు స‌మాచారం. దీని కోసం ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జోనల్ ఇన్‌చార్జి ప్రేమేంద‌ర్‌రెడ్డితో స‌హా బీజేపీ రాష్ట్ర నేత‌లు అమిత్‌షా రాక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి కార్య‌కర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. సంగారెడ్డికి అమిత్‌షా రాక ఉమ్మడి బీజేపీ నేత‌ల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ప్ర‌త్యేకంగా సంగారెడ్డిలో అమిత్ షా ప‌ర్య‌ట‌న ప‌ట్ల బీజేపీ ఆశావాహులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఏలాగైనా అమిత్‌షా మెప్పు పొందేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి ప‌ర్య‌ట‌న అందరినీ ఒకింత‌ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.

మేధావుల‌తో స‌మావేశం?

సంగారెడ్డిలో మేధావులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న పలు అంశాలపై మాట్లాడనున్నారు. కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. సమావేశానికి సుమారు రెండు వేల మంది మేధావులు హాజరవుతారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లో కాకుండా సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12న రాష్ట్రంలో సమావేశాలు ముగించుకున్నాక కర్ణాటకలోని బీదర్‌కు ప‌యన‌మవుతార‌ని స‌మాచారం.

కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపేందుకే ప‌ర్య‌ట‌నా..!

బీజేపీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి, కార్యకర్తల్లో జోష్ నింపడానికి అమిత్‌షా ప‌ర్య‌ట‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. క్రమం తప్పకుండా జాతీయ స్థాయి నేతలు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావ‌డం పై రాజ‌కీయాల్లో ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అమిత్‌షా ప‌ర్య‌ట‌న ఉంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా స‌మావేశం పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. బీజేపీ కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపి సైనికుల్లా కార్య‌క‌ర్త‌లు ప‌నిచేసే విధంగా అమిత్‌షా దిశా నిర్దేశం చేయ‌నున్న‌ట్లు బీజేపీ నాయ‌కులు అనుకుంటున్నారు.

ముఖ్యనేతల మధ్య సమన్వయమే ప్రధానం

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఇప్ప‌టికే రాష్ట్ర పార్టీ నాయకులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధమైంది. సంగారెడ్డి, మెదక్ జిల్లా ముఖ్యనేతల మధ్య చోటు చేసుకుంటున్న సమన్వయలోపంపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర పార్టీ మినీ కోర్‌కమిటీ భేటీలోనూ దీనిపైనే అమిత్ షా, నడ్డా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే అమిత్ షా ప‌ర్య‌ట‌న ఉన్న‌ట్లు కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగా న‌మ్ముతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల సంగారెడ్డి మెదక్ జిల్లాలో బీజేపీలో వ‌ర్గ పోరులు ఎక్కువయ్యాయి. పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, ఎవ‌రీ క్యాడ‌ర్ వారు కాపాడుకునేందుకు, అధిప‌త్య పోరే కార‌ణ‌మ‌ని కార్య‌క‌ర్త‌లు గుస‌గుస‌లాడుతున్నారు. ఎలాగైనా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా పై బీజేపీ ప‌ట్టు సాధించేందుకు సానుకూల పరిస్థితులున్నా, ప్రజల్లో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఉన్నా రాష్ట్ర నేతలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కార్య‌క‌ర్త‌లు, ముఖ్య నాయ‌కులు, రాష్ట్ర నాయ‌కుల‌ను కలుపుకొని పార్టీ కార్యక్రమాలపై చర్చించాలని, సమష్టిగా ముందుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

బీజేపీలోకి న్యాయవాదుల జేఏసీ నేత!

బీజేపీ పార్టీలోకి ఉమ్మడి జిల్లాకు చెందిన తెలంగాణ జేఏసీలో ముఖ్య భూమిక పోషించిన న్యాయవాదితో సహా ఒక మాజీ ఎమ్మెల్యే, పలువురు బిఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని సమాచారం.

Updated On 5 March 2023 12:05 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story