- ఓట్ల రాజకీయం కోసమే ఇళ్లను ఇవ్వట్లేదు..!
- బిజెపి రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి
- షాద్‌నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన బిజెపి నాయకులు
విధాత: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి సకాలంలో పంపిణీ చేయకుండా కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటనని షాద్ నగర్ బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని హాజీపల్లి శివారు ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితులను నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, ప్యాట అశోక్, కుడుముల బాలరాజ్ తదితరులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారము పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రకటనలకు ఇక్కడ వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో హాజిపల్లి శివారులో 920 డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మించారని, కొత్తూరులో 60, నందిగామలో 128, దూసుకల్ శివారులో 368, సోలిపూర్ శివారులో 380 నిర్మించారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1848 ఇండ్లను నిర్మించారనీ కనీసం ఒక్క ఇల్లును కూడా పేదలకు పంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో ఇళ్లను పంపిణీ చేయకపోతే తామే గృహప్రవేశాలకు పూనుకుంటామని హెచ్చరించారు. వెంటనే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని వారి చేత తామే గృహప్రవేశాలు చేయిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం నిర్మించిన ఇళ్లన్నీ నాసిరకంగా ఉన్నాయని ఈ సందర్భంగా విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా లేని ఇళ్లను నిర్మించారని ఆరోపణలు చేశారు. చాలామంది నిరుపేదలు ఇండ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఐదు లక్షల రూపాయలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇళ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం అతికొద్ది కాలంలో ప్రభుత్వ సచివాలయాన్ని అందంగా ముస్తాబు చేసిందని విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దలపై ఉన్న ధ్యాస పేద ప్రజలపై ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది పండుగకు గృహప్రవేశాలు చేయించాలని లేకపోతే బలవంతంగా గృహప్రవేశాలు చేయాల్సి వస్తుందని స్థానిక బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.