- సాంకేతికత, చట్టాల కన్నా.. మానవత ముఖ్యమన్న కోర్టు
విధాత: ఉత్తరాఖండ్, హల్ద్వానీ బన్భూల్పురా ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దశాబ్దాలుగా నివసిస్తున్న వారిని రాత్రికి రాత్రి ఖాళీ చేయించటం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయంలో చట్టాలు, సాంకేతికత కన్నా మానవత ముఖ్యమని కోర్టు తెలపటం గమనార్హం.
బన్భూల్పురా ప్రాంతంలోని 29 ఎకరాల భూమిలో దశాబ్దాలుగా వేలాది మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో 4,365కు పైగా కట్టడాలున్నాయి. అందులో ఇండ్లు, పాఠశాలలు, దేవాలయాలు, దవాఖానలున్నాయి. నాలుగువేలకు పైగా కుటుంబాలున్నాయి. ఇందులో కొందరు 1947కు పూర్వమే వేలం పాటలో ఆ భూమిని కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకొన్నవారున్నారు. మొత్తంగా 50వేల మంది నివసిస్తున్నారు.
ఇప్పుడు ఆ భూమి తమదని రైల్వేశాఖ కోర్టుకు పోయింది. తమదైన భూమిలో ఆక్రమణ దారులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారనీ, వారిని ఖాళీ చేయించి తమ భూమి తమకు అప్పగించాలని ఉత్తరాఖండ్ హై కోర్టుకు రైల్వేశాఖ పోయింది. దీనిపై గత డిసెంబర్ 20న హైకోర్టు తీర్పు ఇస్తూ.. వారం రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఇండ్లను కూల్చి వేయాలని తీర్పు చెప్పింది.
ఉతరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇండ్లను కూలగొట్టి నిరాశ్రయులను చేయటం అన్యాయమని సుప్రీం కోర్టుకు వెళ్లారు. విషయాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు వివాదం విషయంలో సాంకేతిక, చట్టం కన్నా మానవత ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ.. కూల్చివేతలపై స్టే విధించింది. వివాద భూమిలో రైల్వేశాఖ, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నదో తెలుపాలని కోర్టు రైల్వేశాఖను కోరింది. 50వేల మంది ఉన్న పలాన వారి ఇండ్లను కూల్చి నిర్వాసితులను చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.