Humanoid Kidney in Pig విధాత: జీవనశైలి మార్పులు, ఇతర కారణాల వల్ల కిడ్నీలు విఫలమై మరణిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కిడ్నీల మార్పిడి చేయగలిగితే వారు బతికే అవకాశం ఉన్నప్పటికీ దాతల కొరత వల్ల ఆ విధానం అక్కరకు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు పలుకోణాల్లో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా చైనా (China) కు చెందిన గ్వాంగ్‌జూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడిసన్, హెల్త్ కు చెందిన […]

Humanoid Kidney in Pig
విధాత: జీవనశైలి మార్పులు, ఇతర కారణాల వల్ల కిడ్నీలు విఫలమై మరణిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కిడ్నీల మార్పిడి చేయగలిగితే వారు బతికే అవకాశం ఉన్నప్పటికీ దాతల కొరత వల్ల ఆ విధానం అక్కరకు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు పలుకోణాల్లో పరిశోధనలు చేస్తున్నారు.
తాజాగా చైనా (China) కు చెందిన గ్వాంగ్‌జూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడిసన్, హెల్త్ కు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధన ఫలితాలు కిడ్నీల మార్పిడి రంగంలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. వైద్యరంగం చరిత్రలో తొలిసారి.. మానవ కణాలున్న కిడ్నీలను పంది శరీరం (Humanoid Kidney in Pig) లో శాస్త్రవేత్తలు పెంచగలిగారు.
పరిశోధనలో భాగంగా పంది, మానవ కణాలున్న కిడ్నీ ఎంబ్రియోలను తల్లి పందుల్లోకి ప్రవేశపెట్టారు. వాటికి పుట్టిన పిల్లల్లో ఆ కిడ్నీల పనితీరును, ఎదుగుదలను గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. మనిషి కిడ్నీ పనితీరు ఎలా ఉంటుందో పందిలో ఉన్న మానవ కణాలతో నిర్మితమైన కిడ్నీ కూడా అదే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ కిడ్నీలు మానవునికి అమర్చడానికి పనికిరావని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు తెలిపారు.
కొన్ని మనిషి కణాలున్నప్పటికీ ఈ కిడ్నీల్లోని నరాలు, రక్తకణాలు మొదలైనవి పంది కణాలతోనే నిర్మితమవడమే దీనికి కారణం. అయితే ఈ కోణంలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా త్వరలోనే మనిషికి అమర్చగలిగే కిడ్నీలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
'ఈ పరిశోధనకు ముందు అవగాహన కోసం మేము చుంచుల అవయవాలను ఎలుకల్లో.. ఎలుకల అవయవాలను చుంచుల్లో పెంచడం ప్రారంభించాం. అవి సత్ఫలితాలనూ ఇచ్చాయి. అయితే పంది శరీరంలో మనిషి అవయవాలను పెంచాలని చేసిన చాలా ప్రయోగాలు విఫలమయ్యాయి' అని పరిశోధన కర్త లియాంగ్ లాయ్ వెల్లడించారు.
తాజాగా పంది కణాలను, మనిషి కణాలను మిళితం చేసి ప్రయోగం చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈ విధానంలోనూ కొన్ని సమస్యలున్నాయని ఆయన అన్నారు. 'పంది కణాలు మనిషి కణాలను చంపేసి మొత్తం వాటితోనే అవయవాలను నిర్మించే ప్రమాదం ఉంది. దీనిపై జాగ్రత్తగా ఉండాలి. ఈ కోణంలో మరిన్ని పరిశోధనలు అవసరం' అని ఆయన అన్నారు.
