విధాత: Bengaluru | భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య రెండు చేతులను నరికేశాడు. అనంతరం అటు నుంచి భర్త పరారీ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటక( Karnataka ) లోని దేవనహళ్లి తాలుకా పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దేవనహళ్లి తాలుకా గొబ్బరగుంట గ్రామానికి చెందిన మనికృష్ణప్ప(48), చంద్రకళ(45)కు 20 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం చంద్రకళ తన కుమార్తెతో కలిసి స్థానికంగా ఉన్న దుస్తుల పరిశ్రమలో పనికి వెళ్లేది.
ఈ క్రమంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు భర్త అనుమానం పెంచుకున్నాడు. భార్య ప్రవర్తన నచ్చక.. భర్త పలుమార్లు గొడవ పడ్డాడు. దీంతో ప్రతి రోజు గొడవలు జరుగుతుండటంతో.. కుమార్తెను తీసుకుని చంద్రకళ వేరే ఇంట్లో గత మూడు నెలల నుంచి కిరాయికి ఉంటుంది.
అయితే సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న చంద్రకళను మునికృష్ణప్ప అడ్డుకున్నాడు. భార్యతో గొడవపడి, ఆమె రెండు చేతులను నరికేశాడు. అనంతరం మునికృష్ణప్ప అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.