విధాత: మంచి పని కాస్త అటు ఇటూగా చేసినా పర్లేదు కానీ.. చిలిపి పనులు చాలా జాగ్రత్తగా చేయాలన్న సూత్రం నిజమేనని నిరూపించే ఘటన కేరళలో ఇటీవల జరిగింది. కేరళ (Kerala) లోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు సడెన్‌గా ఒక రోజు పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది. తన పేరు మీద ఉన్న బండికి సంబంధించిన చలాన్ కట్టాలన్న సందేశం అది. దానితో పాటే వచ్చిన ఓ ఫొటో చూసి ఆవిడ్ మొహం కంద గడ్డలా మారిపోయింది. అసలు ఆ ఫొటోలో ఏముంది?
సదరు వివాహిత భర్త ఒక టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక రోజు తన స్నేహితురాలితో కలిసి హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద షికారుకెళ్లాడు. అయితే హెల్మెట్ పెట్టుకోని వాళ్లను గుర్తించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెమేరాల గురించి అతడు మర్చిపోయాడు.
ఈ బండి మీద ఇద్దరూ హెల్మెట్ ధరించలేదని ఫుటేజీ ద్వారా గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు బండి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం ఆ వ్యక్తి భార్యకు చలానా పంపారు. దాంతో పాటు పద్ధతి ప్రకారం ఆ ఫొటోనూ పంపించారు. అది చూసిన తర్వాత ఆవిడ ఉగ్ర అవతారం ఎత్తి భర్తపై విరుచుకుపడింది.
తమ ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదని, లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని భర్త చెప్పినా వినలేదు. సీన్ కట్ చేస్తే తన భర్త తనను, తమ మూడేళ్ల పాపను కొట్టాడని పోలీసులను ఆశ్రయించింది ఆ వివాహిత. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది.