HomelatestHuzurnagar | తెలంగాణ ఫెయిల్ కాదు.. కాంగ్రెస్ ఫెయిల్: మంత్రి హరీశ్‌రావు మండిపాటు

Huzurnagar | తెలంగాణ ఫెయిల్ కాదు.. కాంగ్రెస్ ఫెయిల్: మంత్రి హరీశ్‌రావు మండిపాటు

Huzurnagar |

ఆవిర్భావ ఉత్సవాలపై బిజెపికి నైతిక అర్హత లేదు

విధాత: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండును తెలంగాణ ఫెయిల్ దినోత్సవం పేరుతో కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెలంగాణ ప్రజలను, తెలంగాణ జాతిని, తెలంగాణ సాధనకు ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరచడమేనని రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

శుక్రవారం సాయంత్రం హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లిలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో రాజీనామాలు చేయకుండా వెన్నుచూపి పారిపోయిన కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు తెలంగాణ అభివృద్ధి మింగుడు పడక తెలంగాణ ఫెయిల్ అంటున్నారని హరీష్ రావు విమర్శించారు.

అభివృద్దిలో ఫెయిల్ అయింది..తెలంగాణ కాదని.. తెలంగాణ కాంగ్రెస్ మాత్రమేనని చురకలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదన్నారు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎందుకు తేలేదన్నారు. ఇంటింటికి మంచినీరు, నదీ జలాల సద్వినియోగం ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు అందిస్తున్న ఘనత ఫెయిలా పాసా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. 2000 పింఛన్, రైతుబంధు, రైతు బీమా, ఇంటింటికి మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి పథకాలు అందించడం ఫెయిలా..పాసా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో 20 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ఇవాళ జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని ఇది ఫెయిలా పాసా అంటూ ప్రశ్నించారు.

పల్లె,పట్టణ ప్రగతి, హరితహారం అమలుతో కేంద్రం నుండి 38 శాతం అవార్డులను సాధించడం ఫెయిలా పాసా అన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేయడం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్, దళిత బంధు, 1001 రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించడం ఫెయిలా పాసా అంటూ ప్రశ్నించారు . కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ అభివృద్ధి పచ్చకామెర్లగా మాదిరిగా కనిపిస్తుందన్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అన్నట్లుగా సాగుతుందన్నారు.

బిజెపి వాళ్లు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహిస్తామనడం పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు చేస్తామనడం సిగ్గుచేటు అన్నారు.

తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు, సీలేరు లోయర్ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చినందుకు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మొండి చేయి చూపినందుకు బిజెపి వాళ్లు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుతారా అని హరీశ్ రావు ప్రశ్నించారు.

తెలంగాణకి నీతి అయోగ్ 24 వేల కోట్లు ఇవ్వమంటే, ఫైనాన్స్ కమిషన్ 5000 కోట్లు ఇవ్వమంటే, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా, విభజన హామీల అమలు చేయకుండా, తెలంగాణకు అన్నిట మోసం చేసిన బిజెపికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహించే నైతిక అర్హత లేదన్నారు.

బోరుబావులకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇవ్వాల్సిన 30,000 కోట్లు ఎగవేసినందుకు బిజెపి ఉత్సవాలు జరుపుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమ కాంగ్రెస్ సోనియాకు, బిజెపి మోడీలకు ఉండదన్నారు.

గతంలో 1,50,000 ఉద్యోగాలు తాము భర్తీ చేశామని, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్కలు చూపి ప్రజలను బురిడీ కొట్టించచూస్తున్నారన్నారు. మరో 80,000 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగం ఉందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకే రాజకీయ నిరుద్యోగం పట్టుకుందన్నారు. కాంగ్రెస్,బిజెపిల అబద్ధాల ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.

హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటికీ అమలు చేస్తున్నామన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ, రోడ్లు, తండాలని గ్రామపంచాయతీలు చేయడం జరిగిందన్నారు
10శాతం ఎస్టీ రిజర్వేషన్లు తో నేడు గిరిజన బిడ్డలు ఎనిమిది లక్షల ర్యాంకు వచ్చిన మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తున్నారన్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు ముంపు బాధితుల సమస్యలు అన్నిటిని పరిష్కరిస్తామన్నారు. తండాల్లో ఒకప్పుడు ఆడబిడ్డలను ఆమ్ముకునే దుస్థితి నుండి కల్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలతో ఆడపిల్లలకు బాసట అందించామన్నారు. పంచాయతీల సర్పంచ్ ల బిల్లులన్నీ 1500 కోట్ల మేరకు విడుదల చేశామన్నారు.

మట్టంపల్లిలో ఐటిఐ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో మూడున్నర ఏళ్లలోనే 30ఏళ్ల పైగా సాధించలేని అభివృద్ధిని సైదిరెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో చేశారన్నారు. గతంలో కంటే రానున్న ఎన్నికల్లో సైదిరెడ్డి మరింత మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు.

మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సాగర్ ప్రాజెక్టు కింద ఏనాడు రాజవరం మేజర్ కు నీళ్లు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ పాలనలో వరుసగా ఈ మేజర్ కింద 16వసారి పంటలు పండిస్తున్నారన్నారు.

జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డిలు వృద్ధ జంబుకాలుగా, ముసలి సింహాలుగా మారిపోయారన్నారు. వారి హయంలో సాధించలేని అభివృద్ధిని జిల్లాలో, హుజూర్నగర్ లో సాధించడం జరిగిందన్నారు. జానారెడ్డి హాయంలో ఇంటింటికి మంచినీళ్లను ఇవ్వలేదని, 24 గంటల కరెంటు అందించలేదని, వాటిని కేసీఆర్ ప్రభుత్వమే అందించగలిగిందన్నారు.

సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరిందని, అలాగే జానారెడ్డికి కూడా నిద్రపోయేందుకు జనరేటర్ అవసరం లేకుండా 24 గంటల కరెంటు సరఫరా అందుతుందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో రైతులకు జనరేటర్లు అవసరం లేకుండా పంటలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు ఫ్లోరోసిస్ వ్యాధి ఒక్కటే ఒనగూరిందన్నారు.

హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముప్పై ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో చేయలేని అభివృద్ధిని మూడున్నర ఏళ్లలోనే చేసి చూపారన్నారు. ఇంకా అపరిస్కృత సమస్యలు ఉంటే అందుకు కాంగ్రెస్ కారణం అన్నారు. వాటిని పరిష్కరించడం బిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కాదని మంచు కోట అన్నారు. ఇప్పటికే మొత్తం 12 స్థానాల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు
జిల్లా గులాబీ కోటగా కొనసాగుతుందన్నారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని భేరీజు వేసుకొని కాంగ్రెస్ అబద్ధాలను తిప్పి కొట్టాలన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు, ఇంటింటికి మంచినీరు, 24 గంటల విద్యుత్తు, ఇంటింటికి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అందించిందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లిన కేసీఆర్ పథకాలు కావాలని అడుగుతున్నారన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్నికల హామీల అమలులో, మౌలిక వసతుల కల్పనలో, అభివృద్ధి పథకాల మంజూరులో మంత్రి హరీష్ రావు అందించిన సహకారం మరువలేమన్నారు.

పులిచింతల ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు హుజూర్నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular