Hyderabad | భార‌త సైన్యం ముందు ఏ సంస్థానం సైనికంగా నిల‌బ‌డ‌లేన‌ద‌ని 1946లో హెచ్చ‌రించిన నెహ్రూ విలీనం కాని సంస్థానాన్ని శ‌త్రు దేశంగా ప్ర‌క‌టిస్తాన‌నిహెచ్చ‌రిక‌ కాశ్మీర్‌ను వ‌దిలేద్దామ‌న్న ప‌టేల్‌- ప‌ట్టుబ‌ట్టి విలీనం చేసిన నెహ్రూ అద్భుత‌మైన రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శన‌ నెహ్రూ విధానాల‌ను అమ‌లు చేసిన ప‌టేల్, వీపీ మీన‌న్‌, జ‌న‌ర‌ల్ మౌంట్ బాట‌న్‌లు సెప్టెంబర్ 17 రావడంతో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యంపై మళ్ళీ చర్చ మొదలైంది. ఇంతకూ ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఏమి […]

Hyderabad |

  • భార‌త సైన్యం ముందు ఏ సంస్థానం సైనికంగా నిల‌బ‌డ‌లేన‌ద‌ని 1946లో హెచ్చ‌రించిన నెహ్రూ
  • విలీనం కాని సంస్థానాన్ని శ‌త్రు దేశంగా ప్ర‌క‌టిస్తాన‌నిహెచ్చ‌రిక‌
  • కాశ్మీర్‌ను వ‌దిలేద్దామ‌న్న ప‌టేల్‌- ప‌ట్టుబ‌ట్టి విలీనం చేసిన నెహ్రూ
  • అద్భుత‌మైన రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శన‌
  • నెహ్రూ విధానాల‌ను అమ‌లు చేసిన ప‌టేల్, వీపీ మీన‌న్‌, జ‌న‌ర‌ల్ మౌంట్ బాట‌న్‌లు

సెప్టెంబర్ 17 రావడంతో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యంపై మళ్ళీ చర్చ మొదలైంది. ఇంతకూ ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఏమి జరిగింది? చాలా మందిలో ఉన్న ప్రచారం హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనం కావడానికి ప్రధాన కారణం వల్లభాయి పటేల్ మాత్రమే, నెహ్రూ కాదనేది. కానీ వాస్తవం వేరే. నెహ్రూ విధానాన్ని అమలు చేసే క్రమంలో గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్, వల్లభాయి ప‌టేల్‌, వి.పి. మీనన్ లు ఈ ప్రక్రియను జరిపించారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఈ ముగ్గురు పోషించిన పాత్ర ప్రధానమైనది.

భారత దేశానికి స్వాతంత్య్రం, విభజనపై చర్చలు జరుగుతున్నప్పుడే నెహ్రూ సంస్థానాల విషయం తేల్చాలని పట్టుబట్టారు. కానీ జిన్నా మాత్రం సంస్థానాల స్వతంత్రత వైపు మొగ్గు చూపారు. చివరికి బ్రిటిష్ ప్ర‌భుత్వం రెండుగా విభజిస్తూ భారత్, పాకిస్థాన్ లుగా స్వాతంత్రం ఇచ్చిందే తప్ప, స్వదేశీ సంస్థానాలను విలీనం చేయలేదు. అది వాటికే వదిలివేసింది. భారత్, పాకిస్థాన్ దేశాలలో ఏదో ఒక దేశంలో చేరాలని సంస్థానాలకు నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ సూచించారు. కానీ బ్రిటిష్ ప్రకటన ప్రకారం వాటికి స్వతంత్రంగా ఉండే అవకాశం కూడా లభించింది.

నెహ్రూ సంస్థానాలను విలీనం చేయాలనే విషయంలో కచ్చితంగా ఉన్నారు. స్వతంత్ర భారత దేశం సైన్యం ముందు ఏ సంస్థానం సైనికంగా నిలబడలేదని 1946 జూలైలో నెహ్రూ హెచ్చరించారు. రాజ్యాంగ సభలో చేరని సంస్థానాన్ని శత్రుదేశంగా పరిగణిస్తామని నెహ్రూ 1947 జనవరిలో ప్రకటించారు. ఆ తరువాత సంస్థానాధీశులను నయానా, భయానా ఒప్పించి విలీన ప్రక్రియను పూర్తి చేశారు. నెహ్రూ కఠినంగా హెచ్చరించినప్పటికీ, మౌంట్ బాటెన్, పటేల్, మీనన్ చాలా వరకు దౌత్య పద్ధతుల ద్వారా శాంతియుతంగా విలీన ప్రక్రియను నడిపించారు.

కాశ్మీర్ భార‌త్‌లో చేరేలా..

ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అంతర్జాతీయ రంగంలో ఒక దేశాన్ని మరో దేశం ఆక్రమించుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఐక్య రాజ్య సమితి కొత్తగా ఏర్పడింది. అంతర్జాతీయ నియమాలు పాటించాలని, ఆక్రమణలకు పాల్పడకూడదనే బలమైన అభిప్రాయం ఉండేది. ఆ దశలో మౌంట్ బాటెన్ ను ముందు పెట్టి నెహ్రూ తన చేతికి మట్టి అంటకుండా, తాను శాంతి ప్రియుడిననే అభిప్రాయం దెబ్బతినకుండా, ప్రపంచ వ్యాప్తంగా జాతుల స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్య పోరాటాలకు సౌహార్దత తెలుపడమే తమ విధానం ఎక్క‌డా ప్రశ్నార్థకం కాకుండా జాగ్రత్త పడ్డారు.

కశ్మీర్ ను వదిలివేద్దామని పటేల్ అభిప్రాయపడ్డారు. కానీ నెహ్రూ చాలా చాకచక్యంగా అక్కడ రెఫరెండం జరగకుండా కశ్మీర్ భారత్ లో చేరేలా వ్యవహరించారు. ఏ మాత్రం పావులు కదపడంలో తప్పు జరిగినా ప్రతికూల ఫలితాలు ఉండేవి. లఢాక్‌ను భారత్ పటంలో కలిపి కొత్త పటం రూపొందించడంలోనూ నెహ్రూదే ప్రధాన పాత్ర. అందువల్ల హైదరాబాద్ రాజ్యం విలీనంతో సహా సంస్థానాలను విలీనం చేయడంలో నెహ్రూ చాలా రాజనీతిని ప్రదర్శించారు.

హైద‌రాబాద్ విలీనం మ‌త ప‌రంగా మార్చాల‌నే కుట్ర‌

ఇక సెప్టెంబర్ 17కున్న ప్రాధాన్యం ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిని కొందరు కావాలని లేవనెత్తుతున్నారు. దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయనేది కూడా గమనించాలి. దీనిని రాజకీయాంశంగా మారుస్తున్నది బీజేపీ కాగా, తెరవెనుక మద్దతు ఇస్తున్నది ఆంధ్రా ఆధిపత్య శక్తులు. తెలంగాణలోని వివిధ వర్గాలను విభజించి పాలించాలనే కుటిల నీతి ఆంధ్రా ఆధిపత్య శక్తులది.

కాగా హైదరాబాద్ విలీనాన్ని మతపరమైన అంశంగా మార్చి, మత విభేదాలు సృష్టించాలనేది బీజేపీ పన్నాగం. ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడి, విమోచన పొందారనే ఒక కథనాన్ని ప్రచారం చేయాలనేది బీజేపీ లక్ష్యం. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా హిందుత్వ శక్తులు పోరాడనే లేదు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా హిందు మహాసభ అనుసరించిన విధానం గమనార్హమైనది.

బ్రిటిష్ అనుకూల పాత్ర పోషించిన బీజేపీ భావ‌స్వారూప్య శ‌క్తులు

ఆనాటికి బీజేపీ పుట్టనే లేదు. కాగా బీజేపీ తో భావ సారూప్యం ఉన్న శక్తులు బ్రిటిష్ అనుకూల పాత్రను పోషించాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమం 20 శతాబ్దం ఆరంభంలో ఊపందుకున్నప్పుడు మత విభజన ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని బ్రిటిష్ పాలకులు భావించారు. ఆ తరువాత ముస్లిం లీగ్, హిందు మహా సభ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టే విధంగా హిందు మహా సభ వ్యవహరించింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా సాయుధ బలగాలను పోగు చేయడంలో సావర్కర్ నేతృత్వంలోని హిందు మహా సభ ఉత్సాహంగా పాల్గొన్నది. కానీ శాసనోల్లంఘన ఉద్యమానికి (1930) మాత్రం దూరంగా ఉన్నది.. 1937లో కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. అప్పుడు హిందు మహా సభ, ముస్లింలీగ్ కలిసి అధికారం పంచుకున్నాయి.

నిజాంకు వ్య‌తిరేకంగా పోరాడింది క‌మ్యూనిస్టులు

హైదరాబాద్ రాజ్యంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ప్రముఖుడు మఖ్దూం మొహియుద్దీన్ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన వారే. రాచరికానికి వ్యతిరేకంగానే కాదు, ఆనాటి భూస్వామ్యపాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. భారత యూనియన్ సైన్యాలు ప్రవేశించిన తరువాత హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేస్తున్నామని నిజాం ప్రకటించారు.

ఆ తరువాత రాజ ప్రముఖ్ గా గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు. 1950 వరకు ఆయన పేరునే పాలన సాగింది. 1950లోనే హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర భారతంలో భాగంగా మారింది. సెప్టెంబర్ 17న విలీనమైనప్పటికీ, కమ్యూనిస్టు ఉద్యమకారులు కోరుకున్న విమోచన జరగలేదు.

విలీనం తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఉంటే.. ఉద్యమకారులతో చర్చలు జరిపి శాంతియుతంగా పోరాట విరమణ చేయించేది. కానీ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. స్థానిక అధికారులను నమ్మకుండా ఆంధ్రా అధికారులను మద్రాసు నుంచి తెప్పించుకున్నారు.

1952లోనే ఆంధ్రా గోబ్యాక్ ఉద్య‌మం

1952లోనే ఆంధ్రా గోబ్యాక్ ఉద్యమం చెలరేగింది. ఈ పరిస్థితులు కళ్ళెదుట కనిపిస్తున్నా, 1956లో తెలంగాణ అస్తిత్వానికి ముప్పు కలిగే విధంగా ఆంధ్రాతో విలీనం చేయడం కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు, ఆ తరువాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వంటి పరిణామాల పట్ల కేంద్రం ప్రేక్షక పాత్ర వహించింది. అంతే కాదు, ముల్కీ రూల్స్ చెల్లుతాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆంధ్రా లాబీ ఒత్తిడిలకు తలొగ్గిన కేంద్రం వాటిని నిర్వీర్యం చేసింది.

1969 ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేసి. అనేక మందిని బలిగొన్నది. జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ ల‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా తెలంగాణ సమాజానికి మొండి చేయి చూపింది. మలిదశ ఉద్యమంలోనూ ఎంతో తాత్సారం చేసింది. ఇవన్నీ తెలంగాణ సమాజానికి చెరిగి పోని చేదు జ్ఞాపకాలు. హైదరాబాద్ రాజ్యం విలీనమైన తరువాత ప్రజాభిప్రాయానికి పట్టం గట్టితే బాగుండేది.

భిన్న‌త్వానికి చాటుకోవ‌డానికే..

మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు జాతిపరంగా, భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతి కంగా తాము ఆంధ్రావారికి భిన్నమైన వారిమనే స్పృహ తెలంగాణ వారిలో మరింత బలపడ్డది. ఆ నేపథ్యంలో తమ భిన్నత్వాన్ని చాటుకోవడానికి సెప్టెంబర్ 17 ను ముందుకు తెచ్చారు. ఆ రోజును ఉత్సవంగా జరపాలని కోరారు. దీనికి కారణం, తమ భిన్నత్వాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేత ఆమోదింప చేయాలనే ఎత్తుగడ మాత్రమే. ఎప్పుడైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ సమాజానికి తమ అస్తిత్వాన్ని చాటుకునే, సంబరాన్ని జరుపుకునే ఒక సందర్భం వచ్చింది. జూన్ రెండుకున్న ప్రాధాన్యం ముందు మరేదీ నిలువలేదు. తెలంగాణ సమాజానికి 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26, 2014 జూన్ 2- ఈ మూడు అత్యంత ప్రాధాన్యం గల తేదీలు.

550 సంస్థానాల్లో ఎందుకు విలీనోత్స‌వాలు నిర్వ‌హించ‌డం లేదు

బీజేపీ వారు చెబుతున్నట్టు సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకునే అభిమతం తెలంగాణ సమాజానికి ఏనాడూ లేదు. ఇప్పుడు జరపాలని తెలంగాణ వాదులు కోరడం లేదు. భారత్ లో 550కి పైగా సంస్థానాలు విలీనం అయ్యాయి. బీజేపీ వారు ఇవన్ని చోట్ల విలీనోత్సవాలు ఎందుకు జరపడం లేదు? అంటే తెలంగాణలోనే జరపడంలో ఒక అజెండా ఉన్నదనేది స్పష్టం. బీజేపీ హంగామాను తిప్పి కొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నది. సమైక్యత అంటే భౌగోళికంగానే కాదు, సామాజికంగా కూడా సాధించాలె. బీజేపీ ఈ సవాలును స్వీకరించి జాతీయ సమైక్యతకు పాటుపడుతుందా?. - వ్యాస‌క‌ర్త‌: పరాంకుశం వేణుగోపాల స్వామి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

Updated On 17 Sep 2023 3:50 PM GMT
krs

krs

Next Story