విధాత: జబర్దస్త్ ద్వారా బ్రహ్మాండమైన పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది ఎన్నికల గోదాలోకి దూకుతాడా.. ఎక్కడి నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నాడు.. ఆయన ప్లాన్స్ ఏమిటి ? నాగబాబు ప్రోత్సాహంతో బాగా ఎదిగిన ఆది మెగా ఫ్యామిలీ పట్ల కృతజ్ఞత చూపుతూ వస్తున్నారు. పవన్ ను, చిరంజీవిని..నాగబాబును ఎవరు విమర్శించినా ధీటుగా సోషల్ మీడియాలో సమాధానాలు ఇస్తుంటారు.
అంతేకాకుండా దాంతో 2019 ఎన్నికల సమయంలో ఆయన తన సహా జబర్దస్త్ నటులను తీసుకుని జనసేనకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. తాజాగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువసత్తా సభలో ఆది పంచులతో జనాన్ని ఆకర్షించారు. ప్రభుత్వం మీద విమర్శల దాడి చేశారు.
పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని అడ్డుకోవాలని చూస్తే ఆయన పాదయాత్ర చేస్తారని అపుడు వైసీపీ మంత్రులకు కాశీయాత్రే అంటూ ఆది చేసిన ప్రసంగం యూత్ ను ఆకట్టుకుంది అంతేకాకుండా తాను జనసైనికుడికి మాత్రమే కాదు జనసేన అభ్యర్ధిగా వచ్చాను అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆది జనసేన తరఫున పోటీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆది ఒంగోలు లేదా దర్శి నుంచి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తులలో భాగంగా ఈ రెండు సీట్లను జనసేన కోరే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు సీట్లలో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో తాను అక్కడి నుంచి పోటీ చేయాలని ఆది భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కెరీర్ ను ఫణంగా పెట్టి నేరుగా రాజకీయ సభల్లో నటులు ప్రసంగించరు. ఇలాంటి సభలు.. ప్రచారాలు..తమ వృత్తి జీవితానికి ఇబ్బందులు పెడతాయని భయపడతారు. కానీ అది మాత్రం నేరుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి, పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు.