విధాత: 2022.. పొడుగ్గాళ్ల సుందరి పూజా హెగ్డేకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఏడాది ప్రారంభంలో ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత ఆమె కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో ‘బీస్ట్’ అనే చిత్రం తీస్తే అది కోలీవుడ్‌లో కూడా తుస్సుమంది.
‘ఆచార్య’.. బాలీవుడ్లో చేసిన ‘సర్కస్’ చిత్రాలు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇలా చూసుకుంటే 2022 పూజా హెగ్డేకి ఏ మాత్రం కలిసి రాలేదని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె నటించిన సర్కస్ ఇటీవల విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీకి అపజయం ఎరుగని దర్శకుడు రోహిత్‌శెట్టి దర్శకుడు కావడం విశేషం. తాజాగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. దర్శకుడు రోహిత్ శెట్టి కోసమే సర్కస్ చిత్రం చేశానని చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. అందరిలాగే నాకు కొందరు దర్శకులతో పనిచేయాలని ఉంటుంది. అందులో రోహిత్ శెట్టి పేరు ముందుంటుంది. ఆయనే స్వయంగా ఫోన్ చేయడంతో ఇక ఏమీ అడక్కుండానే సినిమా ఒప్పుకున్నా. మొదట రోహిత్ శెట్టి గారు నాకు ఫోన్ చేసినప్పుడు ఆ కాల్ మిస్ అయ్యాను.
మా అమ్మ చెప్పి మరి ఫోన్ చేయించింది. నేను ఎంతో ఎక్జయిటింగ్‌గా ఫోన్ చేశాను. ఆయన గొంతు వినడం.. ఆయన ఆఫర్ ఇవ్వడంతో సంతోషంతో కేకలు వేశాను. డేట్స్ ఉన్నాయా అని చెప్పి ఆయన అడిగారు. లేకపోయినా సర్దుబాటు చేసుకుంటానని చెప్పేశాను.
చివర్లో అయినా రన్వీర్ సింగ్ హీరో అంటూ అసలు విషయం చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా బాలీవుడ్లో ‘కిసీకా భాయ్.. కిసీ కా జాన్’ టైటిల్‌తో రూపొందుతున్న సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మహేష్ 28వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.