పురాణ కథలను మొదట వ్యాసుడు అనగా.. సూతుడు విన్నాడు. తిరిగి సూతుడు అనగా.. శౌనకాది మహర్షులు విన్నారు. ఇలా ఒకరి తరవాత ఒకరు అనగా అనగా భారత భాగవత పురాణాలు మన వరకు వచ్చాయి. అందుకే మన పురాణ కథలన్నీ అనగనగా అంటూ ప్రారంభమవుతాయి. వినడం చిన్నతనంలోనే అయినా అవి అర్థమయ్యేది మాత్రం మనం పెద్దయ్యాకే. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ధర్మ పరిపాలకుడు అని పేరు. సిరిసంపదలతో తులతూగుతూ రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజుకు ముగ్గురు భార్యలు. ముసలితనంలో మరో భార్యను పెళ్లాడాడు. అలా నలుగురు భార్యలతో హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
ఇలా ఉండగా ఒకరోజు ఆరాజుకు ఒక బెంగ పట్టుకుంది. అది ఏంటంటే చనిపోయిన తర్వాత ఒంటరిగా గడిపేదెలా..? అని. దీంతో ఆలోచనలో పడ్డాడు. చివరికి ఒక ఆలోచన వచ్చింది. భార్యలను కూడా తనతో పాటు తీసుకువెళతాను అని అనుకున్నాడు. ముందుగా తాను ఎంతో ప్రేమగా చూసుకున్న పెద్ద భార్యను పిలిచి మరణంలోనూ నాతో పాటు వస్తావా అని అడిగాడు. రాను అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పిందామె. పెద్ద భార్యగా అన్ని అధికారాలు నీకే ఇచ్చాను.. నిన్ను ప్రేమగా చూసుకున్నాను కదా అని అడిగాడు. ఆ మాట నిజమే కానీ నేను నీతో పాటు మరణంలో రాలేను అని స్పష్టంగా చెప్పేసింది.
చేసేదేమీ లేక రెండో భార్యను పిలిచాడు. ఇప్పటి వరకు నిన్ను ఎంతో ఇష్టంగా చూసుకున్నాను. నీ కోసం ఎన్నో చేశాను. కావున నాతో పాటు మరణంలో వస్తావా అని అడిగాడు. అస్సలు రాను అని తెగేసి చెప్పింది. నీ సుఖం కోసం, నీ స్వార్థం కోసం నన్ను బాగా చూసుకున్నావు. నిజం చెప్పాలంటే నీ అవసరాలకు నన్ను వాడుకున్నావు.. కాదంటావా చెప్పు అని బదులు ప్రశ్నించింది.
ఎంతగానో ప్రేమించిన మొదటి ఇద్దరి భార్యల సమాధానం విన్నాక మూడో భార్యను అడగడానికి సంకోచంలో పడ్డాడు. ఎందుకంటే తనను ఎప్పుడూ సరిగా పట్టించుకున్నదీ లేదు. అందుకే సంశయిస్తూనే మూడో భార్యని అడిగాడు నాతో వస్తావా అని. ఆమె నవ్వుతూ ఒప్పుకుంది. నువ్వు వద్దన్నా నీతోనే వస్తాను అదే నాభాగ్యం అన్నది. ఈ సమాధానంతో రాజుగారు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
మూడో భార్య హామీతో మనస్సుకు కొంత ప్రశాంతత లభించింది. అయినా కూడా వృద్ధాప్యంలో చేసుకున్న నాలుగో భార్య సమాధానం కూడా వినాలనుకున్నాడు. ఎందుకంటే ఆమెను సరిగా చూసుకోలేదు.. నిజం చెప్పాలంటే ఆ అవకాశం కూడా రాలేదురాజుకి. అందుకే తప్పు చేసిన వాడిలా తన ముందు నిల్చున్నాడు. అడగలేక మౌనంగా అలానే ఉన్నాడు.
రాజుగారు ముభావంగా ఉండడాన్ని చూసి తన దగ్గరికి వెళ్లి ప్రేమగా ఆలింగనం చేసుకొని ఏదో పని మీద వచ్చారనుకుంటా. అడగండి తప్పకుండా చేసి పెడతాను. నేను ఉన్నదే మీ కోరిక తీర్చడం కోసం అని భరోసా ఇచ్చింది. దీంతో రాజు గారు ధైర్యంగా అడిగారు నాతో వస్తావా అని. అడిగే పనే లేదు. నీవెంట తప్పకుండా వస్తాను. నీచేతిని ఎప్పడూ ఎలాంటి పరిస్థితిలోనూ విడిచి పెట్టను అంటూ ధ్యైర్యం చెప్పింది. ఆ మాటకు రాజు అపరాదభావంతో తల దించుకున్నాడు.
చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు. అప్పుడు ఏమి అర్థం అయిందో తెలియదు. కానీ, ఈ కథలోని అంతరార్థాన్ని పెద్దయ్యాక మాత్రం జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కథలోని రాజు గారి జీవితాన్ని ప్రతీ మనిషి తన జీవన ప్రయాణంతో పోల్చోకోవచ్చు. అదెలాగో చూద్దాం.
రాజుగారి కథలో మొదటి భార్య శరీరం. ప్రాణం ఉన్నంతకాలం శరీరాన్ని ఎంతో ప్రేమిస్తాం. దాని పోషణ కోసం ఎన్నో చేస్తాం. కానీ, మరణంలో మాత్రం తోడు రాదు. మట్టిలో కలిసిపోతుంది. ఇక రెండో భార్య సంపద. మనిషి తన స్వప్రయోజనాల కోసం సంపద వెనకాల వెర్రిగా పరుగులు పెడతాడు. అవసరాల కోసం సంపదను వాడుకొంటాడు. చనిపోయాక మనిషితో పాటు రాదు. నీ స్వార్థం కోసం నన్ను వాడుకున్నావని నిందించింది అందుకే. మూడో భార్య కర్మ. వద్దన్నా వెంబడిస్తుంది. జన్మజన్మలకు వెంటాడుతుంది. ఒప్పుకోకపోయినా నీతోనే వస్తానని అందుకే చెప్పింది. ఇక నాలుగో భార్య భగవంతుడు. వయసు పైబడే దాక ఆయనతో పరిచయమే చేసుకోడు మనిషి.
నిజానికి నిరంతరం కలిసి ఉండాల్సింది తనతోటే. ఆ విషయం తెలిసే నాలుగో భార్య దగ్గర రాజు తలదించుకుని నిలబడింది. అయినా తిరుగులేని అభయం ఇచ్చింది ఆ దైవమే. నీ చేతిని ఎప్పుడూ వదలనని ధైర్యం చెప్పింది కూడా. కనీసం చివరి రోజుల్లో అయినా తన గురించి ఆలోచించాడు అని దయ చూపించింది. అదే భగవంతుడి స్వభావం. ఇక మనం తేల్చుకోవలసింది.. తెలుసుకొని ఆచరించాల్సంది ఒక్కటే. రాజు గారు ఎవరు? అదే భగవత్ తత్త్వం. శుభం భూయాత్..