విధాత: జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్లుంది.. రైతు భరోసా పథకం అమలు చేసే కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అయితే ఎన్నికలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తాను సింగిల్‌గా 175 సీట్లకు పోటీ చేస్తానని, అలా సింగిల్‌గా పోటీ చేసే దమ్ము మీకుందా అని చంద్రబాబును.. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
వారితో దాచుకో.. దోచుకో పథకమే…
నేను జనానికి మంచి చేశాను. చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాను. కాబట్టే మొత్తం సీట్లకు వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీకి పెడుతున్నాను అని ధీమా వ్యక్తం చేశారు. అదే చంద్రబాబు కానీ పవన్ కానీ జనాలకు ఏ మంచీ చేయలేదు కాబట్టే వై నాట్ 175 సీట్లకు పోటీ అని ముందుకు రావడం లేదని జగన్ అంటున్నారు. ఏపీలో దుష్ట చతుష్టయంగా చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఉంటే దత్తపుత్రుడుగా పవన్ జత కలిశాడని ఆయన ఎండగట్టారు. వీరంతా కలసి పరిపాలించినపుడు ఏపీలో అంతా దాచుకో.. దోచుకో అన్న పథకమే సాగిందని విమర్శించారు.
మీడియాను అడ్డుగా పెట్టుకొని విమర్శలు..
వీరంతా కలిసి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, మీడియాను అడ్డం పెట్టుకుని తన మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు కరవు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏలుబడిలో వర్షాలు ఉండవని కరవు మండలాలే ఉంటాయని ఆయన కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వంలో వర్షాలు ఉంటాయి తప్ప టిడిపి జమానాలో మాదిరిగా రెయిన్ గన్స్ ఉండవని అన్నారు.
ప్రజల మద్దతుతో ఎదుర్కొంటాను..
తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఆదుకుంటోందని పంట దిగుబడి కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగిందని ఆయన గణాంకాలతో వివరించారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. తాను ప్రజల మద్దతుతోనే అన్ని విధాలుగా వారిని ఎదుర్కొంటాను అని ఆయన చెప్పుకొచ్చారు.
విడివిడిగా పోటీ చేసే దమ్ముందా..?
మొత్తానికి చూస్తే జగన్ స్పీచ్ చంద్రబాబుని అన్యాయస్థుడుగా అభివర్ణించడం కరవుకు పక్కా ఫ్రెండ్‌గా చూపించడం పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడు దుష్ట చతుష్టయానికి తోడున్నాడు అంటూ ఆయన్ని జనం దృష్టిలో దోషిగా నిలబెట్టడం వంటి ఎత్తుగడలతో సాగింది.
అదే టైంలో తాను ఏపీకి చేసిన మేలుని కూడా పూర్తిగా జగన్ వివరంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మన ప్రభుత్వ పాలనే రావాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. మొత్తానికి టీడీపీ జనసేనలు విడివిడిగా పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. చూడాలి.. వాళ్ళు కలిసి వెళ్తారా.. ఈయన చెప్పినట్లు సింగిల్‌గా వెళ్తారా అన్నది చూడాలి.