Congress | వచ్చిన దరఖాస్తులపై సర్వే! జనాభిప్రాయం మేరకు కేటాయింపు సెప్టెంబర్‌ 10న మొదటి జాబితా! 70 మందితో వెల్లడించే అవకాశం 30 సీట్లకు ఇప్పటికే పేర్లు ఖరారు! విధాత, హైదరాబాద్‌: ప్రజాబలం, ప్రజల్లో మద్దతు ఉన్నవారికే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ రూల్‌ తీసుకువచ్చింది. ఆశావహులను దరఖాస్తు చేసుకోవాలని కోరిన కాంగ్రెస్‌.. వచ్చిన దరఖాస్తుల నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో విధివిధానాలను కూడా ఎన్నికల కమిటీ సమావేశం ఖరారు చేసిందని సమాచారం. దరఖాస్తు చేసుకున్నవారికి […]

Congress |

  • వచ్చిన దరఖాస్తులపై సర్వే!
  • జనాభిప్రాయం మేరకు కేటాయింపు
  • సెప్టెంబర్‌ 10న మొదటి జాబితా!
  • 70 మందితో వెల్లడించే అవకాశం
  • 30 సీట్లకు ఇప్పటికే పేర్లు ఖరారు!

విధాత, హైదరాబాద్‌: ప్రజాబలం, ప్రజల్లో మద్దతు ఉన్నవారికే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ రూల్‌ తీసుకువచ్చింది. ఆశావహులను దరఖాస్తు చేసుకోవాలని కోరిన కాంగ్రెస్‌.. వచ్చిన దరఖాస్తుల నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో విధివిధానాలను కూడా ఎన్నికల కమిటీ సమావేశం ఖరారు చేసిందని సమాచారం. దరఖాస్తు చేసుకున్నవారికి జనంలో ఉన్న మద్దతు, బలం, గెలిచే అవకాశాలపై మరోసారి సర్వే చేయించి, టికెట్‌ కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్‌ 10వ తేదీలోగా మొదటి జాబితాను వెల్లడించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాదాపు 70 మందితో మొదటి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమైందని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుందని నాయకులు పేర్కొంటున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రూపొందించిన గైడ్‌లైన్స్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మల్లికార్జున ఖర్గే.. సమావేశంలో సభ్యులకు అందజేశారు.

కొడంగల్‌, జగిత్యాల మినహా ఒక్కో నియోజక వర్గానికి బహుళ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ఎవరికి ప్రజా మద్దతు ఉన్నదనేది తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేయించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. సదరు సర్వేల్లో వచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలు 1, 2, 3.. ఇలా మూడు నాలుగు పేర్లను ఖరారు చేస్తాయి. వాటిని ఏఐసీసీకి పంపిస్తారు. అక్కడ తుది నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో టికెట్ల ఖరారు చేసే విషయంలో ఏఐసీసీ కూడా రహస్యంగా తెలంగాణలో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ చేయించిన సర్వేలు, తాము చేయించిన సర్వేలు సరిపోల్చుకుని అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఎంత పెద్ద నేత అయినా జనం సపోర్ట్‌ లేకుంటే టికెట్‌ దక్కదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా గాంధీభవన్‌ చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగే వారిని పక్కన పెట్టాలని నిర్ణయించినట్ల తెలిసింది.

సామాజిక సమీకరణలు కలుపుకొంటూ..

ప్రజా బలం ఉన్న నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్‌.. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు అమ్ముడు పోతారనే అభిప్రాయం జనం నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. వారిని పక్కనపెట్టి, పార్టీ కోసం గట్టిగా నిలబడే వారికే టికెట్‌ ఇస్తారని తెలుస్తున్నది.

30 స్థానాలకు అభ్యర్థుల ఖరారు!

ఇప్పటికే దాదాపు 30 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు ఓ సీనియర్‌ నేత చెప్పారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఒకరిద్దరి స్థానాలు మాత్రమే మారే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. బీఆరెస్‌ అకర్ష్‌ పథకం ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రలకు చిక్కకుండా పార్టీని కాపాడిన సిట్టింగ్‌లకు మొదటగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఆ తరువాత స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఖమ్మం జిల్లా బీఆరెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కొత్తగూడెం నుంచి పోటీ చేయించాలని తొలుత భావించినా.. సీపీఐతో పొత్తు, ఇతర రాజకీయ మార్పుల నేపథ్యంలో పాలేరు నుంచి బరిలో దింపుతారని చెబుతున్నారు.

వారసులకు టికెట్లు కష్టమేనా?

పార్టీలో చాలా మంది నేతలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తున్నారు. పలువురు సీనియర్లు తమ పిల్లల చేత దరఖాస్తులు కూడా చేయించారు. అయితే వారసులకు టికెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం సంసిద్ధతతో లేదని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని గట్టి లక్ష్యంతో ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఇదే తొలి జాబితా?

1. కొడంగల్ : రేవంత్ రెడ్డి
2. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌ కుమార్ రెడ్డి
3. కోదాడ : పద్మావతి
4. మధిర : మల్లు భట్టి విక్రమార్క
5. మంథని : శ్రీధర్ బాబు
6. జగిత్యాల : జీవన్ రెడ్డి
7. ములుగు : సీతక్క
8. భద్రాచలం : పొదెం వీరయ్య
9. సంగారెడ్డి : జగ్గారెడ్డి
10. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
11. అలంపూర్ : సంపత్ కుమార్
12. నాగార్జునసాగర్ : కుందూరు జైవీర్ రెడ్డి
14. కామారెడ్డి : షబ్బీర్ అలీ
15. మంచిర్యాల : ప్రేమ్ సాగర్ రావు
16. అందోల్ : దామోదర రాజనర్సింహ
17. పరిగి : రామ్మోహన్ రెడ్డి
18: వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
19. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
20. ఆలేరు : బీర్ల ఐలయ్య
21. బాల్కొండ : సునీల్ రెడ్డి
22. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
(రాజకీయ సమీకరణలు మారితే పాలేరు లేదా ఖమ్మం)
23. నర్సంపేట : దొంతి మాధవ రెడ్డి
24. పెద్దపల్లి : విజయ రమణ రావు
25. చొప్పదండి : మేడిపల్లి సత్యం
26. నిర్మల్ : శ్రీ హరి రావు
27. భూపాలపల్లి : గండ్ర సత్యనారాయణ రెడ్డి
28. బెల్లంపల్లి : గడ్డం వినోద్
29. నాంపల్లి : ఫిరోజ్ ఖాన్
30. వేములవాడ : అది శ్రీనివాస్

Updated On 29 Aug 2023 4:59 PM GMT
krs

krs

Next Story