Saturday, January 28, 2023
More
  Homelatestఆత్మగౌరవం అడిగితే.. సస్పెండ్ చేస్తారా: చకిలం

  ఆత్మగౌరవం అడిగితే.. సస్పెండ్ చేస్తారా: చకిలం

  • న్యాయం కోసం లడాయికైనా సిద్ధం
  • ఉద్య‌మ‌కారుల‌ను ప‌ట్టించుకోని కంచ‌ర్ల‌:చకిలం అనిల్ కుమార్
  • భ‌య‌పెట్టినా త‌ర‌లివ‌చ్చిన ఉద్య‌మ‌కారులు..

  విధాత: తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, కేసులు, జైలు పాలై, ఆస్తులు అమ్మి పార్టీని ఉద్యమాన్ని నడిపించిన తెలంగాణ ఉద్యమకారులకు రెండు పర్యాయాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కనీసం ఆత్మగౌరవం కూడా దక్కడం లేదని, ఉద్యమకారులపై కేసులు పెట్టించిన వారికి మాత్రం పదవులు దక్కాయని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి, బ్రాహ్మణ పరిషత్ మాజీ సభ్యుడు అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

  బుధవారం నల్గొండలో దివంగత సర్దార్ చకిలం శ్రీనివాసరావు పంతులు నివాసంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకొని మరీ పనిచేస్తే అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ తన వంటి వారిని గుర్తించక పోవడం అన్యాయమ‌ని అన్నారు. ఉద్యమ కాలంలో తాను పార్టీ కోసం అమ్ముకున్న ఆస్తులు విలువ నేడు 100 కోట్ల వరకు ఉంటుందని, ఆస్తులు పోయినా బాధ లేదు.. కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా పార్టీ నాయకత్వం వ్యవహరించడం బాధగా ఉందన్నారు.

  టికెట్ అడిగిన ప్ర‌తిసారీ…

  2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో టికెట్ అడిగిన ప్రతీసారి పొత్తులు, సర్వేలు అంటూ తనకు టికెట్ నిరాకరించారన్నారు. తన తండ్రి చకిలం శ్రీనివాసరావు జిల్లాలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడారని, తెలంగాణ సాధన క్రమంలో కేసీఆర్ మాటకు కట్టుబడి 2009 ఎన్నికల్లో సిపిఎం పార్టీ విజయం కోసం పని చేశానన్నారు.

  2018 ఎన్నికల్లో నల్గొండ టికెట్‌ కంచర్ల భూపాల్ రెడ్డికి కేటాయించడాన్ని తాను ప్రశ్నించిన సందర్భంలో నన్ను ప్రగతిభవన్‌కి పిలిచిన సీఎం కేసీఆర్ నీకు టికెట్ విషయంలో అన్యాయం జరిగిందని, అయితే భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి నేటికి ఎందుకు ఇవ్వడం లేదంటూ చకిలం ప్రశ్నించారు.

  ఉద్య‌మ‌కారుల కోసం స‌స్పెండ్‌కు కూడా సిద్ధం..

  ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటున్నారని, నన్ను నమ్ముకున్న ఉద్యమకారులకు, పేదలకు న్యాయం చేసేందుకు సస్పెండ్‌కు కూడా తాను సిద్ధమని, ఆత్మ గౌరవం కోసం తమ లడాయి కొనసాగుతుందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

  న్యాయం చేస్తార‌ని 22ఏళ్లుగా ఎదురు చూశా..

  తన తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు అందించిన పోరాట వారసత్వంతో తెలంగాణ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, రెచ్చగొడితే చకిలం కుటుంబం పోరాట సత్తా ఏమిటో తెలియజేస్తామని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఉద్యమ నాయకుడిగా కేసిఆర్ తనలాంటి ఉద్యమకారుడికి న్యాయం చేస్తారని 22 ఏళ్లుగా ఎదురు చూశానని, ఇంకా నా సహనాన్ని, హద్దులను పరీక్షించవద్దన్నారు.

  పార్టీ కోసం తాము పడ్డ కష్టనష్టాలను పక్కనపెట్టి కేసీఆర్ ఆదేశం మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలకు ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం దక్కకపోగా, కనీసం ఆత్మగౌరవం కూడా కరువైందన్నారు.

  జిల్లా వ్యాప్తంగా పోరాటాలు విస్త‌రిస్తాం..

  ఇప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఇంకా విధేయులుగానే ఉన్నామని, ఇకనైనా తమకు న్యాయం చేయకపోతే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈనాటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సుకు వెళ్తే ప్రభుత్వ పథకాలు నిధులు అందవంటూ కార్యకర్తలను బెదిరించారని, అయినా వందల మంది తరలివచ్చిన తీరు ఉద్యమకారుల్లో నెలకొన్న అసంతృప్తికి అద్దం పడుతుందన్నారు. తాను ఉద్యమ కారుడిగా, 22 ఏళ్లుగా అధినేత కేసిఆర్ మాటకు కట్టుబడి రాజకీయ అవకాశాలను, పదవులను పొందలేని వ్యక్తిగా పదవులను, ఆత్మ గౌరవాన్ని డిమాండ్ చేయడంలో తప్పు లేదన్నారు.

  కంచ‌ర్ల‌పై అసంతృప్తి..

  కాగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంతో నిర్వహించిన ఈ సదస్సులో ప్రసంగించిన వారంతా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం, గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, గడ్డి పోచలుగా తీసి వేస్తున్నారని అసంతృప్తి వెళ్ళగక్కారు.

  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం పనిచేసిన వారికి పదవులు, పథకాలు దక్కడం లేదని, ఉద్యమ కారుడైన చకిలం అనిల్ కుమారకు కేసీఆర్ ఇస్తానన్న మాట మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో నల్గొండ టికెట్‌ను ముందస్తుగా అనీల్‌కే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

  సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ కవులు, ఉద్యమ కళాకారులు, మేధావులు, బీఆర్ఎస్ లోని చకిలం అనుకూల, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల వ్యతిరేక వర్గీయులు, చకిలం కుటుంబ అభిమానులు గణనీయ సంఖ్యలో హాజరైన తీరు తెలంగాణ ఉద్యమకారుల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపించింది. సదస్సును ఆద్యంతం ఇంటలిజెన్స్ సిబ్బంది వీడియో తీయడం, వక్తల ప్రసంగాలను వీడియోతోపాటు నోట్ చేసుకోవడం చర్చినీయాంశమైంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular