HomelatestBRS | వారంతా ఏకతాటి పైకి వస్తే.. బీఆర్‌ఎస్‌కు భారీ నష్టమే

BRS | వారంతా ఏకతాటి పైకి వస్తే.. బీఆర్‌ఎస్‌కు భారీ నష్టమే

BRS |

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపితే, రాష్ట్ర బీజేపీలో రాజకీయ ప్రకంపకలు సృష్టిస్తున్నది. కేసీఆర్‌తో విభేదించి బీజేపీలో చేరిన నేతలకు.. బండి సంజయ్‌కి మధ్య సఖ్యత లేదని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

వీటిని నేతలు ఖండించినా ఇటీవల బీఆర్‌ఎస్‌ (BRS) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని రఘునందన్‌ రావు, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డిలు సమావేశమ్యారు. ఈ విషయంపై తనకు సమాచారం లేదని సంజయ్‌ చెప్పడం నేతల మధ్య విభేదాలున్న మాట వాస్తవమే తేలింది.

కేసీఆర్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నాయకులంతా ఆర్థికంగా బలమైన నేతలు. బండి సంజయ్‌తో ఉన్న విభేదాలతో వీరంతా పార్టీలో అసౌకర్యంగానే కొనసాగుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయట పడుదామానే ఆలోచిస్తున్నట్టు చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఆ మధ్య స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ వంటి నేతలు పార్టీని వీడి తిరిగి సొంతగూటికి చేరినప్పుడే వీళ్లు కూడా పార్టీ మారుతారని అనుకున్నారు.

కానీ వీరంతా వాళ్ల నియోజకవర్గాల్లో సొంత బలం ఉన్న నేతలు. కేసీఆర్‌తో రాజీ పడటం కంటే ఆయను ఎదుర్కొవడానికి అంతా కలిసి సొంతంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని, తద్వారా కేసీఆర్‌ను గద్దె దింపాలన్నది వీరందరి ఉమ్మడి లక్ష్యం. కర్ణాటక ఫలితాలు వీరికి అనుకూలించాయి. ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డాతో పాటు సినీ ప్రముఖులతో ప్రచారం చేయించినా, ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం రాజకీయ ప్రాబల్యం ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు పెంచినా ప్రజలు తిరస్కరించారు.

స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా కేంద్ర నాయకత్వమే ప్రచారం చేయడం విఫలమవడం ఈ నేతలను ఆలోచనలో పడేసింది. అలాగే కర్ణాటక ఫలితాల అనంతరం కూడా బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హిందూ ఏక్తా ర్యాలీ’లో అస్సాం ముఖ్యమంత్రి ఒక వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేయడం వీరికి మింగుడు పటటం లేదట.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ వెంటే ఉండటం, మంచి వాగ్ధాటి, అన్ని పార్టీలు, అన్ని ఉద్యమ సంఘాలతో ఆయన సత్సబంధాలు కలిగి ఉండటం, సౌమ్యుడిగా పేరుండటం వంటివి వీరికి కలిసి వచ్చే అంశం అంటున్నారు. సుమారు 50 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండి కొట్టాలనేది వీరి ప్లాన్‌.

కర్ణాటక ఫలితాలను చూసిన తర్వాత కేసీఆర్‌ను అడ్డుకోవడానికి ఏదైనా పెద్ద పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని వీరు యత్నిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక ఫలితాలకు ముందే పొంగులేటి, జూపల్లి లాంటి వాళ్లను పార్టీలోకి తేవాలని ఈటల వంటి వారు ప్రయత్నించినా వారు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడైతే బీజేపీలో చేరే అవకాశం దాదాపుగా లేనే లేదని చెప్పొచ్చు.

బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు వస్తాయని సీఎం చెబుతున్నా.. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు కోసం ఇద్దరు మగ్గురు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. సిట్టింగులకే మాగ్జిమం సీట్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పడంతో పార్టీలో టికెట్లు ఆశించే వారు, అసంతృప్తితో ఉన్నవారు మరో పార్టీ వైపు చూసే అవకాశం ఉన్నది.

కాగా.. వారందని ఒక గొడుకు తెచ్చి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఈటల వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఒకవేళ వీరు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో అవగాహనకు వచ్చి ఏకతాటికిపైకి వస్తే బీఆర్‌ఎస్‌ కు భారీ నష్టం తప్పకపోవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular