- బోడుప్పల్ బాధితులకు అండగా ఉంటామని హామీ
If you harass the poor people, don’t let it go: Eatala
విధాత: మజ్లిస్ పార్టీ మెప్పు కోసం పేద ప్రజలను బిఆర్ఎస్ సర్కార్ వేదిస్తే ఊరుకునేది లేదని, అధికారం ఎల్లకాలం ఉండదని, ప్రజల ఉసురుపోసుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
వక్ఫ్ భూముల పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేసినందుకు నిరసనగా బోడుప్పల్ బాధితులు ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న ధర్నాకు ఈటల రాజేందర్ హాజరై సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. మీలాంటి సమస్య ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ఉండగా, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం భూముల రిజిస్ట్రేషన్ కోసం మంత్రి కెటిఆర్ స్వయంగా వెళ్లి వచ్చి జిఒ ఇప్పించారన్నారు. ఎన్నికల సమయంలోనే వారికి ఓటర్ల బలం గుర్తుకు వస్తుందన్నారు.
నేను డిమాండ్ చేస్తున్నది బోడుప్పల్ మూడు వందల ఎకరాల సమస్య కాదని, అక్కడ ఉంటున్న ఐదు వందల కుటుంబాల ఆక్రందనలకు తెలంగాణ సమాజం తప్పకుండా స్పందిస్తుందన్నారు. మజ్లిస్ మెప్పు కోసం ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని, భూమి మీద ఉండేందుకు ఎవరూ శాశ్వతంగా రాలేదని, ప్రజల శాపం తప్పకుండా తగులుతుందన్నారు. కెసిఆర్.. నీకు అధికారం ఇచ్చింది 2023 వరకు మాత్రమే, ఆ విషయం మర్చిపోవద్దని, ప్రజలు పీకేస్తే ఇంటికి పోతావని ఈటల హెచ్చరించారు.
వక్ఫ్ భూమి అని నిర్థారణ అయితే వారికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా భూమి కేటాయించి, వారిని మాత్రమే బోడుప్పల్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో కొనుక్కున్న భూములపై బిఆర్ఎస్ సర్కార్ దౌర్జన్యం ఏంటని, మేము ఖరీదు చేసిన భూములపై నీ పెత్తనం ఏంటని ఈటల మండిపడ్డారు.