- 2017 తరువాత గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు దూరం
- గుర్తింపు ఎన్నికల మార్గదర్శకాల మార్పు కోసం పట్టుపట్టనున్న సంఘాలు
విధాత, కరీంనగర్ బ్యూరో: సింగరేణి(Singareni)బొగ్గు గనుల సంస్థలో కార్మిక సంఘాల(trade unions)గుర్తింపుకు సంబంధించి నిర్వహించాల్సిన ఎన్నికలకు ‘ముహూర్తం’ నిర్ణయం అవుతుందా? మరి కొంతకాలం వేచి చూడాల్సి వస్తుందా? అనే విషయంలో నేడు ఒక స్పష్టత రానుంది. సింగరేణి యాజమాన్యం(Singareni mnagement), రాష్ట్ర ప్రభుత్వం(State Govt)గుర్తింపు ఎన్నికలకు సుముఖంగా లేవనే చర్చ గని కార్మిక వర్గం నుండి వినిపిస్తోంది.
హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం సింగరేణికి ప్రాతినిధ్యం వహిస్తున్న 32 కార్మిక సంఘాల ప్రతినిధులతో ఎన్నికల అంశమై కమిషనర్ కీలక భేటి నిర్వహించబోతున్నారు. సింగరేణి యాజమాన్య ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
తెలంగాణలోని 16 శాసనసభ, నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్న సింగరేణిలో జరిగే గుర్తింపు ఎన్నికలు ఆయా నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. గత శాసనసభ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న శాసనసభ స్థానాల్లో అధికార బీఆర్ఎస్‌కు సంతృప్తికరమైన ఫలితాలు దక్కలేదు.
అంతర్గత కుమ్ములాటలే ఆలస్యానికి కారణమా..
ప్రస్తుతం సింగరేణి గుర్తింపు సంఘ బాధ్యతలు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహిస్తుండగా, సంఘ నేతల్లోని విభేదాలు ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను దూరం చేస్తాయేమో నన్న భయం బీఆర్ఎస్ నేతలకు లేకపోలేదు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం(Identity Trade Union)రెండేళ్లు బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా, ఏడేళ్లు గడుస్తున్నా ఎన్నికల జోలికి వెళ్లకపోవడానికి టీబీజీకేఎస్ అంతర్గత కుమ్ములాటలు ఓ కారణంగా భావిస్తున్నారు.
ఎన్నికలు నిర్వహించకపోవడంపై తప్పుపడుతున్న కార్మిక సంఘాలు
కేంద్ర కార్మిక శాఖ సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావును ఎన్నికల అధికారిగా నియమించింది. అటు సింగరేణి యాజమాన్యం, ఇటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపితే సింగరేణి వ్యాప్తంగా ఉన్న 43 వేల మంది కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 2017 అక్టోబర్‌లో జరిగిన ఆరో విడత గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్నికార్మిక సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. దీంతో సింగరేణి వ్యాప్తంగా అందరి దృష్టి సోమవారం జరిగే సమావేశం పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.
కాలపరిమితిపై తరచూ వివాదాలు..
1998 లో జరిగిన తొలి గుర్తింపు సంఘం ఎన్నికల నాటి మార్గదర్శక సూత్రాల మార్పుపై ఈ సమావేశంలో కార్మిక సంఘాలు పట్టు పట్టే అవకాశం ఉంది. గుర్తింపు సంఘ కాల పరిమితి పై తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ సింగరేణి వ్యాప్తంగా పారిశ్రామిక సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. సంఘాల మధ్య కాలపరిమితి వ్యవహారంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల్లో మార్పులు జరగాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తేనే..
ఇదిలా ఉండగా గుర్తింపు ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల బందోబస్తు, ఓట్ల లెక్కింపునకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అవసరముంటుంది. వారిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉండటంతో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉంది. అప్పుడే కేంద్ర కార్మికశాఖ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుంది.