Rajasthan విధాత: రాజస్థాన్ (Rajasthan) లోని జైపుర్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బాణసంచా వేడుకల శబ్దాలను బాంబులు, కాల్పుల శబ్దాలుగా భ్రమపడిన విదేశీయుడు తను ఉంటున్న హోటల్ బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. పోలీసుల వివరాల ప్రకారం నార్వేకు చెందిన నోయి ఫిన్ వెట్లే జైపుర్‌ను సందర్శించడానికి ఇటీవల వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓహోటల్‌లో మూడో అంతస్తులో గది తీసుకుని ఉంటున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కృష్ణాష్టమి సందర్భంగా సమీప ఆలయాల్లో బాణసంచా వేడుకలను […]

Rajasthan
విధాత: రాజస్థాన్ (Rajasthan) లోని జైపుర్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బాణసంచా వేడుకల శబ్దాలను బాంబులు, కాల్పుల శబ్దాలుగా భ్రమపడిన విదేశీయుడు తను ఉంటున్న హోటల్ బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. పోలీసుల వివరాల ప్రకారం నార్వేకు చెందిన నోయి ఫిన్ వెట్లే జైపుర్‌ను సందర్శించడానికి ఇటీవల వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓహోటల్‌లో మూడో అంతస్తులో గది తీసుకుని ఉంటున్నాడు.
అయితే శుక్రవారం తెల్లవారుజామున కృష్ణాష్టమి సందర్భంగా సమీప ఆలయాల్లో బాణసంచా వేడుకలను ప్రారంభించారు. భారీగా మందుగుండును పేలుస్తుండటంతో శబ్దాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోరెత్తాయి. వీటిని ఫిన్ దుండగుడి కాల్పులుగా భ్రమించి సాయం.. సాయం.. అని గట్టిగా అరుస్తూ బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాధితుడు కింద పడుతున్నపుడు సాయం, మంటలు అని అరుస్తూ దూకేశాడని స్థానికులు చెప్పడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. జీ20 సదస్సు సమయం కావడంతో ఈ కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని భావించి కూపీ లాగారు. అతడు ఉంటున్న గదిని పరిశీలించి ఎటువంటి కాల్పులు, అగ్ని ప్రమాదం జరగలేదని నిర్దరించుకున్నారు.
జరిగిన ఘటనపై స్పష్టత కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో భంగ్ మత్తులో.. భయపడుతూ అరుస్తూ ఫిన్ బాల్కనీ నుంచి దూకినట్లు కనిపించింది. అదే సమయంలో చుట్టుపక్కల ఆలయాల నుంచి పెద్ద శబ్దంతో బాణసంచా పేలుతోంది. దీంతో వాటిని తప్పుగా అర్థం చేసుకునే ఫిన్ ఈ ఘటనకు పాల్పడినట్లు భావనకు వచ్చారు. ఈ సమాచారం మొత్తాన్ని నార్వే ఎంబసీకి చేరవేసినట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
