BRS | ఆసక్తికరంగా మారిన సన్నివేశం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కడుపులో కత్తులు పెట్టుకొని, కనిపిస్తే మాత్రం కౌగిలించుకోవడం రాజకీయ నేతలకే చెల్లుతుందేమో. జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులకు ఇది వంద శాతం వర్తిస్తుందన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల జనగామ జిల్లా బీఆర్ఎస్ పరిణామాలు పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు జనగామ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ […]

BRS |

ఆసక్తికరంగా మారిన సన్నివేశం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కడుపులో కత్తులు పెట్టుకొని, కనిపిస్తే మాత్రం కౌగిలించుకోవడం రాజకీయ నేతలకే చెల్లుతుందేమో. జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులకు ఇది వంద శాతం వర్తిస్తుందన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల జనగామ జిల్లా బీఆర్ఎస్ పరిణామాలు పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు జనగామ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన జనగామ నూతన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ పార్టీ నాయకులను ఒకే వేదికపై కలిపింది. పరస్పరం పలకరించుకోకుండా, పెద్దగా మాట్లాడుకోకుండా ఇటీవల కాలంలో ఒకరిని చూస్తే ఒకరు నిప్పులు పోసుకునే సమయంలో ఈ తాజా పరిణామం అందరిలో ఆసక్తి రేకెత్తించింది.

ఇది రెండో కలయిక

స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థిని ప్రకటించి, జనగామ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు నెలకొన్న సందర్భంలో ఇటీవల కాలంలో ఇది రెండవ కలయికగా చెప్పుకోవచ్చు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలో నిర్వహించిన సీతారామచంద్ర దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి జనగామ జిల్లా నాయకులంతా హాజరై ఒకే వేదికను పంచుకున్నారు.

తాజాగా మరోసారి జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నాయకులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి హాజరయ్యారు. ఒకే వేదికపై ఆసీనులయ్యారు.

అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి

రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితాలో 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు టికెట్ నిరాకరించి, ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి ఈసారి అవకాశం కల్పించారు. ఇక జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కడియం శ్రీహరికి అవకాశం కల్పించడం పట్ల సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఎన్నికల నాటికి మార్పు ఉంటుందని తనకే అవకాశం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం జరిగితే ఆ వర్గం చూస్తూ ఊరుకోదు అనే రూపంలో పరోక్ష హెచ్చరికను కూడా జారీ చేస్తూ వచ్చారు. తన ఎమ్మెల్యే టికెట్ రాకుండా కడియం శ్రీహరి కుట్రలు చేశారని రాజయ్య ఇప్పటికే ఫైర్ అయ్యారు. కడియం పొడ చూస్తేనే గిట్టది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు అనే పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో తొలిసారి వల్మీడీలో ఇప్పుడు జనగామలో ఒకే వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

జనగామలోనూ ఎడమొహం

ఇదిలా ఉండగా జనగామ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా జనగామలో బీఆర్ఎస్ నాయకులను సమీకరిస్తున్న జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి అంటేనే ముత్తిరెడ్డి మండిపడుతున్నారు. తన నియోజకవర్గంలో రాజేశ్వర్ రెడ్డికి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, తన అనుచరులను మభ్యపెట్టి అటువైపు చేర్చేందుకు సంపత్ రెడ్డి కుట్ర చేశారని ఆగ్రహంతో ఉన్నారు. ఈ స్థితిలో సంపత్ రెడ్డి, ముత్తిరెడ్డి ఒకే వేదికపై భాగస్వామ్యం కావడం గమనార్హం.

తనకు వ్యతిరేకంగా సంపత్ రెడ్డి పనిచేస్తున్నప్పటి నుంచి ఆయన దూరం పెడుతూ వస్తున్నారు. ఈ పరిణామాల్లో మెడికల్ కాలేజీ ప్రోగ్రాం జనగామ జిల్లాలో ఒకరంటే ఒకరు గిట్టని నాయకులను ఒకే వేదిక పైకి చేర్చింది. అటు జనగామ గాని, ఇటు స్టేషన్గన్పూర్ పరిణామాలపై జిల్లా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కనీసంగానైనా పట్టించుకోకపోవడం కొసమెరుపుగా చెప్పవచ్చు. ఈ విషయంపై ఇప్పటివరకు ఆయన నోరెత్తకపోవడం గులాబీ వర్గాల్లోనే ఆసక్తికరంగా మారింది.

Updated On 16 Sep 2023 1:45 AM GMT
krs

krs

Next Story