IND vs BAN | విధాత: ఆసియా కప్ ఫైనల్ చేరుకున్న భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగగా చివరకు బంగ్లానే విజయం వరించింది. శుభ్‌మన్ గిల్ వీరోచిత సెంచరీ చేసిన కూడా ఆయన భారత్‌కి విజయాన్ని అందించ లేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత్ ఆరు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కి 11 ఏళ్ల […]

IND vs BAN |
విధాత: ఆసియా కప్ ఫైనల్ చేరుకున్న భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగగా చివరకు బంగ్లానే విజయం వరించింది. శుభ్‌మన్ గిల్ వీరోచిత సెంచరీ చేసిన కూడా ఆయన భారత్‌కి విజయాన్ని అందించ లేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత్ ఆరు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కి 11 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయంగా కొత్త రికార్డ్ నమోదైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట్లో ఇండియా బౌలర్స్ బంగ్లాని చాలానే ఇబ్బంది పెట్టారు. అయితే కెప్టెన్ షకీబ్ అల్ హసన్(85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), టౌహిడ్ హృదయ్(81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నసుమ్ అహ్మద్(44), మెహ్‌దీ హసన్(29 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.
ఇక లక్ష్యఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ రెండో బంతికి డకౌట్ కావడం విశేషం. గత మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, మంచి జోరు మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిల్లీ షాట్ ఆడి ఔటయ్యాడు. ఇక విరాట్ స్థానంలో వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి తంజీమ్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ మూడో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామం నమోదు చేశారు . రాహుల్ 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి మహెదీ హసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు..ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ కాగా, ఇక టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు.
34 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన జడేజా 12 బంతుల్లో 7 పరుగులు చేసి ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో 170 పరుగులకి ఆరు వికెట్స్ కోల్పోయి గెలుపు కష్టమే అని అందరు అనుకున్నారు. కాని గిల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ఈ ఏడాదిలో మరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో గిల్ (133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 121 పరుగులు) భారీ షాట్ ఆడి పెవీలియన్ బాట పడ్డాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా విజయానికి 38 బంతుల్లో 57 పరుగులు కావల్సి ఉండగా, అక్షర్ పటేల్ కాస్త గట్టిగా కృషి చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరి 2 బంతుల్లో 8 పరుగులు అవసరం కాగా, మహ్మద్ షమీ రనౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 259 పరుగుల వద్ద ముగిసింది.
