- రాంచీలో నేడు భారత్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్
- తొలి టీ20 నేడు.. రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో
విధాత: వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా.. టీ20 సిరీస్‌కు యంగ్ ప్లేయర్లతో రెడీ అయింది. మరో వైపు వరుస పరాజయాలకు టీ20ల్లో తెరదించాలని న్యూజిలాండ్ ఉంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగే తొలి మ్యాచ్ నేడే. హార్దిక పాండ్యా కెప్టెన్సీలో భారత్ జోరు చూపిస్తుందో.. సాంట్నర్ నేతృత్వంలోని కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 నేడు జరగనుంది. రోహిత్, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియా చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్, షమి, సిరాజ్‌లకు కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్‌ను 0-3తో ఓడిన కివీస్ జట్టు టీ20 సిరీస్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాల్సిందే.
పృథ్వీ షాకు చాన్స్ లేనట్లే: ఇషాన్ కిషన్‌కు తోడుగా.. శుభ్‌మన్ గిల్ రెండో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్‌కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నా.. వన్డేల్లో తాజా ఫామ్‌తో గిల్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు హార్దిక్ వెల్లడించాడు.
బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్.. ఆల్‌రౌండర్‌గా దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ , శివమ్ మావి పేస్ భారం మోయనున్నారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, చాహల్‌లో ఇద్దరికి అవకాశం దక్కనుంది. బ్యాటింగ్‌లో భారత్ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్‌లోనూ పుంజుకోవాల్సివుంది. శివమ్ మావితో కలిసి ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటాడు.
Look who came visiting at training today in Ranchi – the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
కివీస్ పుంజుకోవాల్సిందే: కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ సౌథీ లేకపోవడం ఈ సిరీస్‌లోనూ కివీస్‌కు లోటుగా చెప్పుకోవచ్చు. సీనియర్ స్పిన్నర్ సాంట్నర్ నాయకత్వంలోని ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, బ్రాస్‌వెల్ వంటి వారితో కివీస్ బ్యాటింగ్ కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.
ఇండోర్ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వే జోరుమీదున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో 188 పరుగులు చేసిన బ్రాస్‌వెల్ పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగిస్తే టీమ్ ఇండియాకు తిప్పలే. అయితే ఫెర్గూసన్ మినహా పేస్ బౌలింగ్‌లో అనుభవజ్ఞులు లేకపోవడం న్యూజిలాండ్‌కు సమస్యగా మారింది. బెన్ లిస్టర్, హెన్రీ షిప్లీ టీ20 ఫార్మాట్ లో అరంగేట్రం చేయలేదు. టిక్నర్, డఫీలు ఆడిన టీ20లు తక్కువే. అయితే స్పిన్నర్ ఇష్ సోథికి భారత్‌లో మంచి రికార్డు ఉండడం ఆ జట్టుకు ఏకైక సానుకూలాంశం.
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్, కుల్‌దీప్
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, బ్రాస్‌వెల్, శాంట్నర్, టిక్నర్, ఇష్ సోధి, బెన్ లిస్టర్, ఫెర్గూసన్
పిచ్.. వాతావరణం
రాంచీ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ వాతావరణం కాస్త చల్లగా ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం కష్టం.