INDIA సీట్ల సర్దుబాటుపై చర్చలు ముంబై: మోదీకి సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ తన మూడో సమావేశాన్ని గురు, శుక్రవారాల్లో ముంబైలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. ముంబై సమావేశానికి రెండు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. దీనిపై కూటమిలోని కీలక నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందిస్తూ ఇప్పటికి రెండు సమావేశాలు అయ్యాయి.. గ్యాస్ ధర రెండు వందలు తగ్గింది. ఇదీ ఇండియా కూటమి సత్తా.. అని […]

INDIA
సీట్ల సర్దుబాటుపై చర్చలు
ముంబై: మోదీకి సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ తన మూడో సమావేశాన్ని గురు, శుక్రవారాల్లో ముంబైలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. ముంబై సమావేశానికి రెండు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. దీనిపై కూటమిలోని కీలక నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందిస్తూ ఇప్పటికి రెండు సమావేశాలు అయ్యాయి.. గ్యాస్ ధర రెండు వందలు తగ్గింది. ఇదీ ఇండియా కూటమి సత్తా.. అని చెప్పారు.
మూడో సమావేశంలో ఇండియా కూటమి నేతలు లోగోను ఆవిష్కరించడంతోపాటు.. కీలకమైన సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారని తెలుస్తున్నది. సమావేశాన్ని ముంబైలోని గ్రాండ్ హయత్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోసం ఇప్పటికే ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ ముంబై చేరుకున్నారు. కూటమిలోకి మరికొన్ని పార్టీలను చేర్చుకునే అంశంపైనా చర్చించనున్నారు.
ఈ సమావేశాల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంలో చర్చ జరిగే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత ఎంపీలు అంతా కలిసి తమ నేతను ఎన్నుకుంటారని తెలిపారు. ఇదిలాఉంటే.. తిరిగి అనర్హత వేటును తొలగించుకుని మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీని ముంబై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించనున్నారు.
మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ చెప్పారు. మహా వికాస్ అఘాడీలో పోటీ ఏమీ లేదని తెలిపారు. అఘాడీలోని మరో కీలక పక్ష నేత ఉద్ధవ్‌ఠాక్రే సైతం గెలుపు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్నారని గుర్తు చేశారు. తమ లక్ష్యం మోదీ సర్కార్‌ను ఓడించడమేనని స్పష్టం చేశారు.
కూటమి నేతలు ప్రధాని అంశాన్ని పక్కనపెట్టినా.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వంటివారు రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవ్వాలని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని ఆధారం చేసుకున్న బీజేపీ నేతలు.. 2024లో ప్రధాని సీటు ఖాళీ లేదంటూ.. ఇప్పటికే ముఖ్యమంత్రులు గా ఉన్న లేదా ముఖ్యమంత్రులుగా చేసిన మమతాబెనర్జీ, శరద్‌పవార్, నితీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్‌కంటే పైన రాహుల్ ఉండాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
