Samudrayaan వెళ్లనున్న పరిశోధక త్రయం ‘సముద్రయాన్’లో ఖనిజాన్వేషణ విధాత‌: ‘చంద్రయాన్-3’ సక్సెస్ తర్వాత ‘సూర్యయాన్’ (ఆదిత్య-ఎల్1).. త్వరలో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగనయాన్’ ఇలా మంచి ఊపుమీదున్న భారత్.. మరో ‘యాన్’ వైపు చూస్తోంది. ప్రాజెక్ట్ ‘సముద్రయాన్’ కోసం కడలి దిశగా అడుగులేస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఉపాధి సృష్టి, ఆరోగ్యకరమైన సముద్ర ఆవరణ నిర్వహణ కోసం సముద్ర వనరులను ఉపయోగించాలన్న తన ‘బ్లూ ఎకానమీ పాలసీ’ అమలు కోసం భారత్ […]

Samudrayaan

  • వెళ్లనున్న పరిశోధక త్రయం
  • ‘సముద్రయాన్’లో ఖనిజాన్వేషణ

విధాత‌: ‘చంద్రయాన్-3’ సక్సెస్ తర్వాత ‘సూర్యయాన్’ (ఆదిత్య-ఎల్1).. త్వరలో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగనయాన్’ ఇలా మంచి ఊపుమీదున్న భారత్.. మరో ‘యాన్’ వైపు చూస్తోంది. ప్రాజెక్ట్ ‘సముద్రయాన్’ కోసం కడలి దిశగా అడుగులేస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఉపాధి సృష్టి, ఆరోగ్యకరమైన సముద్ర ఆవరణ నిర్వహణ కోసం సముద్ర వనరులను ఉపయోగించాలన్న తన ‘బ్లూ ఎకానమీ పాలసీ’ అమలు కోసం భారత్ రూ.4,077 కోట్లతో ‘డీప్ ఓషన్ మిషన్’ చేపడుతోంది.

‘సముద్రయాన్’ ప్రాజెక్టు అందులో ఒక భాగం. ఇది కోబాల్ట్, నికెల్, మాంగనీస్ సహా ఖరీదైన లోహాలు, ఖనిజాల నిధి కోసం సముద్రగర్భంలో సాగించబోయే వేట. ముగ్గురు పరిశోధకులను (ఆక్వానాట్స్) తీసుకుని ఆరు కిలోమీటర్ల మేర కడలి లోతుల్లోకి వెళ్లబోతున్న మన బుల్లి జలాంతర్గామి పేరు ‘మత్స్య 6000’. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

‘టైటాన్’ విషాదంతో ముందు జాగ్రత్తలు!

సముద్రమట్టం వద్ద ఉండే పీడనంతో పోలిస్తే 6 కిలోమీటర్ల లోతులో 600 రెట్లు (600 బార్స్) అధికంగా పీడనం ఉంటుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 1912లో మునిగిపోయిన ప్రయాణికుల ఓడ ‘టైటానిక్’ శకలాలను తిలకించడానికి ముగ్గురు పర్యాటకులు సహా ఐదుగురు ఈ ఏడాది జూన్ నెలలో చిన్నపాటి జలాంతర్గామి ‘టైటాన్’లో సాగరగర్భంలోకి పయనించడం, లోపలి జలపీడనాన్ని తట్టుకోలేక ‘టైటాన్’ పేలిపోయి వారందరూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

‘మత్స్య 6000’ కూడా అలాంటి సబ్మెర్సిబుల్ కోవకు చెందినదే. ‘టైటాన్’ విషాదాంతం నేపథ్యంలో ‘మత్స్య 6000’ డిజైన్, దాని తయారీలో వాడే మెటీరియల్స్, పరీక్షలు, సర్టిఫికేషన్, ప్రమాణాలను మన శాస్త్రవేత్తలు జాగ్రత్తగా సమీక్షిస్తున్నారు.

2.1 మీటర్ల వ్యాసంతో గోళాకృతిలో ఉండే ‘మత్స్య 6000’ను 80 మిల్లీమీటర్ల మందంతో టైటానియం మిశ్రమలోహంతో రూపొందిస్తున్నారు. 2024 సంవత్సర తొలి త్రైమాసికంలో బంగాళాఖాతంలో తొలుత 500 మీటర్ల లోతులో మానవ రహితంగానూ, అనంతరం మానవసహితంగానూ ‘మత్స్య 6000’ను పరీక్షిస్తారు.

అనంతరం అది సెన్సర్ల సాయంతో హిందూ మహాసముద్ర అంతర్భాగాన్ని అన్వేషిస్తుంది. ముగ్గురు పరిశోధకుల్లో ఒకరు నౌకను నడిపే ఆపరేటర్. ‘సముద్రయాన్’ ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తిస్థాయిలో సాకారమవుతుంది.

. ‘మత్స్య 6000’ లాంటి మానవ సహిత అండర్ వాటర్ వెహికల్స్ ను ఇప్పటివరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే తయారుచేశాయి. పాలీమెటాలిక్ మాంగనీస్ నూడుల్స్, హైడ్రో థర్మికల్ సల్ఫైడ్స్, గ్యాస్ హైడ్రేట్స్ కోసం ‘మత్స్య 6000’ శోధిస్తుంది. అవి దొరికితే నిధి దొరికినట్టే, భారత్ పంట పండినట్టే.

4 రోజులకు సరిపడా ఆక్సిజన్!

‘మత్స్య 6000’ సబ్మెర్సిబుల్ బరువు 25 టన్నులు. పొడవు 9 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు. ప్రయాణంలో వెలుపలికి చూసేందుకు 3 పోర్ట్ హోల్స్ (అద్దాల కిటికీలు) ఉంటాయి. చుట్టూతా 180 డిగ్రీల మేర తిరగగల ఈ జలాంతర్గత నౌక ఏక్ దమ్మున అంటే.. ప్రయాణ సమయంతో కలిపి ఒకేసారి నిరాటంకంగా 12-16 గంటల పాటు పని చేయగలదు. లోపల 96 గంటలకు (4 రోజులు) సరిపోను ప్రాణవాయువు ఉంటుంది. ప్రయాణంలో పరిశోధకులు ప్రత్యేక దుస్తులు వేసుకోనక్కర్లేదు. లోపల సరిపోను పీడనం ఉంటుంది.

అయితే.. మరుగుదొడ్డి ఉండదు కనుక ‘భరీగా తిని వెళ్లే/తినే’ అవకాశం ఉండదు. శక్తినిచ్చే ఆహారం లేదా పానీయాలు, తేలికపాటి చిరుతిండే గతి! హిందూ మహా సముద్రం అట్టడుగు నేలను ‘మత్స్య 6000’ తాకబోదు. సముద్ర భూతలానికి అది కొన్ని మీటర్ల పైన ఉంటుంది. సూర్యకాంతి ప్రసరించదు కనుక అక్కడి గాఢాంధకారంలో చూసేందుకు నౌకకు శక్తిమంతమైన లైట్లు ఉంటాయి.

కడలి కడుపులోకి వెళ్లిన ‘మత్స్య 6000’తో సమాచార సంబంధాలు కొనసాగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి సరిగ్గా దాని పైభాగంలో సముద్ర ఉపరితలంపై మాతృ నౌక (ఓడ) ఉంటుంది. ‘మత్స్య 6000’లో నీటి అడుగున పనిచేసే అటానమస్ కోరింగ్ సిస్టమ్, డీప్ సీ మైనింగ్ సిస్టమ్ వంటి పరికరాలు అమర్చుతారు.

Updated On 13 Sep 2023 3:26 AM GMT
somu

somu

Next Story