- మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా..?
- నిత్యం భారత్, చైనాతో సరిహద్దు ఘర్షణలు..
- దిగుమతులపై తగ్గని ప్రభావం
విధాత: సాధారణంగా సరిహద్దు ఘర్షణలు ఆయా దేశాల మధ్య వర్తక వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇరు దేశాలు ఎగుమతులు, దిగుమతుల్లో ఇబ్బందులు ఎదుర్కొని వస్తు కొరతను ఎదుర్కొంటాయి. కానీ.. భారత్, చైనాలు ఈ విషయంలో మినహాయింపుగా కనిపిస్తున్నాయి.
ఘర్షణలు ఘర్షణలే.. వ్యాపారం వ్యాపారమే అన్నట్లుగా ఇరుదేశాల వ్యవహారం ఉన్నది. ఒక వైపు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్నా.., ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడకపోవటం బలమా..? బలహీనతా అని చర్చనీయాంశమవుతున్నది.
ఈ మధ్యనే హిమాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ యాంగ్సేలో ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరువైపులా సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకు ముందు గల్వాన్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణలో 20మంది భారత సైనికులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ఇంతకంటే ముందే డోక్లాం భూటాన్ కూడలిలో ఘర్షణలు జరిగాయి. ఇలా గత ఏడేండ్లుగా సరిహద్దు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో ప్రభుత్వాలు ప్రకటించక పోవటం గమనార్హం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాల నుంచి భారత్ 61,305 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు చేసుకొన్నది. ఇందులో చైనా వాటా 15.42 శాతం ఉండటం విశేషం. అంటే దిగుమతులపై మన దేశం వెచ్చిస్తున్న వంద రూపాయాల్లో రూ. 15 చైనాకే వెళ్తున్నాయి.
2021-22 సంవత్సరంలో భారత్ 13వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. వీటితో పాటు… న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, రసాయనాలు, రసాయన సమ్మేళనాలు, ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఎరువులు, వాహన పరికరాలు, ఇనుము, స్టీలు, స్టీలు ఉత్పత్తులు, అల్యూమినియం తదితరాలను చైనానుంచి భారత్ దిగుమతి చేసుకొన్నది.
మన దేశానికి ఎగుమతి చేస్తున్న దేశాలు.. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, అమెరికా, ఇరాక్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్, సింగపూర్, ఇండోనేషియా, దక్షిణ కొరియా లాంటి దేశాలు చైనా తర్వాతి స్థానాలు ఆక్రమించాయి.
ఈ నేపథ్యంలోనే.. దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్‌లు దర్శనమిస్తున్నాయి. దేశంలో మూలమూలనా జిల్లా, మండల స్థాయి టౌన్లలో కూడా చైనా అంగళ్లు ఉంటున్నాయి. వీటిలో గుండుపిన్ను, ఇయర్ బడ్స్ మొదలు ప్లాస్టిక్ మగ్గులు, ఇంట్లో నేలను తూడ్చే కుంచెల దాకా చైనా ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. చైనా నుంచి వస్తున్న వస్తువులను చూస్తే.. చైనా ఉత్పత్తుల వెల్లువ ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఎగుమతులు, దిగుమతులను ఒక సారి పరిశీలిస్తే.. భారత్ బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. చైనాకు భారత్ నుంచి ఎక్కువగా ముడిసరకులు ఎగుమతి అవుతుంటే.., అక్కడి నుంచి పూర్తిగా తయారైన వస్తువులు దిగుమతి అవుతుండటం చూడవచ్చు. మన పాలకులు గొప్పలుపోతున్న మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా..?