IND vs SL | ఆసియా కప్ 16వ ఎడిషన్ ఫైనల్ నేడు భారత్, శ్రీలంక జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. కొలంబోకు చెందిన ఆర్. ప్రేమదాస మైదానంలో జరిగే ఫైనల్ షోడౌన్‌లో రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. భారత్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 166 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ‌గా, శ్రీలంక కేవలం 57 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక భారత జట్టు 97 మ్యాచ్‌ల్లో లంకను ఓడించ‌గా, మిగ‌తా 11 మ్యాచ్‌ల్లో […]

IND vs SL |

ఆసియా కప్ 16వ ఎడిషన్ ఫైనల్ నేడు భారత్, శ్రీలంక జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. కొలంబోకు చెందిన ఆర్. ప్రేమదాస మైదానంలో జరిగే ఫైనల్ షోడౌన్‌లో రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. భారత్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 166 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ‌గా, శ్రీలంక కేవలం 57 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

ఇక భారత జట్టు 97 మ్యాచ్‌ల్లో లంకను ఓడించ‌గా, మిగ‌తా 11 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ టై అయింది. అయితే గత 6 మ్యాచ్‌లు చూస్తే.. టీమిండియా 5 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీనిని బ‌ట్టి చూస్తే లంక‌పై టీమిండియాదే పై చేయిగా ఉంది. కాక‌పోతే గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడగా, ఆ ఫైన‌ల్‌లో శ్రీలంక‌పై మూడు సార్లు ఓడిపోయింది.

1984లో ప్రారంభమైన ఆసియాకప్ తొలి ఎడిషన్‌లో శ్రీలంక‌పై భార‌త్ గెలిచి టైటిల్ కైవ‌సం చేసుకుంది. అనంత‌రం 1988, 1991, 1995 ఫైనల్స్‌లో కూడా లంకను ఓడించింది భార‌త జ‌ట్టు. కాని 1997లో భార‌త్‌ని శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

ఆ తర్వాత 2004, 2008లోనూ భారత్‌.. శ్రీలంక చేతిలో ఓడింది. 2010లో జరిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో మాత్రం టీమిండియా.. శ్రీలంక‌ని ఓడించి ట్రోఫీ అందుకుంది. ఇప్పుడు 13 ఏళ్ల త‌ర్వాత శ్రీలంక‌-ఇండియా ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.అయితే, శ్రీలంకలో జరిగిన రెండు ఫైనల్స్‌లో టీమిండియా ఓట‌మి చెంద‌డంతో నేటి మ్యాచ్‌పై అభిమానుల‌లో ఆందోళ‌న నెల‌కొంది.

బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍‍కు విశ్రాంతి తీసుకున్న భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌లో తిరిగి ఆడ‌నున్నారు. ఇక గాయపడిన అక్షర్ పటేల్ జట్టులో ఆడ‌డం డౌటే. శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తుంది.

పిచ్ స్పిన్‍కు ఎక్కువ అనుకూలంగా ఉంటే మాత్రం ఇషాన్ కిషన్‍ను పక్కన పెట్టి.. పార్ట్ టైమ్ స్పిన్ బౌలింగ్ వేయగలిగే తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీలంక జ‌ట్టులో మహీశ్ తీక్షణ గాయపడడం శ్రీలంకకు ఎదురుదెబ్బగా మారింది. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ దసున్ హేమంత ఆడ‌నున్నారు.

ఆసియాకప్ ఫైనల్‍కు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ వాషింగ్టన్ సుందర్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా

Updated On 17 Sep 2023 1:40 PM GMT
sn

sn

Next Story