- ఈ దేశం వద్దనుకుంటున్నారు
- ఏడేండ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న వారు తొమ్మిది లక్షలకు పైనే
- పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాజిక శాస్త్రవేత్తలు
విధాత: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెలువరించిన గణాంకాలు సామాజిక శాస్త్రవేత్తలు, సామాన్యులకు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడేండ్లలో (2015 – 2021) దేశ పౌరసత్వాన్ని వదులుకున్నవారి సంఖ్య 9,32,276 ఉన్నదని విదేశాంగ శాఖ తెలియజేసింది. అంటే రోజుకి సగటున దేశ పౌరసత్వాన్ని వదులువుంటున్న భారతీయుల సంఖ్య 365 గా ఉంటుండటం గమనార్హం.
ఏటా లక్షల మంది..
భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో, ఒక సంక్షోభ కాలంలో ఉంటున్నది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 2015నుంచి క్రమం తప్పకుండా ఏటా లక్షమందికి పైగా పౌరసత్వాన్ని వదులు కుంటున్నారు. 2021నాటికి అది మరింత పెరగి 1,63,370కి చేరుకోవటం ఆందోళన కరం.
బతుకు దెరువు కోసమేనా..
ఒక దేశ పౌరులు తమ జన్మభూమిని వదిలి విదేశాలకు వలస పోవటమే అరుదు. స్వదేశంలో జీవనాధారం కరువైనప్పుడు ఒక అనివార్య పరిస్థితుల్లోనే విదేశీ బాట పడుతారు. అలా మన దేశం నుంచి బయటి దేశాలకు బతుకు దెరువు కోసం పోతున్న వారు ఏటా లక్షల సంఖ్యలోనే ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు బతుకు బాట పడుతున్నవారు ఈ కోవలోకి వస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా, ఇంగ్లండ్, యూరప్ దేశాలకు వలసలు పెరిగిపోయాయి. ప్రధానంగా చదువుల పేరిట పోతున్న వారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నా, వీరంతా తిరిగి ఇండియాకు తిరిగి వస్తున్న వారు ఎంత మంది అని చూస్తే అసలు విషయం తెలిసి వస్తుంది.
చదువుల కోసం వెళ్లి.. అక్కడే..
విదేశీ విమానం ఎక్కిన వారిలో 90 శాతంకు పైగా అక్కడే ఉండిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల పేరిట విదేశీ బాట పట్టిన వారిలో ఎక్కువ శాతం ఆయా దేశాల్లోనే ఉండిపోవటానికే ఇష్టపడుతున్నారు. అక్కడే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడుతున్నారు. మరో ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే.. విదేశాల్లో ఉంటూ అక్కడి పౌరసత్వం ఉన్న వారికే పెండ్లికి పిల్లదొరికే పరిస్థితి ఏర్పడింది.
విదేశాలకు పంపాలనే ఆలోచనే..
మరో సామాజిక కోణం కూడా కనిపిస్తున్నది. గతంలో అయితే అటు వామపక్షవాదుల్లోనూ, జాతీయ వాదుల్లోనూ తమ పిల్లలను స్వదేశంలోనే ఉంచేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశం పట్ల ఆ విధంగా తమ నిబద్ధతను చాటుకొనే వారు. అలాంటి వారు సైతం ఈ మధ్యన తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు ఆలోచిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు భారత్లో కంటే విదేశాల్లోనే భద్రంగా ఉంటుందని విశ్విసించే పరిస్థితి ఏర్పడింది.
వలసల నివారణకు చర్యలు తీసుకోకపోతే..
మోదీ అనుసరిస్తున్న హింసాత్మక విభజన రాజకీయాల పట్ల జాతీయ వాదుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. మరీ ముఖ్యంగా ఆధునిక ఉదారవాద విలువలను నమ్ముతున్న వారు మోదీ పాలనా తీరుపట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
ఈ పరిస్థితుల పట్ల సామాజిక కార్యకర్తలు మొదలు ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవారు సైతం తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి వలసల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోక పోతే దేశ భవిశ్యత్తు అంధకారమే అనటంలో అతిశయోక్తి లేదు. వ్యక్తిగత కారణాలతోనే దేశ పౌరసత్వాన్ని వదులు కుంటున్నట్లు కేంద్ర హోమ్ శాఖ వెల్లడిస్తున్నది.