Indian Railway | భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటేనే రైళ్లలో బెర్తులు దొరుకుతుంటాయి. పండుగలు, సెలవుల సమయంలో రద్దీగా ఉంటుంది. ఎండాకాలంలో ఏసీ కోచ్‌లలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసినా.. డిమాండ్ కారణంగా అందరికీ బెర్తులు దొరుకవు.
అయితే, అనుకోకుండా ప్రయాణం చేయాల్సిన సమయాల్లో రైలు టికెట్లు బుక్ చేసిన సందర్భంలో టికెట్లు దొరకవు.. దొరికినా ఆర్ఏసీ కేటగిరిలో బుక్ అవుతుంటాయి. బెర్త్ కన్ఫర్మ్ అయిన వారు ప్రయాణం రద్దు చేసుకుంటేనే ఆర్ఏసీ వారిలోకి బెర్త్ దొరుకుతుంది. లేదంటే కూర్చొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ఏసీ బోగీలో ఆర్ఏసీ టికెట్ ఉంటే.. దుప్పటి, షీట్, దిండు ఉంటాయా? లేదా? అనే సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. ఆర్‌ఏసీ ప్రయాణికులకు గతంలో ఈ సదుపాయం ఉండేది కాదు. దీంతో ఏసీ కోచ్‌లో ఆర్ఏసీ కింద ప్రయాణం చేసేవారే ఇబ్బందులు పడేవారు. వాటిని దృష్టిలో ఉంచుకొని 2017 నుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా దుప్పటి, దిండు, బెడ్ షీటు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఆర్ఏసీ సీటుపై కూర్చున్న ఇద్దరికీ వీటిని అందిస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు బెర్త్ కన్ఫార్మ్ అవ్వకపోతే.. ఆ రైలులోని జనరల్ కంపార్డ్‌మెంట్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మరో వైపు.. భారతీయ రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తున్నది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లను తీసుకువస్తున్నది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి.