Canada నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఈ విషయం మోదీ వద్ద ప్రస్తావించా దర్యాప్తుకు సహకరించాలని కోరా కెనడా పార్లమెంటులో ట్రూడో ప్రకటన భారత సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ ఆరోపణలను ఖండించిన భారత్ కెనడా సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ ఒట్టావా: భారత ప్రభుత్వంపై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనలో భారత్ పాత్ర ఉందని ఆయన కెనడా పార్లమెంటులో ప్రకటించారు. ఖలిస్థాన్ ఉగ్రవాదిగా పేరు […]

Canada
- నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర
- ఈ విషయం మోదీ వద్ద ప్రస్తావించా
- దర్యాప్తుకు సహకరించాలని కోరా
- కెనడా పార్లమెంటులో ట్రూడో ప్రకటన
- భారత సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ
- ఆరోపణలను ఖండించిన భారత్
- కెనడా సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ
ఒట్టావా: భారత ప్రభుత్వంపై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనలో భారత్ పాత్ర ఉందని ఆయన కెనడా పార్లమెంటులో ప్రకటించారు. ఖలిస్థాన్ ఉగ్రవాదిగా పేరు గాంచిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో ఒక గురుద్వారా బయట ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనడానికి తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని ట్రూడో పేర్కొన్నారు. కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయని తెలిపారు. నిజ్జర్ హత్య గురించి జీ-20 సదస్సు సందర్భంగా మోదీ వద్దా ప్రస్తావించానని పేర్కొన్నారు. తమ దేశంలో ఇలాంటి చర్యలకు అనుమతించబోమని.. దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు.
ఈ వ్యవహారంపై అమెరికా ప్రధాని జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రుషీ సునాక్‌లకు కూడా సమాచారం అందించామని కెనడా విదేశాంగ శాఖ మంత్రి జోలీ వెల్లడించారు. అంతే కాకుండా త్వరలోనే జీ-7 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ విషయాల గురించి సమాచారం ఇస్తానని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిరసనగా కెనడాలో రా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఖండించిన భారత్..
కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను భారత్ నిర్ద్వద్వంగా ఖండించింది. ‘మేము కెనడా ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటనను గమనించాం. ఈ ఆరోపణలు నిరాధారం, కుట్రపూరితం. ప్రజాస్వామ్య దేశంగా చట్టబద్ధంగా మాత్రమే మా నిర్ణయాలు ఉంటాయి’ అని భారత్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
అంతే కాకుండా భారత్ లోని కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 5 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన దశలో.. ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
జీ-20 సదస్సులోనూ అంటీముట్టనట్టుగా తిరిగిన ట్రూడో.. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలనూ ఏకపక్షంగా నిలిపివేశారు. ఈ అక్టోబరులో భారత్‌కు రావాల్సి ఉన్న ఆ దేశ ఆర్థిక మంత్రి కూడా తన పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తాజాగా కొన్ని రోజుల ముందే ప్రకటించారు.
ఖలిస్థాన్‌కు నిధుల సేకరణ
హత్యకు గురైన నిజ్జర్ కెనడాలో ఉన్న గురుద్వారాల వద్ద నుంచి ఖలిస్థాన్ ఉద్యమానికి నిధులు సేకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థాన్ దేశం ఏర్పడాలని కెనడాతో పాటు వివిధ దేశాల్లో రెఫరెండంలు నిర్వహించడంలో ఇతడు కీలకపాత్ర పోషించాడు.
