IRCTC Tour Package | వేసవిలో ఎండలు మండుతున్నాయి. సెలవులు సైతం దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పర్యాటక ప్రదేశాలు, ఆలయాలకు వెళ్లి రావాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రదేశాలను వీక్షించేందుకు ‘కోస్టల్ కర్ణాటక’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రముఖ ఆలయాలను సందర్శించే అవకాశం ఉన్నది. ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నది. ప్రతి మంగళవారం ప్యాకేజీ అందుబాటులో ఉండనున్నది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.05 గంటలకు రైలు బయలుదేరుతుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
‘కోస్టల్ కర్ణాటక’ ప్యాకేజీ ఆరు రోజులు, ఐదు రాత్రుల పాటు కొనసాగనున్నది. ప్యాకేజీలో స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరిలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ కేటరిగిలో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కఫ్టర్ కేటగిరిలో త్రీ టైర్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీలో ధరలు రూ.11,600 రూ.34,270 వరకు ఉన్నది. కంఫర్ట్ కేటగిరిలో ఒకరికి రూ.34,270 ధర ఉండగా.. డబుల్ షేరింగ్‌లో రూ.19,570, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.15,550, 5-11 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.9,990 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో ఒక్కొక్కరికి రూ.31,270 ఉండగా.. డబుల్ షేరింగ్‌లో రూ.31,270, డబుల్ షేరింగ్‌లో రూ.16,570, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.12,500, పిల్లలకు రూ.6,950 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే మరింత ధర తగ్గే అవకాశాలుంటాయి.
ఏయే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారంటే..
ఇక ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, మంగళూరు, సెయింట్ మేరేస్ ద్వీపం, మల్పే బీచ్, జోగ్ జలపాతాన్ని వీక్షించవచ్చు. అలాగే శ్రీ కృష్ణ ఆలయం, శారదాంబ ఆలయం, మూకాంబిక ఆలయం, గోకర్ణలోని మురుడేశ్వర్ ఆలయం, కటీల్ ఆలయం, మంగళ దేవి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు మూడు రాత్రుల వసతి, అల్పాహారం, ప్రయాణ బీమా అన్ని ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. మురుడేశ్వర్ 20 అంతస్తుల ఆలయ గాలి గోపురం అందరినీ ఆకట్టుకుంటుంది. కందుక పర్వతం మీద మూడువైపులా అరేబియా సముద్రం కనిపిస్తూ కనువిందు చేసింది. దేవాలయానికి వెళ్లే తోవలో ఏనుగులు సందడి చేస్తాయి. ఆలయ సముదాయంలో శివుడి విగ్రహం దర్శనమిస్తుంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి సైతం ఈ విగ్రహం కనిపిస్తు ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద శివుడి విగ్రహం ఇది. 123 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ విగ్రహాన్ని శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి రూ.కోటి ఖర్చు చేసి తీర్చిదిద్దారు. సూర్యరశ్మి పడినప్పుడల్లా విగ్రహం మెరుస్తూ చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది.