గెలుపు గుర్రాల కోసం వలస నేతలకై కమలం దళం ఎదురుచూపులు! విధాత, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠం అందుకునేందుకు కదనోత్సాహంతో కదులుతున్న బీజేపీ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ స్థానాల గెలుపు లక్ష్యం సవాల్‌గా మారడం కమలదళాన్ని కలవర పెడుతున్నది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమల వికాసానికి శ్రీకారం చుడుతారన్న బీజేపీ నాయకత్వం ఆశలను సీఎం కేసీఆర్ […]

గెలుపు గుర్రాల కోసం వలస నేతలకై కమలం దళం ఎదురుచూపులు!

విధాత, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠం అందుకునేందుకు కదనోత్సాహంతో కదులుతున్న బీజేపీ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ స్థానాల గెలుపు లక్ష్యం సవాల్‌గా మారడం కమలదళాన్ని కలవర పెడుతున్నది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమల వికాసానికి శ్రీకారం చుడుతారన్న బీజేపీ నాయకత్వం ఆశలను సీఎం కేసీఆర్ తన వ్యూహాలతో చిత్తుచేసి కాంగ్రెస్ సిట్టింగ్స్ స్థానాన్ని ఎగరేసుక పోవడంతో పాటు జిల్లాలో కమల వికాసం సాగకుండా అడ్డుకోగలిగారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దక్కకపోయినా.. బీజేపీ సాధించిన ఓట్లు భవిష్యత్తులో కమల వికాసం పై నమ్మకాన్ని పెంచాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు దీటైన అభ్యర్థులు బీజేపీ నుంచి కరువవ్వడం బీజేపీ అగ్రనాయకత్వానికి జీర్ణించుకోలేని సత్యమే. గతంలో కొంతకాలం కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌లకు కంచుకోటగా పేరొందిన ఉమ్మడి నల్గొండ జిల్లా.. ప్రస్తుతం మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో గులాబీ కోటగా మారిపోయింది.

అధికార పార్టీ టీఆర్ఎస్ గులాబీ కోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమల వికాసం అంత సులభంగా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లా రాజకీయాల్లో టీఆర్ఎస్ తర్వాత పైకి బలంగా కనిపించే కాంగ్రెస్ నుంచి సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి లతో సహా ప్రతి నియోజక వర్గంలో పేరొందిన అభ్యర్థులు ఉన్నారు. అయినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గులాబీ కోటలో విజయం కోసం ఎదురీత తప్పని పరిస్థితులు ఉన్నాయి.

ఈ పరిణామాల్లో బీజేపీ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాతా తెరువాలన్న.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించి కనీసం నాలుగైదు స్థానాలైనా గెలవడం అనివార్యం. అయితే క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలను విశ్లేషిస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల కంటే దీటైన ప్రజాదరణ, ఆర్థిక, సామాజిక సమీకరణల బలమున్న గెలుపు గుర్రాల వంటి అభ్యర్థుల కొరత పెద్ద లోటుగా కనిపిస్తుంది.

ప్రజల్లో ఎన్నికల నాటికి బీజేపీ గాలి వీచినా ఆ ఊపును ఓట్ల రూపంలో అందిపుచ్చుకొని అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగిరేసే చెప్పుకోదగ్గ నాయకుల కొరత బీజేపీ రాజకీయ లక్ష్యాలకు అవరోధంగా మారింది. జిల్లాలో బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసి తాజాగా ప్రతి నియోజక వర్గానికి పార్టీ కన్వీనర్లను సైతం నియమించి పార్టీ కేడర్ను వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న బీజేపీ నాయకత్వం గెలిచే అభ్యర్థుల కోసం ఇప్పటినుంచే వేట కొనసాగిస్తుంది.

వలస నేతలపైనే కమల దళం ఆశలు

గులాబీకోట ఉమ్మడి నల్గొండ జిల్లాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలంటే వలస నేతలే పెద్దదిక్కుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తారన్న ఆశలతో బీజేపీ నాయకత్వం ఉంది. అలాగే కొత్తగా బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిట్ట బాలకృష్ణ రెడ్డిలు కూడా రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలు అవుతారని కమలదళం భారీ ఆశలు పెట్టుకుంది.

వారిద్దరిలో ఒకరిని భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపవచ్చని భావిస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత శ్యాంసుందర్ అందుకు ఆటంకంగా ఉన్నారు. జిట్టా, బూరలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతారా లేక వారిలో ఒకరిని పార్లమెంట్ ఎన్నికల పోరుకు ఎంపిక చేస్తారా స్పష్టత కొరవడింది. సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు బలమైన అభ్యర్థిగా ఉన్నప్పటికీ మంత్రి జగదీష్ రెడ్డితో పోటీ పడడమూ కష్టమే.

ఆలేరులో గత ఎన్నికల్లో పోటీ చేసిన కాసం వెంకటేశ్వర్లు మరోసారి పోటీ చేసే అవకాశం ఉన్నా.. మరో నేత దాసరి మల్లేశంకు అవకాశం దక్కినా ఇక్కడ బీజేపీ విజయం కోసం ఎదురీదాల్సిందే. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలమైన వలస నేత కోసం ఎదురు చూస్తోంది. నల్గొండలో బీసీ నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డిలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్నికల నాటికీ ఎవరైనా బలమైన వలస నేతలు బీజేపీలోకి రావచ్చన్న ప్రచారం కమలదళంలో వినిపిస్తుంది.

ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాక కోసం బీజేపీ నాయకత్వం గట్టిగా ఎదురు చూపులు పడుతుంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా తోడైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం నాలుగైదు స్థానాలపై గెలుపు ఆశలు పెట్టుకోవచ్చని, వారితో పాటు కాంగ్రెస్ నుంచి నియోజకవర్గ నేతలు కాషయ తీర్థం పుచ్చుకుంటే కొంతవరకు గెలుపు గుర్రాల కొరత తీరనుందని కమల దళం ఆశిస్తుంది.

దేవరకొండలో ప్రస్తుతం బీజేపీ నుంచి లాలూ నాయక్, కళ్యాణ్ నాయక్‌లు ఎన్నికల రంగంలో ఉండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే బిజెపిలోకి బాలునాయక్ వచ్చే అవకాశం లేకపోలేదు. తుంగతుర్తిలో కడియం రామచంద్రయ్య, నకరేకల్‌లో నకిరేకంటి మొగిలయ్య, షాపూరి రవిలు, మిర్యాలగూడలో సాదినేని శ్రీనివాసరావు, బిఎల్ఆర్‌లు, నాగార్జునసాగర్‌లో కంకణాల శ్రీధర్ రెడ్డి దంపతులు, రిక్కల ఇంద్రసేనారెడ్డి, కోదాడలో బొబ్బ భాగ్యరెడ్డి, హుజూర్నగర్‌లో గట్టు శ్రీకాంత్ రెడ్డిలు పార్టీ పరంగా టికెట్ రేస్‌లో ఉన్నారు.

అయితే ఆ నియోజకవర్గాల్లో గెలుపు సాధనకు పార్టీ పరంగా అందుబాటులో ఉన్న అభ్యర్థుల బలాబలాలు చాలని నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకొని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ మాజీమంత్రి జానారెడ్డి కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిల కోసం బీజేపీ వల వేస్తున్నది.

నకిరేకల్‌లో టిఆర్ఎస్ టికెట్ దక్కని పక్షంలో చిరుమర్తి లింగయ్య లేదా వేముల వీరేశంలో ఎవరైనా బీజేపీ వైపు అడుగులు వేయచ్చని బీజేపీ అంచనా వేస్తుంది. ఇదే తరహాలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల నుంచి రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కని ముఖ్య నాయకులను బీజేపీ నుంచి బరిలోకి దించి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి గెలుపు గుర్రాల కోసం బీజేపీ వలస నేతల వేటను ఉదృతం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఏది ఎలా ఉన్న రాష్టంలోని మిగతా జిల్లాల్లో బీజేపీ పేరు వినిపిస్తున్నప్పటికీ ఉమ్మడి నల్లగొండకు వచ్చే సరికి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉన్నఫలంగా ఎన్నికలు జరిగినా, ఏడాది తర్వాత ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ మినహ బీజేపీ పేరు మరెక్కడా వినపడడం లేదు.

Updated On 5 Dec 2022 9:40 AM GMT
krs

krs

Next Story