డోర్నకల్‌ గులాబీలో లుకలుకలు మంత్రి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యా ఎర్రబెల్లి వద్ద ఇరువర్గాల అసంతృప్తి జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితకు పరీక్ష సభ సందర్భంగా విభేదాలు బహిర్గతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట సీఎం సభ సాక్షిగా డోర్నకల్ నియోజకవర్గ గులాబీ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీలో ఉన్న విభేదాలు ఈనెల 18న జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం సందర్భంగా వెలుగు చూశాయి. ఖమ్మం సభ తర్వాత […]

  • డోర్నకల్‌ గులాబీలో లుకలుకలు
  • మంత్రి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యా
  • ఎర్రబెల్లి వద్ద ఇరువర్గాల అసంతృప్తి
  • జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితకు పరీక్ష
  • సభ సందర్భంగా విభేదాలు బహిర్గతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట సీఎం సభ సాక్షిగా డోర్నకల్ నియోజకవర్గ గులాబీ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీలో ఉన్న విభేదాలు ఈనెల 18న జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం సందర్భంగా వెలుగు చూశాయి. ఖమ్మం సభ తర్వాత ఈ సమస్యను చర్చించుకోవాలని ఇరువర్గాల ముఖ్య నాయకులు భావించారు. మంత్రి ఎర్రబెల్లి హామీతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. సభ పూర్తయినందున ఎర్రబెల్లి ఇచ్చిన హామీ నెరవేరుతుందా? లేదా? అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

తొలి నుంచి రెండు వర్గాలు

డోర్నకల్ నియోజకవర్గంలో ఎంతో కాలంగా రెండు గ్రూపులు ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ పైకి ఇరువర్గాలు గుంభనంగా వ్యవహరిస్తూ ఇంతకాలం తామంతా కలిసి ఉన్నట్లు నటిస్తూ వస్తున్నారు. తాజాగా జిల్లాలో జరుగుతున్న వరుస కార్యక్రమాల నేపథ్యంలో ఆధిపత్య పోరు మరోసారి వెల్లడయ్యింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు డోర్నకల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్ మధ్య ఉన్న విభేదాలు తాజాగా మరోసారి వెలుగు చూస్తున్నాయి.

పాత వైరుధ్యాలు… కొత్త సమస్యలు

వాస్తవానికి ఈ ఇద్దరు నాయకులు టిఆర్ఎస్‌లో చేరకముందు ప్రత్యర్థి పార్టీలలో ప్రాతినిధ్యం వహిస్తూ పరస్పర వ్యతిరేకులుగా పోటీ పడుతూ వచ్చారు. చాలా కాలం సత్యవతి రాథోడ్ టిడిపి నుంచి రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2009లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో చేరారు.

2014 ఎన్నికల్లో సత్యవతి రాథోడ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, డి ఎస్ రెడ్యానాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో సత్యవతి ఓడిపోగా రెడ్యానాయక్ గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రత్యర్థి పార్టీల నేతలు ఇరువురు ఒకే పార్టీలో చేరిపోయారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య గ్రూపు తగాదాలు, కేడర్, లీడర్ల మధ్య విభేదాలు, ఎవరి వర్గం వారిగా ఒకే నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు. ఎవరికివారు తమ అనుచరులను కలిగి ఉన్నారు.

రాథోడ్‌ను వరించిన మంత్రి పదవి

2018 ఎన్నికల్లో సిట్టింగు ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ కు అధిష్టానం అవకాశం కల్పించడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఈ సమయంలో సత్యవతి రాథోడ్ పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం అనూహ్యంగా సత్యవతికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడమే కాకుండా సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో డోర్నకల్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

మంత్రి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యా

మంత్రి వర్గంలో రాథోడ్‌కు అవకాశం దక్కడంతో గెలిచిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గం ఆత్మరక్షణలో పడింది. ఈ పరిణామంతో మళ్లీ డోర్నకల్‌లో రెండు అధికార కేంద్రాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరికి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎవరివర్గాన్ని వారు, అనుచరులను కాపాడుకునేందుకు ప్రయత్నం, పట్టుసడలకుండా పరోక్ష ఎత్తుగడలు, ఆధిపత్యం చాపకింద నీరులా సాగుతోంది.

మంత్రి తీరుపై ఎమ్మెల్యే ఆక్షేపణ

ఈ క్రమంలో ఇటీవల రెడ్యానాయక్ స్వల్ప అనారోగ్యం( మోకాలి) సమస్యతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో మంత్రి సత్యవతి గ్రామపంచాయతీలకు కొత్త భవనాలు, రోడ్ల నిర్మాణం తదితర పనులకు డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు ప్రకటించారు. కొద్దిరోజులకే అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం ఇటీవల ఇంటికి వచ్చారు. వెంటనే రెడ్యానాయక్ మంత్రి తీరును ఆక్షేపిస్తూ ఈ నిధులు వచ్చేందుకు తానే ప్రయత్నిస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి మరియు ప్రకటించిన విషయం ఇరువురి మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.

మానుకోట సభతో విభేదాలు బహిర్గతం

ఈ క్రమంలోనే మొన్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సహజంగానే జిల్లా మంత్రిగా సత్యవతి రాథోడ్ అంతా తానై వ్యవహరించారు.ఈ సభలో తమకు తగిన మర్యాద దక్కలేదని రెడ్యా నాయక్ వర్గం భావిస్తోంది. ఈ మేరకు రాథోడ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ సభకు జన సమీకరణ నిమిత్తం డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో రెడ్యానాయక్ అనుచరులు మానుకోట సభలో తమకు గౌరవం దక్కలేదని మంత్రి ఎర్రబెల్లి ముందు తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

మానుకోట ముఖ్యమంత్రి బహిరంగసభలో మాకు మర్యాద తగ్గిందనీ, ఏకపక్షంగా కార్యక్రమం నడిచిందని ఇలా అయితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి రెడ్యానాయక్ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన వర్గం నేతలు ఆక్షేపించారు. ఈ సందర్భంగా పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ తీరును విమర్శించినట్లు సమాచారం. మరిపెడలో మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి డోర్నకల్ నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేశారు.

రెడ్యా తీరు పై రాథోడ్ వర్గం అసంతృప్తి

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీరుపై నియోజకవర్గంలోని మంత్రి సత్యవతిరాథోడ్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి వెంట ఉన్నంత మాత్రాన తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏ సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్వవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం, మానుకోట సభల సన్నాహక సమాచారం కూడా ఇవ్వరా అంటూ ప్రశ్నించారు.

మంత్రి ఎర్రబెల్లికి కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తమ ఆవేదన వ్యక్తంచేశారు. డోర్నకల్‌లో ఇరువర్గాలను సమన్వయం చేసేందుకు జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఎంపీ మాలోత్ కవిత మరికొంత శ్రద్ధ వహించాలని వారు కోరారు.

ఇరువర్గాలకు ఎర్రబెల్లి హామీ

రెడ్యానాయక్, సత్యవతి వర్గాల ఫిర్యాదు పై స్పందించిన ఎర్రబెల్లి ఇకనుంచి అలా జరగదని డోర్నకల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని మరో మంత్రి దయాకర్ రావు సమాధానపరిచి, శాంతింపజేసినట్లు సమాచారం. ముందుగా ఖమ్మం బహిరంగసభను విజయవంతం చేద్దాం. అంతా నేను సరిచేస్తాను, సమన్వయం చేస్తానని ఎర్రబెల్లి మాట ఇచ్చినట్లు సమాచారం.

పార్టీలో కోపతాపాలు సహజమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఏ విభేదాలున్నా పార్టీ ముఖ్యమని అది మంచిగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. అయితే ఖమ్మం సభ తర్వాత ఈ విభేదాల పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. అయితే డోర్నకల్‌లో ఒక మంత్రికి వ్యతిరేకంగా మరో మంత్రి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారా? ఏ మేరకు చొరవ తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అయితే సత్యవతి, ఎర్రబెల్లికి టీడీపీ కాలం నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.

ఎంపీ కవితకు కత్తిమీద సాము

మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఎంపీ మాలోత్ కవితకు డోర్నకల్‌లో పార్టీని సమన్వయ పరచడం కత్తి మీద సాముగా మారింది. ఈ జిల్లా పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గానికి తన తండ్రి మాజీ మంత్రి రెడ్యానాయక్ ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచే మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె గతంలో డోర్నకల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో ఆమెకు బలమైన అనుచరులతో పాటు కేడర్ కూడా ఉంది.

ఇలా ఉండగా డోర్నకల్ లో మంత్రి సత్యవతి రాథోడ్ కు తన తండ్రి ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు. వీరి మధ్య సమన్వయం సాగించడం కవితకు అనుభవానికి మించిన సమస్య. పైగా ఒకరు తండ్రి మరొకరు జిల్లా మంత్రి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో కవిత పార్టీని సమన్వయం చేయడం అనేది తలకు మించిన భారమే.

అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప ఈ నియోజకవర్గంలో విభేదాలు సమసిపోయే అవకాశాలు లేవని చెప్పవచ్చు. అందుకే ఎర్రబెల్లి ఏ ఆలోచనతో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారోననే చర్చ జరుగుతోంది.

Updated On 25 Jan 2023 5:36 PM GMT
krs

krs

Next Story