- స్వచ్ఛంద సంస్థలపై ఐటీ దాడులు
- క్రిస్టియన్ సంస్థలపై ప్రత్యేక దృష్టి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్వచ్ఛంద సంస్థలు(Voluntary organizations)లక్ష్యంగా ఐటీ సోదాలు(IT inspections) జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వరంగల్(Warangal) బాలవికాస స్వచ్ఛంద(Child Development Voluntary) ఆఫీసుల(Office)పై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు అనుబంధ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆఫీసుల్లో రికార్డులను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రముఖమైన బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయమైన హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లోని కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలవికాస సంస్థకు సంబంధించిన ముఖ్య కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
స్వచ్ఛంద సంస్థల పై కేంద్రం నిఘా
గత కొంతకాలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై వాటి కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రిస్టియన్ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. వాటి ఆర్థిక లావాదేవీలను నియంత్రించే పనిని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కాజీపేటలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ పై జరిగిన దాడిని ఈ పరంపరలో భాగంగా భావిస్తున్నారు.
బాల వికాస సంస్థ దీర్ఘకాలం నుంచి స్వచ్ఛంద సేవలు అందజేస్తుంది. ముఖ్యంగా మంచినీటి ఎద్దడి నెలకొన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి నీరందించే కార్యక్రమాన్ని గతంలో పెద్ద ఎత్తున చేపట్టింది. మహిళలు అందులో వితంతువుల సంక్షేమానికి బాలవికాస కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో తమ స్వచ్ఛంద కార్యకలాపాల ద్వారా సంస్థ విస్తరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం కలకలం సృష్టిస్తుంది.