IVF | Switzerland
విధాత: ఐవీఎఫ్ చికిత్స కోసం స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ప్రవాస భారతీయురాలికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర మానసిక క్షోభను కలిగించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంగళూరులోని వినియోగదారుల ఫోరం.. బాధితురాలికి విమాన టికెట్ల ఖర్చులు, దానిపై వడ్డీ, రూ.35 వేలను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసు వివరాలలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుని.. స్విట్జర్లాండ్‌లో స్థిర పడ్డారు. ఆమెకు గర్భం రాక పోవడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిని సంప్రదించారు. బెంగళూరుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించడంతో.. మార్చ్19, 2018న స్విస్ నుంచి నగరానికి వచ్చి చూపించుకున్నారు.
బయాప్సీ కోసం నమూనాలు సేకరించిన ఆస్పత్రి వర్గాలు 10 రోజుల్లో రిపోర్టు ఇస్తామని తెలపడంతో బాధితురాలు విదేశానికి వెళ్లిపోయారు. అయితే తర్వాత డాక్టర్ ఫోన్ చేసి ల్యాబ్ సిబ్బంది పొరపాటు కారణంగా బయాప్సీ కోసం తీసుకున్న నమూనా చెడిపోయిందని చెప్పారు.
మళ్లీ ఇండియా వస్తే ఉచితంగా చూస్తామని చెప్పినా.. తర్వాత మాట మార్చడంతో సదరు దంపతులు వినియోగదారలు ఫోరాన్ని ఆశ్రయించారు. ఇందులో ఆస్పతి ల్యాబ్ నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఫోరం.. టికెట్ ఖర్చు రూ.47,991ని వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఏప్రిల్ 29న ఈ తీర్పు వెలువడగా ప్రస్తుతం బయటకు వచ్చింది.