- ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
- అయినా కిక్కురుమనలేని దైన్యం
విధాత: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద.. ఆయన వ్యవహార శైలి మీద కమ్మ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉందా..?? లోలోన రగిలిపోతున్నాబయటకు చెప్పుకోలేక.. కక్కలేక మింగలేక మిన్నకుంటున్నారా..ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో కమ్మలకు పట్టున్న నియోజకవర్గాలు సైతం వైసిపీకి జై కొట్టాయి… కృష్ణ.. గుంటూరు జిల్లాలోని కమ్మలకు బాగా పట్టున్న నియోజక వర్గాల్లో సైతం వైసీపీ పాగా వేసింది. కానీ తరువాత ఏర్పడిన జగన్ మంత్రివర్గంలో కమ్మలకు ప్రాథాన్యం దక్కినట్లే దక్కి చేజారింది. కేవలం ఒక్కరంటే ఒక్కరే. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకున్న జగన్ ఆ తరువాత రెండున్నరేళ్లకే ఆయన్ను పదవి నుంచి తప్పించి, ఇంకేవర్నీ ఆ సామాజికవర్గం నుంచి కేబినెట్లోకి తీసుకోలేదు.
బహుశా ఆ ఉక్రోషమే కావచ్చు వసంత నాగేశ్వర రావుతో అలా మాట్లాడించింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి, గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వసంత నాగేశ్వరరావు జగన్ ప్రభ్యత్వం మీద ధ్వజమెత్తడాన్ని పలువురు వైసిపి ఎమ్మెల్యేలు సైతం లోలోన అభినందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకూ వసంత నాగేశ్వర రావు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక కమ్మ మంత్రి కూడా లేరని గుర్తు చేశారు.
ఏపీలో కంటే తెలంగాణలోనే కమ్మలకు మంచి ప్రాతినిథ్యం లభిస్తుందన్నారు. తెలంగాణ కేబినెట్లో కమ్మ మంత్రి ఒకరు ఉన్నారని.. ఏపీలో ఒక్కరు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పార్టీల తరఫున దాదాపు 20 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఒక్కరికీ కూడా మంత్రి పదవి లేకపోవడం విచారకరమన్నారు.
ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చినా ప్రశ్నించలేని స్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గంపై రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందిచడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల పేర్లన్నీ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోనే ఉన్నాయన్నారు.వీటిని ఏ ప్రభుత్వాలు మార్చలేదన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మాత్రం పేరు మార్చార న్నారు. కమ్మలు అత్యధికంగా ఉన్న నియోజక వర్గాల్లోనూ వేరే వర్గం ఎమ్మెల్యేలున్నారని వసంత నాగేశ్వరరావు గుర్తు చేశారు. సొంత కులాన్ని వదిలేసి వేరే సామాజిక వర్గాల పల్లకీలు మోయడం సరికాదన్నారు.