Wednesday, December 7, 2022
More
  Homelatestఅందరినీ ఏకతాటిపైకి తెచ్చిన సీఎం జగన్‌!

  అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన సీఎం జగన్‌!

  ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉన్నా ఇప్పటి నుంచే అధికార విపక్షాలు తమ సేనలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈసారి రాజకీయ పరిస్థితి మాత్రం కాస్త కలగాపులగంగా ఉంది.. వడగళ్ల వానకు భయపడి కోళ్ళూ.. మేకలూ ఓ చెట్టు నీడకు చేరినట్లు.. తమలో ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి చంపుతున్న పిల్లినుంచి రక్షణకు ఎలుకలన్ని ఒక కలుగులో దాక్కున్నట్లు.. పోట్ల గిత్త కొమ్ములతో కుమ్ముతుంటే మిగతా జీవులన్నీ పరుగెత్తి ఓ కాంపౌండ్లో దాక్కున్న తీరు ఇప్పుడు కనిపిస్తోంది.


  2019 అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన వైఎస్సార్సీపీ మెల్లగా రాష్ట్ర రాజకీయం మీద పట్టు బిగిస్తూ వస్తోంది. ఇంద్రజిత్ నుంచి ఊహించని తీరున దూసుకొచ్చిన శర పరంపరకు మూర్ఛిళ్లిన లక్ష్మణుడి మాదిరి అయిపోయింది చంద్రబాబు పరిస్థితి. అసలు ఎందుకు ఒడిపోయానో తెలీదు అంటూ కొన్నాళ్ళు శోకాలు పెట్టినా మెల్లగా తాను బీజేపీ నుంచి విడిపోవడమే ఓటమికి కారణమని ఆయన తెలుసుకుని మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈలోపు స్థానిక ఎన్నికలు మీద పడ్డాయ్.. అప్పటికే చావుదెబ్బ తిన్న టీడీపీ వర్గాలు అసలు స్థానిక ఎన్నికలు అంటేనే బెంబేలెత్తిపోయారు.


  దీంతో అన్ని పంచాయతీలు.. మున్సిపాలిటీలు.. పట్టణ..నగరపాలక సంస్థల్లో 90 శాతాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకున్నది. ఇందులో కూడా ఏకగ్రీవాలే అధికం.. భయ పెట్టి.. బెదిరించి గెలుచుకున్నారు అంటూ టీడీపీ చేసిన ఆక్రందనలు అరణ్య రోదన అయ్యాయి. చివరకు కుప్పంలో కూడా 90 శాతం స్థానాలు జగన్ ఖాతాలోకి వచ్చి పడ్డాయి.

  ఇదిలా ఉండగానే టీడీపీ సోషల్ మీడియాను వైసీపీ ప్రభుత్వం గట్టిగానే టార్గెట్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక పోష్టులు పెట్టే వారిని రాత్రికి రాత్రి సీబీసీఐడీ వాళ్ళు ఎత్తుకొచ్చి కేసులు పెట్టి భయ పెడుతున్నారు. మరో వైపు సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు సైతం గట్టిగా మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. నోరు విప్పితే జైలే గతి అన్న స్ట్రాంగ్ మెసేజిలు వెళ్లిపోయాయ్.


  అమరావతి రైతులే టార్గెట్!

  అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ రైతులు చేస్తున్న ర్యాలీని కూడా వైసీపీ అపహాస్యం చేస్తోంది. ఓ వైపు వారిని వెక్కిరిస్తునే అడ్డంకులు సృష్టిస్తోంది. వారికి పొటీగా వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మూడు రాజధానులే కావాలంటే కొత్త పాట ఆరంభించారు. టీడీపీ లీడర్స్, క్యాడర్ ఎవరైనా కుక్కిన పేనుల్లా పడి ఉండాలి తప్ప కిక్కురుమంటే కేసులే అన్న స్ట్రాంగ్ వార్నింగులూ వెళ్లిపోయాయ్.


  ఇక లెఫ్ట్ పార్టీలు అక్కడక్కడా ఉనికిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఒకవేళ వాళ్ళు వీధిలోకి వచ్చినా మరుక్షణమే జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.. దీంతో లెఫ్ట్ పార్టీలూ భయంతో వణికి పోతున్నాయ్. ఇక బీజేపీలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలాంటి కొందరు మాత్రం అప్పుడప్పుడూ గట్టిగా నోరు చేసుకుంటున్నా పాపం వాళ్ళ వాయిస్ సరిపోవడం లేదు.. లోతైన దిగుదుబావిలో పిల్ల కప్ప అరిచినట్లే.. పాపం బీజేపీ సౌండ్ బయటికి రావడం లేదు.


  నెక్స్ట్ పవన్!

  పవన్ రాష్ట్రంలో ఓ బలమైన శక్తిగా ఎదుగుదాం అనుకుంటున్నారే గానీ సిన్సియారిటీ కొరవడడంతో ఆయన గెస్ట్ పాత్రకే పరిమితం అవుతున్నారు. అప్పుడప్పుడు ఆంధ్రా వచ్చి హడావుడి చేయడం తప్ప నిత్యం ప్రజల్లో ఉండాలన్న ధ్యాస లేని పవన్ పేరును కూడా జగన్ ఏనాడూ ఉచ్చరించడం లేదు. ఓ సినిమా నటుడు.. పార్ట్ టైమర్ అంటూ ఎగతాళి చేస్తూనే పవన్ వ్యక్తిత్వాన్ని చిన్నగా చేసి చూస్తున్నారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా పవన్, చంద్రబాబు.. లోకేష్ వంటి వారి మీద తరుచూ తమదైన శైలీలో పోష్టులలతో దాడులు చేస్తూనే ఉంటున్నది.


  నిన్నటి విశాఖ ఎపిసోడ్లో ప్రభుత్వం ఏదో చెయ్యబోయి ఏదో చేసినట్లు అయింది. పవన్‌ను అత్యంత నిర్బంధంలో ఉంచడం అంటే ఆయనకు అనవసరమైన ప్రయార్టీ ఇచ్చినట్టే. కోతి పుండు బ్రహ్మరక్షసి చేసినట్లు అయింది. మొత్తానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలను వెంటాడి వేటాడుతున్న ఈ తరుణంలో వారంతా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితిని వైసీపీ కల్పిస్తోంది. అంటే పిల్లి నుంచి రక్షణకు ఎలుకలన్ని ఒకచోట చేరినట్లు అన్నమాట. గడ్డి పోచలు కలిసి ఏనుగును బంధించినట్లు ఈ ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉంటాయా.. వారి ఉమ్మడి టార్గెట్ అయిన జగన్‌ను గట్టిగా ఢీకొంటాయా.. రానున్న రోజుల్లో ఈ పక్షాలన్నీ ఒకే గొడుకు కిందికి వస్తాయా.. ఏం జరుగుతుందో చూడాలి.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page