వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు టీడీపీ-జ‌న‌సేన క‌లిస్తే వైసీపీ తలకిందులే ఆట‌లో అర‌టి పండుగా మారిన బిజేపీ టీడీపీలో జోష్ నింపే దిశ‌గా లోకేశ్ పాద‌యాత్ర‌ క‌మ్యూనిస్టులు కూడా ఈసారి బాబు వెంటే బీఆర్ఎస్ ప్ర‌భావం శూన్య‌మే అంటున్న ప‌రిశీల‌కులు వైసీపీలో వ‌ర్గ‌పోరుకు వేదికైన నెల్లూరు రాజ‌కీయం 75 సీట్లలో ఓటమి ఖాయమని ఫిక్సయిన జగన్‌! ఆ స్థానాల్లో సిట్టింగులకు టికెట్లు ఇవ్వబోమని వెల్లడి వైసీపీలో అంత‌ర్గ‌త అసంతృప్తిపై ఐ-ప్యాక్ సంకేతాలు? విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు […]

  • వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు
  • టీడీపీ-జ‌న‌సేన క‌లిస్తే వైసీపీ తలకిందులే
  • ఆట‌లో అర‌టి పండుగా మారిన బిజేపీ
  • టీడీపీలో జోష్ నింపే దిశ‌గా లోకేశ్ పాద‌యాత్ర‌
  • క‌మ్యూనిస్టులు కూడా ఈసారి బాబు వెంటే
  • బీఆర్ఎస్ ప్ర‌భావం శూన్య‌మే అంటున్న ప‌రిశీల‌కులు
  • వైసీపీలో వ‌ర్గ‌పోరుకు వేదికైన నెల్లూరు రాజ‌కీయం
  • 75 సీట్లలో ఓటమి ఖాయమని ఫిక్సయిన జగన్‌!
  • ఆ స్థానాల్లో సిట్టింగులకు టికెట్లు ఇవ్వబోమని వెల్లడి
  • వైసీపీలో అంత‌ర్గ‌త అసంతృప్తిపై ఐ-ప్యాక్ సంకేతాలు?

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో, భారీ సీట్ల‌తో (23 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు) అధికారంలోకి వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. విప‌రీత‌మైన సంక్షేమ ప‌థ‌కాల మోజులో ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేస్తూ వ‌స్తోంది. వ్య‌క్తుల ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న కోట్లాది రూపాయ‌ల నిధుల వ‌ల్ల జీడీపీ పెరిగి ఉండొచ్చుకానీ, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని అతలాకుత‌లం చేసింది.

జగన్‌ సర్కారుపై కసితో ఉద్యోగులు

ఉద్యోగుల విష‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చలేక‌పోయారు. సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో మాట మార్చారు. పీఆర్‌సీ ఇస్తే ఎక్క‌డైనా ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి, కానీ జ‌గన్ ప్ర‌భుత్వం ఇచ్చిన పీఆర్‌సీతో వ‌స్తున్న జీతాలే త‌గ్గాయి. చాలా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 61 ఏళ్ల‌కు పెంచినా, రిటైర్డ్ అయ్యాక ఇవ్వాల్సిన చెల్లింపులు ఏళ్ల‌కు ఏళ్లు పెండింగులో ఉంటున్నాయి.

కొవిడ్ స‌మ‌యంలో విధి నిర్వ‌హ‌ణ‌లో చ‌నిపోయిన కుటుంబాల‌కు ఈ రోజు వ‌ర‌కూ ప‌రిహారం అంద‌లేదు, కారుణ్య నియామ‌కాల కింద ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదు. ఉద్యోగుల పీఎఫ్‌, జీపీఎఫ్‌ సొమ్మును కూడా ఇత‌ర ప‌థ‌కాల‌కు వాడేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డానికి ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలు కాచుకుని ఉన్నాయి.

ఇంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడు ఏ ప్ర‌భుత్వ‌మైనా ఉద్యోగుల వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే నిర్ణ‌యాలు తీసుకుంటుంది. కానీ, జ‌గ‌న్ మొండిత‌నంతో వారికి ఫేస్ యాప్ అమ‌లు చేసి పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల‌లో ఉద్యోగులు ఏ విధంగా క‌సి తీర్చుకుంటార‌నేది ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక కానీ జ‌గ‌న్ అండ్ కోకు అర్థం కాదని రాజకీయ పరిశీలకులకు అంటున్నారు.

రైతులూ గుర్రుగానే..

రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, నాలుగేళ్లు కావొస్తున్నా పేద‌ల‌కు ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. రైతుల‌కు చంద్ర‌బాబు హ‌యాంలో వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు, డ్రిప్‌, ట్రాక్ట‌ర్లు, ఎరువులు, క్రిమిసంహాక‌ర మందులు, పండ్ల‌తోట‌ల పెంప‌కానికి ప్రోత్సాహ‌కాలు భారీ స‌బ్సిడీతో అందాయి. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రైతుల‌కు ఏడాదికి రెండు విడుత‌ల్లో ఇచ్చే 13 వేలు మిన‌హా ఇత‌ర‌త్రా ప్రోత్సాహం లేదు. గిట్టుబాటు ధ‌ర‌లు లేవు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ పేరుతో స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు ఉచిత బోర్లు వేస్తామ‌న్న హామీ కూడా అట‌కెక్కింది. దీంతో రైతులు కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై గుర్రుగానే ఉన్నారు.

మందుబాబుల చిందులు

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నాసిర‌కం మ‌ద్యం కూడా జ‌గ‌న్ స‌ర్కారుప‌ట్ల మందుబాబుల తీవ్ర వ్య‌తిరేక‌త‌కు బీజం వేసింది. చీప్‌లిక్క‌ర్ రేట్లు భారీగా పెర‌గ‌డం, లోక‌ల్ బ్రాండ్ల రేట్లు ప్రీమియం బ్రాండ్ల మ‌ద్యానికి మించి ఉండ‌టం, క‌నీసం ఇష్ట‌మైన బీర్లు కూడా ఏపీ మ‌ద్యం దుకాణాల్లో దొర‌క‌ని ప‌రిస్థితి మ‌ద్యం ప్రియుల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మవుతున్నది.

న్యూట్రల్‌ ఓటర్లలోనూ అయిష్టత

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను, మీడియాను, ఉద్యోగ‌, కార్మిక సంఘాల నేత‌ల‌ను ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నోరెత్త‌కుండా చేయ‌డానికి సిఐడి పోలీసుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాడిన‌ట్లు ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ వాడ‌లేద‌నే చెప్పాలి. ఇది చూడ్డానికి రాజ‌కీయ పార్టీల‌కు మాత్ర‌మే ఇబ్బందిక‌ర‌మైన విష‌యంగా క‌న‌బ‌డినా, ప్ర‌జాస్వామ్య‌వాదులెవ‌రూ జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రిని జీర్ణించుకోవ‌డం లేదు.

ఈ ర‌కంగా న్యూట్ర‌ల్ ఓటు బ్యాంకును కూడా జ‌గ‌న్ కొంత పోగొట్టుకున్నార‌నే చెప్పాలి. రాష్ట్రంలో ఏ ఒక్క కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌లేదు, కొత్త‌గా ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌లేదు. తొలి ఏడాదిలో స‌చివాల‌య ఉద్యోగుల నియామ‌కం మిన‌హా త‌రువాత ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ ముందుకు సాగ‌లేదు.

రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లే కీల‌కం

2019 ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్లే వచ్చినా, ఓట్లు మాత్రం 40 శాతం వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో కూడా జ‌న‌సేనతో క‌లిసి టీడీపీ పోటీ చేసి ఉంటే ఇంత దారుణంగా ఓడిపోయే ప‌రిస్థితి ఉండేది కాదు. ఈ త‌ప్పు తెలుసుకున్న చంద్ర‌బాబునాయుడు, వైజాగ్‌లో జన‌సేన ఆవిర్భావ స‌భ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడ్డంకులు క‌ల్పించ‌గానే అవ‌కాశం అందిపుచ్చుకున్నారు. హుటాహుటిన ప‌వ‌న్‌తో విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు ఉంటుంద‌నే సంకేతాల‌కు ఈ భేటీ బ‌లం చేకూర్చింది.

ఏపీలో ఇప్పుడున్న వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ - జనసేన పొత్తు కుదిరితే ఆ కూట‌మికి 100 సీట్ల‌కు మించి ఎమ్మెల్యేలు గెల‌వ‌డం ఖాయ‌మంటున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే చెబుతున్నారు. అందుకే కాపు ఓటుబ్యాంకును క‌లుపుకోవ‌డానికి జ‌న‌సేన‌తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డానికి నిర్ణ‌యించుకుంద‌ని అంటున్నారు.

కానీ జ‌గ‌న్ మాత్రం సింహం సింగ‌ల్‌గానే వ‌స్తుంది అంటూ సినిమా డైలాగులు చెబుతున్నా, లోలోప‌ల ఈసారి గెలుపు అంత ఈజీ కాద‌నే విష‌యం గ్ర‌హించారు. అందుకే ప్ర‌స్తుతం ఉన్న 151 మంది అభ్య‌ర్థుల్లో 75 మందికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ లేద‌నే విష‌యం స్ప‌ష్టం చేశారు. అంటే ఆ 75 సీట్లు ఓడిపోతామ‌నే క్లారిటీ జ‌గ‌న్ కు ఉంద‌నే చెప్పాలి. జ‌గ‌న్‌కు బీజేపీ లోపాయికారిగా స‌హ‌క‌రించినా పెద్ద‌గా లాభ‌ప‌డేదేమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీ ఎంత గింజుకున్నా 5 శాతం ఓటు బ్యాంకు కూడా దాటే ప‌రిస్థితి లేదు.

వైసీపీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేనా?

2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు వ‌చ్చాయి. అందువ‌ల్లే 151 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మ‌రి జ‌గ‌న్ మ్యాజిక్ ఫిగ‌ర్ సంఖ్య‌పైనే ఫోక‌స్ చేసి ఇప్ప‌టికే వ్యూహం అమ‌లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. కానీ టీడీపీ-జ‌న‌సేన‌- వామ‌ప‌క్షాలు క‌లిస్తే ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ చేరుకోవ‌డం జ‌గ‌న్ పార్టీకి కష్టమే.

పోలింగ్ కేంద్రాల్లో వలంటీర్ల సేవ‌ల‌ను వినియోగించుకుని ల‌బ్ధి పొందాల‌నుకుంటున్న వైసీపీ వ్యూహాన్ని తెలుగుదేశం దెబ్బ‌కొట్టేందుకు ఎంత‌ దాకా అయినా వెళుతుంద‌ని చెప్పాలి. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌తో ఈజీగా గ‌ట్టెక్క‌వ‌చ్చు అనే అతి విశ్వాసంలో ఉన్నా, టైట్ ఫైట్ ఉంటుందనే అంశాన్ని పరోక్షంగా వైసీపీ ముఖ్య‌నేత‌లే అంగీక‌రిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 1.95 శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారం కోల్పోయింది.

అయితే, ఇప్పుడు జనసేన-టీడీపీ మైత్రితో వైసీపీకి అదే గ‌తి ప‌ట్ట‌ద‌నే గ్యారంటీ ఏమిట‌ని వైసీపీ సీనియ‌ర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇక‌ బీజేపీ ఎక్కడా జనసేనతో దూరం అవుతామనే అంశం చెప్పటం లేదు. అంటే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబుకూట‌మి అధికారంలో వ‌స్తుందంటే బీజేపీ గోడ దూక‌డానికి నిముషం కూడా ఆల‌స్యం చేయ‌దు.

వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌ర్గ‌పోరు

అసలే వివిధ వర్గాల ఆగ్రహానికి గురవుతున్న జగన్‌ సర్కారుకు సొంత పార్టీలో లుకలుకలు తలనొప్పిగా పరిణమించాయి. అధికార పార్టీలో ప‌ద‌వుల పంప‌కంలో తేడాల‌తో అక్క‌డ‌క్క‌డా అసంతృప్తులు ఉండ‌టం స‌హ‌జం. కానీ వైసీపీలో జ‌గ‌న్ మాటే శాస‌నం. అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల అక్క‌డ‌క్క‌డా అసంతృప్తులు బాహాటంగానే వైసీపీ ఓడిపోతుంద‌ని మాట్లాడుతున్నారు.

ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేళ్లు కావొస్తున్నా.. ఒక్క అభివృద్ధి ప‌ని కూడా చేయ‌లేక శాస‌న‌స‌భ్యులు ప‌డుతున్న మాన‌సిక సంఘ‌ర్ష‌ణ అంతా ఇంతా కాదు. అదే విష‌యాన్నే నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామ‌నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

వీరంటే బయటపడ్డారు. కానీ.. లోలోప‌ల ర‌గులుతున్న ఎమ్మెల్యేలు ఎంద‌రో ఉన్నారని అంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ఇలాంటివి మ‌రిన్ని బ‌య‌ట‌ప‌డొచ్చు. ఐ-ప్యాక్ స‌ర్వేలో కూడా వైసీపీలో అంత‌ర్గ‌తంగా అసంతృప్తి మెండుగా ఉంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసింద‌ని చెబుతున్నారు. దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగానే గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం షురూ చేశారంటున్నారు.

ముంచ‌నున్న మూడు రాజ‌ధానుల నినాదం

మింగ‌డానికి మెతుకులేదు, మీసాల‌కు సంపెంగ నూనె అన్న‌ట్లుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రి. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదికే మూడు రాజ‌ధానులంటూ హ‌డావిడి చేసినా సాధించింది లేదు. కోర్టులు, కేసుల‌తో అది అడుగు ముందుకు ప‌డ‌టంలేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన కృష్ణా, గుంటూరు,ప్రకాశం జిల్లాల ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని కాద‌నుకున్నందుకు జ‌గ‌న్‌పై గుర్రుగా ఉన్నారు.

పోనీ రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని తెచ్చారా? అంటే అదీ లేదు. క‌ర్నూలులో హైకోర్టు పేరుతో సీమ‌కు కూడా జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని రాయ‌ల‌సీమ‌వాదులు మండిప‌డుతున్నారు. అమ‌రావ‌తి అయినా కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండేది సీమ జిల్లాల‌కు, అలాంటిది విశాఖ‌కు త‌ర‌లిస్తే మా ప‌రిస్థితి ఏంట‌ని నిల‌దీస్తున్నారు. ఇటు అమ‌రావ‌తి ప్రాంతంలోనూ, రాయ‌ల‌సీమ‌లోనూ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌కు ఆమోదం లేదు.

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లైనా హ‌ర్షిస్తున్నారా అంటే వాళ్లు అస‌లు మాకేంటి ఉప‌యోగం అన్న‌ట్లు మాట్లాడుతు న్నారు. గుంత‌లు ప‌డ్డ రోడ్డును మ‌ట్టితో పూడ్చ‌డానికే మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల హామీని నెర‌వేరుస్తుందంటే న‌మ్మ‌డానికి ఏపీ ప్ర‌జ‌లు ఏమీ వెర్రి వెంగ‌ళప్ప‌లు కాదు. ఊరుకున్న‌ ప్రాణానికి ఉప‌ద్ర‌వం తెచ్చుకోవ‌డం అంటే ఏంటో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నినాదం ఒక ఉదాహ‌ర‌ణగా చెప్పుకునే ప‌రిస్థితి.

బీఆర్‌ఎస్‌ బీఫాం అడిగే వారేరి?

బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో అభ్య‌ర్థుల‌ను పోటీ చేయించి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును మ‌ళ్లించ‌వ‌చ్చ‌న్న వ్యూహం కూడా బెడిసికొట్టేట‌ట్లే ఉంది. ఏపీలో ఆ పార్టీ బీ-ఫాం అడిగే దిక్కుకూడా ఈ సారి ఎన్నిక‌ల్లో ఉండ‌ద‌న్న‌ది ఎన్నిక‌ల విశ్లేష‌కుల మాట‌.

Updated On 1 Feb 2023 12:40 PM GMT
Somu

Somu

Next Story