Revanth Reddy | ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయం అందుకే మోదీ జమిలి ప్రతిపాదనలు బీఆరెస్, బీజేపీ ఒక్క తాను ముక్క‌లే.. జమిలిపై బీఆరెస్‌ వైఖరిని చెప్పాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత‌, హైద‌రాబాద్‌: అధ్య‌క్ష త‌ర‌హా ఎన్నిక‌లు తెచ్చేందుకే వ‌న్ నేష‌న్ వ‌న్ ఎలక్ష‌న్ (జమిలి ఎన్నిక) విధానం బీజేపీ తీసుకు వస్తున్నదని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విధానం తీసుకురావ‌డం వెనుక పెద్ద […]

Revanth Reddy |

  • ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
  • ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయం
  • అందుకే మోదీ జమిలి ప్రతిపాదనలు
  • బీఆరెస్, బీజేపీ ఒక్క తాను ముక్క‌లే..
  • జమిలిపై బీఆరెస్‌ వైఖరిని చెప్పాలి
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: అధ్య‌క్ష త‌ర‌హా ఎన్నిక‌లు తెచ్చేందుకే వ‌న్ నేష‌న్ వ‌న్ ఎలక్ష‌న్ (జమిలి ఎన్నిక) విధానం బీజేపీ తీసుకు వస్తున్నదని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విధానం తీసుకురావ‌డం వెనుక పెద్ద కుట్ర దాగుంద‌న్నారు. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇది దేశ ప్ర‌జాస్వామ్యానికి పెను ప్ర‌మాద మ‌న్నారు. గ‌త‌ కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్నదన్న రేవంత్‌.. దీనిని ఎందుకు లేవ‌దీశార‌న్న విష‌యాన్ని గుర్తించ‌డానికి దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మోదీ గ‌ల్లీగల్లీ తిరిగినా కర్ణాటకలో ఓడించారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మోదీ గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేసినా అక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారని రేవంత్‌రెడ్డి అన్నారు. మణిపూర్ అంశం చర్చకు వచ్చినా మోదీ పార్లమెంటులో మాట్లాడ‌లేద‌న్నారు. పైగా మణిపూర్‌పై చర్చించకుండా ఇతర అంశాలతో ప్రజలను పక్కదారి పట్టించార‌ని విమర్శించారు.

5 రాష్ట్రాల‌లో కాంగ్రెస్‌..

ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడతాయని సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చారని రేవంత్‌రెడ్డి చెప్పారు. సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్‌కు 38 శాతం అవకాశం ఉంటే, బీఆరెస్‌కు 31 శాతం మాత్రమే అవకాశం ఉందని తేలిందన్నారు. బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే తెర‌పైకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకు వ‌చ్చార‌న్నారు. ఇండియా కూటమి వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకమని చెప్పారు. అందుకే అధీర్ రంజన్ కమిటీ నుంచి వైదొలిగారని తెలిపారు.

అనుకూల‌మ‌ని నాడు లేఖ రాసిన కేసీఆర్‌

2018లో జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విష‌యాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వివిధ ర‌కాల ఎన్నిక‌ల‌కు వ‌స్తున్న ఎలక్షన్ కోడ్‌లతో రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం క‌లుగుతుంద‌ని కేసీఆర్ స్వయంగా రాసిన‌ లేఖను బీ వినోద్ కుమార్‌కు ఇచ్చి చౌహన్‌కు పంపించార‌ని తెలిపారు.

బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున కేసీఆర్ జ‌మిలి ఎన్నిక‌ల‌పై బీఆరెస్ వైఖరి ఏమిటో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేఖ రాయ‌డం ద్వారా బీజేపీ విధానాలకు మీరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టే కదా? అని అడిగారు. జమిలి బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలన్నారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం క‌లుగుతుందని చెప్పారు.

బీజేపీది వన్‌ నేషన్‌.. వన్‌ పార్టీ

ఈ దేశం రాష్ట్రాల సమూహమ‌న్న రేవంత్.. ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకోవడానికి జరిగే కుట్ర జమిలి అని చెప్పారు. ఈ కుట్రను తాను ముందుగానే ఊహించి లోక్‌సభలో ప్రస్తావించాన‌న్నారు. బీజేపీ ది వన్ నేషన్ వన్ పార్టీ విధానం అని చెప్పాన‌ని గుర్తుచేశారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకూ బీఆరెస్ మద్దతు ఇచ్చిందని రేవంత్ ఆరోపించారు.

బీజేపీ, బీఆరెస్ వేరు వేరు కాదు.. అవి ఒకే తాను ముక్కలన్నారు. అధ్యక్ష తరహా ఎన్నికలను తీసుకొచేందుకే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం తీసుకు వ‌చ్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగుందని, అది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమ‌ని హెచ్చ‌రించారు.

అధ్యక్ష తరహా పాలనతో ప్రమాదంలో దక్షిణాది ఉనికి

అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారత దేశం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని రేవంత్ తెలిపారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే బీజేపీ కి అనుకూలమనుకోవాలా? అని అన్నారు. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటో ప్రజలకు విస్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు.

దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి అని రేవంత్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ని వన్ నేషన్,వన్ ఎలక్షన్ కమిటీకి చైర్మన్ గా నియమించి ఆ పదవికి కళంకం తెచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు తెచ్చినా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, బీజేపీ మెడలు వంచుతుందన్నారు.

Updated On 3 Sep 2023 11:21 AM GMT
krs

krs

Next Story