విధాత: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కే. జానారెడ్డి (K. Janareddy) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడి (CWC) పదవి రేసులో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీడబ్ల్యూసీలో స్థానం దక్కించుకునేందుకు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు.
ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackeray), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) లతో జానారెడ్డి చర్చించారు. సీడబ్ల్యూసీ పదవి రేసులో తెలంగాణ నుండి జానారెడ్డితో పాటు సీతక్క (Sitakka)పేర్లు వినిపిస్తున్నాయి. సీతక్కకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆశీస్సులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
అయితే అటు ఏపీ నుండి టి. సుబ్బరామిరెడ్డి (T. Subbarami Reddy) కూడా సీడబ్ల్యుసీ రేసులో ఉండగా ఆయనకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తుంది. సీడబ్ల్యూసీలో స్థానం ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో ల్యాబియింగ్ చేస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు సీడబ్ల్యుసీలో స్థానం కల్పించాలని గట్టిగా కోరుతున్న జానారెడ్డి ఈ విషయమై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఢిల్లీ బయలుదేరారు.