- బాత్రూం మెయింటెనెన్స్ పట్ల ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయనో ఎమ్మెల్యే అయినా.. ఆ హోదా ఏమి పట్టించుకోకుండా టాయిలెట్లను శుభ్రం చేశారు. ఇదేదో ఆయన ఇంట్లోనో.. సొంత కార్యాలయంలోనో ఈ పని చేయలేదు. గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ల మెయింటెనెన్స్ పట్ల నిర్లక్ష్యాన్ని చూసి ఆయనే స్వయంగా చీపురు బట్టి సాఫ్ చేయడం ప్రారంభించారు.
అందరు చూస్తుండగానే స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో చెయ్యి వేసుకోకుండానే పాఠశాల ఉపాధ్యాయుల చెంప చెల్లుమనిపించారు. తరచూ వివాదాల్లో నిలిచే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ విషయంలో మాత్రం మార్కులు కొట్టేశారు.
లింగంపల్లి పాఠశాలలో
మన ఊరు-మన బడిలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాఠశాలలో బాత్రూంలు కడగకుండా అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చీపురు పట్టి ఆయనే స్వయంగా టాయిలెట్స్ శుభ్రం చేశారు.