- ఎమ్మెల్యేపై కుమార్తె భవాని రెడ్డి ఫిర్యాదు
- సంచలనంగా మారిన వివాదం
- విపక్ష కుట్ర అంటున్న ఎమ్మెల్యే
- కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri) ని భూమి సమస్య వదలడం లేదు. భూమి చుట్టూ సమస్యలు తిరుగుతూ ఉంటాయి. గతంలో ఆయనపై పలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఇతరుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజాగా ముత్తిరెడ్డి బిడ్డ తుల్జా భవాని రెడ్డి ఆయనపై ఫోర్జరీ చేసి భూమి విక్రయించాడని ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. సొంత కుటుంబ సభ్యుల నుంచి ఇలాంటి ఫిర్యాదు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తండ్రిపై కూతురు ఫిర్యాదు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని సమాచారం. ఆయన బిడ్డ తుల్జా భవాని ఆయనపై కేసు పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల లోని 1200 గజాల స్థలాన్ని విక్రయించారని తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఈ భూమిపై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో చెరువు భూమి ఆక్రమించాడని ఎమ్మెల్యే పై ఈ స్థలం విషయంలో ఆరోపణలు వచ్చాయి.
తనపై ఫిర్యాదు విపక్షాల కుట్ర: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
తన బిడ్డ తనపై ఫోర్జరీ చేశాడని ఫిర్యాదు చేయడం విపక్షాల కుట్రగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభివర్ణించారు. జనగామలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కుటుంబ తగాదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైంది కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ప్రత్యర్ధులు ఇలాంటి కుట్రలకు పాల్పడడం మంచి సాంప్రదాయం కాదన్నారు. నేను తప్పు చేస్తే మా అధినేత సహించడని అన్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో 1402 సర్వేనెంబర్లో 1200గజాల స్థలం నా బిడ్డ పేరుమీద రిజిస్ట్రేషన్ ఉంది. ఎలాంటి ఫోర్జరీ జరుగలేదు. కుటుంబ తగాదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైనది కాదని, అందరికీ కుటుంబాలు ఉంటాయని అన్నారు. ధర్మాధర్మాలు ప్రజలకే వదిలేస్తున్నాను. ప్రత్యర్ధులకే వదిలేస్తున్నానంటూ ఎమ్మెల్యే కంటతడి పెట్టారు.