విధాత : చాలా ఆఫీసులలో చాలా మంది ఉద్యోగులు ఒక్క దమ్ము గుంజితే హుషారుగా పని చేయవచ్చని.. మధ్యమధ్యలో సిగరెట్ తాగటానికి బయటకు వెళుతుంటారు. అదే విధంగా బయటకు వెళ్లిన ఒక ఉద్యోగికి జపాన్‌కు చెందిన సంస్థ ఏకంగా 14,700 డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 12 లక్షల రూపాయలు జరిమానా విధించింది.
సిగరెట్ తాగటానికి బయటకు వెళ్లినంత మాత్రాన ఇంత ఫైన్ వేస్తారా? అని అనుకుంటున్నారేమో.. ఆయన తన పద్నాలుగేళ్ల ఉద్యోగ జీవితంలో మొత్తం 4,500 సిగరెట్ బ్రేక్‌లు తీసుకున్నాడట. అంటే.. విధుల్లో ఉన్న సమయంలో 355 గంటల 19 నిమిషాల పాటు పొగతాగే పనిలోనే ఉన్నాడట. ఇది క్రమశిక్షణారాహిత్యమేనని, అందుకని ఇచ్చిన జీతంలో 1.44 యెన్‌లు వాపసు చేయాలని తాఖీదులు అందాయి.
ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈ 61 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ఇద్దరిపైనా ఇటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఒసాకా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోనందుకు ప్రతి నెలా వేతనంలో 10శాతం కోత విధించినా ఆయన తన తీరు మార్చుకోలేదట.
ఈ ముగ్గురూ భారీ స్థాయిలో పొగాకును ఆఫీసులో రహస్యంగా నిల్వ చేశారని బయటకు తెలియడంతో, మరోసారి పొగతాగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని గతంలో వార్నింగ్ కూడా ఇచ్చారట. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్న మాట పొరపాటున జపాన్ భాషలో విన్నాడేమో.. ఎన్ని వార్నింగ్‌లు అందినా.. తన తీరు మాత్రం మార్చకోలేదు.
ఒకాసాలో కఠిన నిబంధనలు
బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై ఒకాసా నగరంలో చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ అంతటి కఠిన నిబంధనలు ఉండవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పొగతాగడంపై 2008లో పూర్తిస్థాయి నిషేధం విధించారు. విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సిగరెట్లు వెలిగించరాదని 2019లో చట్టం చేశారు.
అయితే.. ఆఫీసులో కాకుండా వేరే చోటుకు వెళ్లి సిగరెట్ తాగి రావడం అంటే పెద్ద ఎత్తున సమయం వృథా అవుతుందని కొందరు వాదిస్తున్నారు. సిగరెట్ తాగడం టైమ్ వేస్ట్ అయితే.. ఆఫీసులో చాయ్‌లు తాగుతూ, స్నాక్స్ తింటూ గడిపేవారు, ముచ్చట్లలో మునిగిపోయేవారు సమయం వేస్ట్ చేయడం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాయింటే!