- ఏపీ అప్పుల మీద లెక్కలు కావాలట!
విధాత: ఉద్దానంలో కిడ్నీ రోగుల కోసం కడుతున్న ఆస్పత్రిని చూసి జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తారు… రోడ్లమీద మీటింగులు.. యాత్రలూ పెట్టడాన్ని నియంత్రిస్తూ జీవో -1 తేవడాన్ని కూడా సమర్ధిస్తారు.. సరే మరి అదే టెంపోలో పోకుండా మధ్యలో ఈ కెలుకుడు ఎందుకు జెడి గారూ.. కొత్త గవర్నర్‌కు లేనిపోని సలహాలు ఇస్తూ YS Jagan Mohan Reddy ప్రభుత్వాన్ని గిళ్లడం ఎందుకూ అని వైసీపీ అభిమానులు సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ మీద సిరాకు పడుతున్నారు.
కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు తీసుకోగానే ఢిల్లీ పర్యటన పూర్తి చేశారు. కేంద్ర
ప్రభుత్వ పెద్దలను, రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కూడా కలిశారు. ఇదిలా ఉండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గవర్నర్‌కి తొలి విన్నపం చేశారు. అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పులు ఎన్ని దీని మీద ఒక శ్వేత పత్రం విడుదల చేయించండి అని కోరారు.
ఏపీ అప్పుల విషయంలో అనేక రకాలైన ప్రచారం సాగుతోందని ఒక్క దానికీ పొంతన లేదని అందువల్ల పూర్తి సమాచారంతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసేలా జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. జగన్ సర్కార్ దాదాపు రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ఈమధ్య కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది.
అయితే ఇటు జగన్ ప్రభుత్వం మాత్రం తాము పెద్దగా అప్పులు చేయలేదని, గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తక్కువే అని అంటోంది. దీంతోనే జేడీ లాంటి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఎంత అన్నది కచ్చితమైన వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈమేరకు జెడి గవర్నర్‌ను, జగన్‌కి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాక ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన కోరడం విశేషం. మరో వైపు వైసీపీ ప్రభుత్వం ఎటూ శ్వేత పత్రం రిలీజ్ చేయడానికి అంగీకరించదని అందువల్ల గవర్నర్ ఆదేశించాలని ఆయన కోరారు. మొత్తానికి ఉన్నట్టుండి జెడి ఇలా గవర్నర్‌ను కెలకడం వైసీపీ సర్కారుకు చికాగ్గానే పరిణమించింది.