విధాత: తెలంగాణ ఉద్యమకారుడు, యువజన సంఘాల సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఎన్నికల నామ సంవత్సరం శోభకృత్ పై భారీ ఆశలే పెట్టుకున్నట్లున్నారు. బుధవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తన అభిమానులకు, అనుచరులకు జిట్టా తెలుగు నూతన సంవత్సరం శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వినూత్నంగా తన రాజకీయ ప్రస్థానంపై బుక్ లెట్ పిడిఎఫ్ ను సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందు ఉంచారు.
బయోగ్రఫీని తలపించే రీతిలో రూపొందించిన ఆయన పొలిటికల్ బుక్ లెట్ లో జిట్టా బయోడేటా తో పాటు ఆయన యువజన, రాజకీయ, సేవా రంగాలలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. 1992లో వివేకానంద యువజన సంఘం స్థాపన, రాష్ట్రస్థాయిలో పదివేల యువజన సంఘాలతో కలిపి యువజన సంఘాల రాష్ట్ర సమితి ఏర్పాటు మొదలుకొని బిజెపిలో చేరే దాకా ఆయన రాజకీయ ప్రజాజీవన ప్రస్థాన వివరాలను తన బుక్ లెట్ లో పొందుపరిచారు.
జిట్టా రాధమ్మ ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు,106 ఫ్లోరైడ్ గ్రామాల్లో మూడున్నరకోట్లతో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, చిలుముల ఫౌండేషన్ తో కోటిన్నరతో భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం, గ్రామాల్లో పాఠశాలల నిర్మాణాలు, నిమ్స్ మెడికల్ యూనివర్సిటీ సాధనకు పోరాటం, ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి, 2005 ఏప్రిల్ 10 నుంచి 16వరకు చేపట్టిన మూసీ ప్రక్షాళన పాదయాత్ర, బునాదిగాని, పిల్లాయిపల్లి, బొల్లే పల్లి కాలువల సాధన ఉద్యమాలు, వాటి పరిణామాలను వివరించారు.
ముఖ్యంగా రాష్ట్రంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక, పర్యాటక వైభవాన్ని కళ్ల కు కట్టిన తెలంగాణ జాతర, సంబురాలు నిర్వహణను తెలంగాణ కు పరిచయం చేసిన వైనం, తొలిసారిగా రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం భువనగిరిలో ఏర్పాటు చేసిన ఘట్టాన్ని జిట్టా స్మరణకు తెచ్చారు.
2003లో కేసీఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్‌లో చేరిన క్రమం నుంచి 2004 ఎన్నికల్లో భువనగిరి టికెట్ ఆలే నరేంద్ర కోసం త్యాగం చేయడం, 2009లో మహాకూటమితో టీడీపీకి టికెట్ వెళ్లడం, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 34,720 ఓట్లతో రెండో స్థానంలో నిలవడాన్ని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో సీఎం వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన నుండి కాంగ్రెస్ యూ టర్న్‌తో ఆ పార్టీకి రాజీనామా, యువ తెలంగాణ జేఏసీ ఏర్పాటు , 2014, 2018 ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన తీరును కూడా జిట్టా ప్రజల ముందుంచారు.
రాణి రుద్రమతో కలిసి యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ ద్వారా సాగించిన ప్రజా ఉద్యమాలు, 2022 జూన్ 2న బిజెపిలో చేరిక, యువ తెలంగాణ పార్టీ విలీనం వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు ఏకరువు పెట్టారు. అలాగే భవిష్యత్తు రాజకీయాల్లో తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలంటూ జిట్టా కోరుకున్న తీరు రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి నాలుగో సారి పోటీ చేయాలన్న తన సంకల్పాన్ని వెల్లడించింది.