Rahul Gandhi | ఇదే ఇతివృత్తంతో ప్రజల్లోకి ఇండియా కూటమి 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రచార, సోషల్‌ మీడియా కమిటీలు కూడా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సాధ్యమైనంత త్వరలో సీట్ల షేరింగ్‌ పూర్తి ప్రజా సమస్యలపై అన్ని చోట్ల ర్యాలీలు ‘ఇండియా’ కూటమి నేతల నిర్ణయం ప్రతిపక్షాల ఐక్యతతోనే మోదీ ఓటమి వేదికపై 60% జనాభాకు ప్రాతినిధ్యం బీజేపీని విపక్షాలు ఓడించడం ఖాయం మోదీ అవినీతిని బయటపెట్టి తీరుతాం కాంగ్రెస్‌ ఎంపీ […]

Rahul Gandhi |

  • ఇదే ఇతివృత్తంతో ప్రజల్లోకి ఇండియా కూటమి
  • 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు
  • ప్రచార, సోషల్‌ మీడియా కమిటీలు కూడా
  • పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు
  • సాధ్యమైనంత త్వరలో సీట్ల షేరింగ్‌ పూర్తి
  • ప్రజా సమస్యలపై అన్ని చోట్ల ర్యాలీలు
  • ‘ఇండియా’ కూటమి నేతల నిర్ణయం
  • ప్రతిపక్షాల ఐక్యతతోనే మోదీ ఓటమి
  • వేదికపై 60% జనాభాకు ప్రాతినిధ్యం
  • బీజేపీని విపక్షాలు ఓడించడం ఖాయం
  • మోదీ అవినీతిని బయటపెట్టి తీరుతాం
  • కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ

ముంబై: ప్రతిపక్షాల విశాల ఐక్యతతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ‘ఇండియా’ ఘన విజయం సాధిస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో రెండు రోజుల సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, సీట్ల సర్దుబాటుపై చర్చలను వెంటనే మొదలు పెట్టి సాధ్యమైనంత తర్వగా కొలిక్కి తేవాలని కూడా తీర్మానించారు.

సమన్వయ కమిటీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌, ఆర్జేడీ నేత, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, సమాజ్‌వాది పార్టీ నుంచి జావేద్‌ఖాన్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, సీపీఐ నేత డీ రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. సీపీఎం నుంచి ఎవరు ఉంటారనేది ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. కమిటీ సారథిని ఇంకా ప్రకటించలేదు.

సమావేశం తీర్మానాలను శివసేన (ఉద్ధవ్‌) నేత ఆదిత్య ఠాక్రె ముంబైలో వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరలో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించినట్టు ఆదిత్య ఠాక్రె తెలిపారు. జోడేగా భారత్‌.. జీతేగా ఇండియా అనే ఇతివృత్తాన్ని భిన్న స్థానిక భాషల్లో ఉపయోగిస్తూ కూటమి కార్యకలాపాలు నడుస్తాయని పేర్కొన్నారు. సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే బీజేపీ గెలుపు అసాధ్యమని అన్నారు. ‘ఈ వేదిక 60% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.

ఈ వేదికపై ఉన్న పార్టీలు ఐక్యంగా ఉంటే.. బీజేపీ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’ అని ఆయన చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రభావం చూపేలా ఈ ఐక్యత ఉండాలని అన్నారు. రెండు రోజుల సమావేశాల్లో రెండు పెద్ద నిర్ణయాలు తీసుకున్నామన్న రాహుల్‌.. 14 మందితో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని, సీట్ల సర్దుబాటు చర్చలను, నిర్ణయాలను వీలైనంత వేగవంతం చేయాలని తీర్మానించామని చెప్పారు. ఇండియా కూటమి బీజేపీ ఓడిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కూటమిలోని నాయకులకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్‌.. ‘కూటమి నేతల మధ్య ఏర్పడిన సంబంధాలే ఈ కూటమి అసలు పని’ అని అన్నారు.

ఈ సమావేశాలు నేతల మధ్య గొప్ప సాన్నిహిత్యాన్ని కలిగించాయని, కలిసికట్టుగా పనిచేసేందుకు సహకరించాయని తాను విశ్వాసంతో చెప్పగలననని అన్నారు. వివిధ అంశాలపై మాట్లాడుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని తాను గమనించానని చెప్పారు. కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టేసిన తీరు తన మనసుకు హత్తుకున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రాహుల్‌గాంధీ.. ఇండియా కూటమి బీజేపీ ప్రభుత్వ, మోదీ అవినీతిని బట్టబయలు చేసి తీరుతుందని, నిరూపిస్తుందని స్పష్టం చేశారు.

అదానీ గ్రూప్‌ విషయంలో తాజాగా వచ్చిన అభియోగాలను ప్రస్తావించిన రాహుల్‌.. ‘ప్రధాన మంత్రికి, ఒక ప్రత్యేక వ్యాపారవేత్తకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతి ఒక్క వ్యక్తి చూడొచ్చు’ అని చెప్పారు. తాను గురువారం కూడా మీడియాతో మాట్లాడుతూ జీ20 దేశాల సదస్సు జరుగబోతున్నదని, ఈ సమయంలో ప్రధాని తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పి, అదానీ విషయంలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించడంపై భారతదేశ విశ్వసనీయత ఉంటుందని చెప్పానని గుర్తు చేశారు.

దేశంలోని పేద ప్రజలనుంచి డబ్బు వసూలు చేసి.. వాటిని కొద్దిమంది చేతుల్లో పోయడమే మోదీ ప్రభుత్వ ఆలోచన అని దుయ్యబట్టారు. అంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఇండియా కూటమి నానాటికీ బలపడుతుండటంతో ప్రతిపక్ష నాయకులపై దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గణనీయంగా పెంచిందని ఆరోపించారు.

బీజేపీ నిరంకుశ పాలనలో రైతులు, యువత, మహిళలు, బలహీనవర్గాలు, మధ్యతరగతి, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు సహా సమాజంలోని అన్ని వర్గాలు కష్టాలు అనుభవించాయని చెప్పారు. అమాయకులైన రైలు ప్రయాణికులపై, స్కూలు పిల్లలపైనా విద్వేషపూరిత నేరాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. ఇదిలా ఉంటే.. ముంబై సమావేశంలో ప్రతిపక్ష నేతల గ్రూప్‌ ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేసిన ఖర్గే.. ‘భారత పౌరులు ఇంకెత మాత్రం మోసానికి గురికాకూడదు. 140 కోట్ల మంది భారతీయులు మార్పును కోరుకుంటున్నారు’ అని కామెంట్‌ చేశారు.

19 మందితో ప్రచార కమిటీ

గుర్దీప్‌ సింగ్‌ సప్పల్‌ (కాంగ్రెస్, సంజయ్‌ ఝా (జేడీయూ), అనిల్‌ దేశాయ్‌, పీసీ చాకో (ఎన్సీపీ), చాంపేయి సొరేన్‌ (జేఎంఎం), కిరణ్మయి నందా (సమాజ్‌వాది), సంజయ్‌సింగ్‌ (ఆప్‌), సంజయ్‌ యాదవ్‌ (ఆర్జేడీ), అరుణ్‌కుమార్‌ (సీపీఎం), బినోయ్‌ విశ్వం (సీపీఐ), విశ్రాంత జస్టిస్‌ హస్నయిన్‌ మసూదీ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), షాహిద్‌ సిద్దిఖీ (ఆరెల్డీ), ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ (ఆరెస్పీ), జీ దేవరాజన్‌ (ఏఐఎఫ్‌బీ) తదితరులు ఉంటారు.

సోషల్‌ మీడియా కమిటీ

సుప్రియా శ్రినతే (కాంగ్రెస్‌), సుమిత్‌ శర్మ (ఆర్జేడీ), అశీశ్‌యాదవ్‌ (ఎస్పీ), రాజీవ్‌ నిగం (ఎస్పీ), రాఘవ్‌ చద్దా (ఆప్‌), అవిందని (జేఎంఎం), ఇల్టిజా మెహబూబా (పీడీపీ), ప్రంజల్‌ (సీపీఎం), బాలచంద్రన్‌ కాంగో (సీపీఐ), ఇఫ్రా జా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), వీ అరుణ్‌కుమార్‌ (సీపీఎం), తృణమూల్‌ నుంచి పేరును తదుపరి ప్రకటిస్తారు.

Updated On 2 Sep 2023 1:46 AM GMT
somu

somu

Next Story