Joe Biden బైడెన్‌, మోదీ ద్వైపాక్షిక భేటీ అనంతరం జరుగని పాత్రికేయ సమావేశం ఇదీ మోదీ తరహా భారత ప్రజాస్వామ్యం మండిపడిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాట యుద్ధానికి తాజాగా జీ20 సమావేశాలు అంశం ముందుకు వచ్చింది. జీ20 నిర్వహణలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక సమావేశం అనంతరం వారిని ప్రశ్నలు అడిగేందుకు మీడియాను భారత్‌ అనుమతించలేదని […]

Joe Biden

  • బైడెన్‌, మోదీ ద్వైపాక్షిక భేటీ అనంతరం
  • జరుగని పాత్రికేయ సమావేశం
  • ఇదీ మోదీ తరహా భారత ప్రజాస్వామ్యం
  • మండిపడిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాట యుద్ధానికి తాజాగా జీ20 సమావేశాలు అంశం ముందుకు వచ్చింది. జీ20 నిర్వహణలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక సమావేశం అనంతరం వారిని ప్రశ్నలు అడిగేందుకు మీడియాను భారత్‌ అనుమతించలేదని కాంగ్రెస్‌ నేత జైరాంరమేశ్‌ ఆరోపించారు. ‘పదే పదే విజ్ఞప్తి చేసినా మీడియా ప్రశ్నలకు భారత్‌ అనుమతించలేదని ప్రెసిడెంట్‌ బైడెన్‌ బృందం చెబుతున్నది.

బైడెన్‌ సెప్టెంబర్‌ 11న వియత్నాం వెళుతున్నారు. అక్కడ తన వెంట ఉండే మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నారు. ఆశ్చర్యం ఏమీ లేదు.. ఇదీ మోదీ స్టైల్‌ ప్రజాస్వామ్యం తీరు’ అని జైరాం రమేశ్‌ విమర్శించారు. మరోవైపు.. దేశంలో పేదరికం బయటకు కనిపించకుండా ముసుగేశారని జీ20 సదస్సు తొలి రోజు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. బ్రస్సెల్స్‌లో ఉన్న రాహుల్‌.. ఈ మేరకు శనివారం ఒక ట్వీట్‌ చేశారు.

అతిథుల నుంచి భారతదేశ వాస్తవ దృశ్యాన్ని మరుగుపర్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం మన పేద ప్రజలను, జంతువులను కప్పిపెడుతున్నది’ అని పేర్కొన్నారు. జీ20 సదస్సు నేపథ్యంలో ప్రజలకు కనిపించకుండా ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో ఉన్న ఒక కూలీల క్యాంపును కప్పిపెట్టిన వీడియోను ఇటీవల కాంగ్రెస్‌ విడుదల చేసింది. మరో వీడియోలో వీధికుక్కలను క్రూరంగా ఉచ్చువేసి బంధిస్తున్న తీరును చూపించింది.

దిగజారుడు రాజకీయం

జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు తనను ఆహ్వానించకపోవడం మంచి రాజకీయం కాదని, దిగజారుడు రాజకీయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్ర ఇలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ సహా ఆ పార్టీ నేతలు పలువురు తీవ్రంగా స్పందించారు. 60శాతం భారతదేశానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వం గౌరవం చూపలేదని విమర్శించారు.

Updated On 10 Sep 2023 6:43 AM GMT
somu

somu

Next Story